iDreamPost
iDreamPost
చంద్రబాబునాయుడు వ్యవహారం చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలు బయటపడటం లేదు కానీ ప్రకాశం జిల్లా నేతల్లో మాత్రం తీవ్ర అసహనం మొదలైందని సమాచారం. ఇదంతా ఏ విషయంలో అంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ స్కీమ్ విషయంలోనే. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్ధ్యం పెంచాలని జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని కేసీయార్ తో పాటు తెలంగాణాలోని ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్న విషయం చూస్తున్నదే.
అదే సమయంలో ఏపిలో జగన్ నిర్ణయానికి బిజెపి తప్ప రెండోపార్టీ మద్దతే పలకలేదు. పైగా జగన్ ను చంద్రబాబు తప్పు పడుతూ పరోక్షంగా కేసీయార్ కే మద్దతుగా మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతున్నాడు. జగన్ నిర్ణయం అమల్లోకి వస్తే రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సాగు, తాగు నీరు అందుతుంది. ఈ విషయం తెలిసినా చంద్రబాబు మాత్రం రాజకీయకోణంలోనే జగన్ ను వ్యతిరేకిస్తున్నట్లుగా మాట్లాడుతున్నాడు.
మొన్నటి ఎన్నికల్లో రాయలసీమ, నెల్లూరులో టిడిపి దాదాపు తుడిచిపెట్టుకుపోయిందన్న విషయం అందరికీ తెలిసిందే. టిడిపి గెలిచిన 23 సీట్లలో ప్రకాశం జిల్లాలోనే నాలుగు సీట్లున్నాయి. జిల్లాలో ఓ ఎంపి సీటుతో పాటు 12 అసెంబ్లీలున్నాయి. వీటిల్లో ఎంపి సీటు వైసిపి ఖాతాలోనే పడినా అసెంబ్లీల్లో మాత్రం ఎనిమిదింటిలోనే గెలిచింది. టిడిపి చీరాల, పర్చూరు, అద్దంకి, కొండపి నియోజకవర్గాల్లో గెలిచింది.
విచిత్రమేమిటంటే జగన్ పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని చంద్రబాబు పిలుపిస్తే జిల్లాలోని ఒక్క ఎంఎల్ఏ కూడా స్పందించలేదు. ఇసుక కొరత, ఇంగ్లీషుమీడియం స్కూళ్ళు, ఇసుక అక్రమ రవాణా తదితర కారణాలతో నిరసన తెలపాలన్న చంద్రబాబు ఆదేశాలను ఎంఎల్ఏలు పట్టించుకోలేదు. అదే సమయంలో చీరాల ఎంఎల్ఏ కరణం బలరామ్ దాదాపు టిడిపిని వదిలేసినట్లే అంటున్నారు. కొడుకు కరణం వెంకటేష్ వైసిపిలో చేరిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ ముచ్చటను బలరామే దగ్గరుండి మరీ జరిపించాడు. మిగిలిన ముగ్గురు కూడా టిడిపిని వదిలేస్తారనే ప్రచారం బాగా జరుగుతోంది. అదే జరిగితే జిల్లాలో పార్టీ దాదాపు కుప్ప కూలిపోయినట్లే అనుకోవాలి.
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్ధం గనుక పెరిగితే ప్రకాశం జిల్లాలో కొంత భాగం కవర్ అవుతుంది. ప్రధాన ప్రాజెక్టు వెలిగొండే అయినా ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు పోతిరెడ్డిపాడు జలాలు కూడా అందుతుంది. అయితే ప్రస్తుతం చంద్రబాబు స్టాండ్ కారణంగా జిల్లాలోని జనాలు మండుతున్నారు. దాంతో మొన్నటి ఎన్నికలలో టిడిపికి వచ్చిన నాలుగు సీట్లయినా వచ్చే ఎన్నికల్లో వస్తాయా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తొందరలో జరగబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఈ విషయమై స్పష్టమైన సంకేతాలు కనబడటం ఖాయమని పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.