iDreamPost
android-app
ios-app

పవన్ కళ్యాణ్ సత్యాగ్రహి?

పవన్ కళ్యాణ్ సత్యాగ్రహి?

వేణు శ్రీ రామ్ దర్శకత్వంలో ‘పింక్’ రీమేక్ చిత్రం షూటింగ్ లో నిన్నటి నుంచి పవన్ కల్యాణ్ (పీకే) పాల్గొంటున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం జనవరి 27 నుంచి పీకే మరో సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.

జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రానికి పీకేతో ఖుషి, బంగారం చిత్రాలు నిర్మించిన ఎఎం. రత్నం నిర్మాత అని తెలుస్తోంది. పింక్ రీమేక్ గా వస్తున్న సినిమాకు “లాయర్ సాబ్” అనే టైటిల్ పరిశీలనలో ఉండగా క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా టైటిల్ కు సంబంధించి ఎటువంటి వార్తా బయటకు రాలేదు. నాలుగైదు రోజుల క్రితం ఈ చిత్రానికి సంబంధించిన ఫోటోషూట్ జరిగిందని ఒక వార్త చక్కర్లు కొట్టింది. దాదాపు పన్నెండేళ్ల క్రితం ఎఎం రత్నం నిర్మాణంలో, పీకే దర్శకుడిగా ‘సత్యాగ్రహి’ అనే సినిమా ప్రారంభమైంది. అంతకు ముందు వచ్చిన పీకే సినిమాల ప్రారంభోత్సవాలకు భిన్నంగా ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆర్భాటంగా ప్రారంభమైంది. శతచిత్ర దర్శకులు దాసరి నారాయణరావు గారు క్లాప్ కొట్టగా, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. విక్టరీ వెంకటేష్, రవితేజ, వీవీ వినాయక్, రేణూ దేశాయ్, అల్లు అర్జున్, నితిన్ లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

ఆ రోజున పీకే మాట్లాడుతూ అందరినీ కొడుతూ, రౌడీలా ప్రవర్తించే ఒక అబ్బాయిని క్లాస్ లీడర్ గా ఎంచుకోడానికి ఓటేయాల్సిందిగా తనను కొందరు కోరారని, అలా దురుసుగా ప్రవర్తించే అబ్బాయిని క్లాస్ లీడర్ గా ఎలా ఎంచుకోవాలని ? వారిని తిరిగి తాను ప్రశ్నిస్తే ‘రాజకీయాలంటే అవేననే సమాధానం తనకు ఏడో తరగతిలోనే ఎదురయ్యిందని చెప్పుకొచ్చారు. ఈ సంఘటన జరిగిన తర్వాత పదేళ్ల పాటు, ఆ తర్వాత తాను నటుడయ్యాక కూడా సమాజంలో అలాంటి సంఘటనలు ఎన్నో చూసి అసహనానికి లోనయ్యేవాడినని అన్నారు. అలా ఈ రోజు సమాజంలో జరుగుతున్న దురాగతాల్ని ప్రశ్నించే విద్యార్థి నాయకుడిగా తాను ‘సత్యాగ్రహి’ సినిమాలో నటించబోతున్నానని చెప్పారు. అప్పుడు విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్లో “లోక్ నాయక్” జయప్రకాశ్ నారాయణ్, చేగువేరా ల ఫోటోలు ఉంటాయి. ఆ రోజు  సినిమా ప్రారంభోత్సవంలో మాట్లాడిన మాటలే కొంచెం అటూ ఇటుగా మారుస్తూ “జనసేన” పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకూ పీకే చెబుతూనే ఉన్నారు.

ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ సినిమాలో నటిస్తున్నారంటే అది సందేశాత్మకంగా ఉండేలా చూసుకోవడం పరిపాటే. “సత్యాగ్రహి” ప్రారంభోత్సవం రోజున కల్యాణ్ మాటల్ని బట్టి అప్పుడు అనుకున్న కథను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసి ఇప్పుడు చేయబోతున్నారా అనే సందేహం కూడా సినీ అభిమానులకు కలుగుతోంది.