iDreamPost
android-app
ios-app

జ‌గ‌న్ అభివృద్ధి నిరోధ‌కుడా?

జ‌గ‌న్ అభివృద్ధి నిరోధ‌కుడా?

జ‌గ‌న్ వ‌చ్చిన త‌ర్వాత అభివృద్ధి ఆగిపోయింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ మునిగిపోయింది. ఇక పెట్టుబ‌డులు రావు. అంద‌రూ మ‌న‌ల్ని చూసి న‌వ్వుతున్నారు. జ‌గ‌న్ అభివృద్ధి నిరోధ‌కుడు —ఉద‌యం పేప‌ర్ తెర‌వ‌గానే జ‌గ‌న్ దూష‌ణా ప‌ర్వం ప్రారంభం. నిజంగా జ‌గ‌న్ వ‌ల్ల ఇన్ని ఘోరాలు జ‌రుగుతున్నాయా?

అన్యాయం జ‌రిగితే సామాన్యులు తిర‌గ‌బ‌డుతార‌ని మార్క్ కాలం నాటి సిద్ధాంతం. కానీ ప్ర‌యోజ‌నాలు దెబ్బ‌తింటే పెట్టుబ‌డిదారులు అంత‌కంటే ఎక్కువ తిర‌గ‌బ‌డుతారు. ప్ర‌భుత్వాన్ని దోషిగా నిల‌బెట్టాల‌ని చూస్తారు. దీనికి ప్ర‌జా ప్ర‌యోజ‌నాలు అనే ముసుగు కప్పుతారు. ముసుగులో గుద్దులాట అంటే ఇదే.

జ‌గ‌న్ చేస్తున్న ప‌నుల వ‌ల్ల లాభ‌మా, న‌ష్ట‌మా అనేది కాలం నిర్ణ‌యిస్తుంది. ఎందుకంటే ఒక‌ప్పుడు ఎమ్జీఆర్ మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం పెట్టిన‌ప్పుడు ఖ‌జానా ఖాళీ అని అంద‌రూ ఎత్తిపొడిచిన వాళ్లే. అదే ప‌థ‌కాన్ని ఎన్టీఆర్ ప్ర‌వేశ పెట్టిన‌ప్పుడు అధికారులు అంతా అడ్డుతగిలిన వాళ్లే. ఆ ప‌థ‌కం ప్ర‌యోజ‌నం ఏంటో కాలం నిర్ణ‌యించింది. అదే విధంగా జ‌గ‌న్‌కి కూడా కాలం మార్కులు వేస్తుంది త‌ప్ప , ఇప్పుడు తీర్పులు ఇస్తున్న వాళ్లంతా దొంగ అయ్య‌వార్లు.

భూమి దున్న‌కుండా పంట కోసుకోవ‌డం పెట్టుబ‌డిదారుడి ల‌క్ష‌ణం. బ్యాంకులు ప‌రిశ్ర‌మ‌ల‌కు, బ‌డాబాబుల‌కి వేల‌కోట్లు రాయితీలిస్తే అదంతా అభివృద్ధి. పేద‌ల‌కు రూపాయి డ‌బ్బులిస్తే అరాచ‌కం. వాళ్లంతా సోమ‌రులై పోతారు. తెల్లారిలేస్తే ఇంటి నిండా ప‌నివాళ్లు, తోట‌మాలులు , డ్రైవ‌ర్లు ఉన్న క‌ష్ట‌జీవులంతా ప్ర‌జ‌ల సోమ‌రిత‌నం గురించి మాట్లాడుతారు.

ఈ మ‌ధ్య చాలా మంది త‌ల్లులు , అమ్మ ఒడి ప‌థ‌కం కింద వ‌చ్చిన డ‌బ్బుల‌తో వాషింగ్‌మిష‌న్లు కొన్నారు. బ‌ట్ట‌లు ఉతికి ఉతికి చేతుల‌కి కాయ‌లు కాసిన ఆడ‌వాళ్లు, ఆ చాకిరీ నుంచి విముక్తి కోసం వాషింగ్ మిఫ‌న్ కొని సోమ‌రులుగా మారిపోయారు.

జ‌గ‌న్ వ‌చ్చిన త‌ర్వాత వ‌ల‌స‌లు పెరిగిపోయాయ‌ట‌. చంద్ర‌బాబు హ‌యాంలో రాయ‌ల‌సీమ నుంచి కొన్ని వేల మంది ప‌నుల కోసం వ‌ల‌స వెళ్లారు. దీనికి కూడా జ‌గ‌నే కార‌ణ‌మా? ఉపాధి కోసం వ‌ల‌స అనేది జీవితంలో ఒక భాగంగా మారింది. దీన్ని భూత‌ద్దంలో చూస్తే చంద్ర‌బాబు వైఫ‌ల్యాలే ఎక్కువ క‌నిపిస్తాయి.

ప‌క్క రాష్ట్రాల వాళ్లు మ‌న‌ల్ని చూసి న‌వ్వుతున్నారట‌. నిజానికి ఇక్క‌డి ప‌థ‌కాలు చూస్తే అక్క‌డి సామాన్యులు బాధ‌ప‌డుతున్నారు. గ‌తంలో గోవాకి వ‌ల‌స వెళ్లిన కుటుంబాలు, జ‌గ‌న్ ప‌థ‌కాల వ‌ల్ల అనంత‌పురానికి తిరిగి వ‌చ్చిన సంగ‌తి నాకు తెలుసు.

ఒకాయ‌న‌కి ఎక‌రా రూ.60 ల‌క్ష‌ల‌కి అమ్ముడుపోవ‌ల‌సిన భూమి, రూ.30 ల‌క్ష‌ల‌కి ప‌డిపోయింద‌ట‌. రూ.కోటి క‌ట్నాలు ఇవ్వాల్సిన వాళ్లు రూ.50 ల‌క్ష‌లే ఇవ్వ‌గ‌లుగుతున్నార‌ట‌. ఇవి జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌లా?

రాయ‌ల‌సీమ నుంచి ముంబ‌య్‌కి , ఉత్త‌రాంధ్ర నుంచి అండ‌మాన్‌కి వెళ్లి అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నారు. వాళ్ల గురించి మాట్లాడాల కానీ, రూ.30 ల‌క్ష‌లు రేటు త‌గ్గినంత మాత్రానా ఆ పెద్ద మ‌నిషి ఆక‌లితో చ‌చ్చిపోతాడా?

దావోస్‌కి వెళ్లి చంద్ర‌బాబు గ‌తంలో చంద్ర‌బాబు అద్భుతాలు చేసేవాడ‌ట‌. ఈ సారి జ‌గ‌న్ వెళ్ల‌కుండా రాష్ట్రాన్ని దెబ్బ‌తీశాడ‌ట‌. ఐదేళ్ల‌లో చంద్ర‌బాబు తెచ్చిన ప‌రిశ్ర‌మ‌లు రాష్ట్ర‌మంతా పొంగిపొర్లుతున్నాయి మ‌రి.

అమ‌రావ‌తి ఉద్య‌మాన్ని దేశ వ్యాప్త రైతాంగ ఉద్య‌మంగా మారుస్తామ‌ని ఒకాయ‌న అంటాడు. రైతు ఉద్య‌మం అంటే గిట్టుబాటు ధ‌ర కోసం , ద‌ళారీ వ్య‌వ‌స్థ నిర్మూల‌న కోసం, న‌కిలీ విత్త‌నాల‌ను అరిక‌ట్ట‌డం కోసం పోరాడేది కానీ, ఇలా భూముల ధ‌ర‌లు త‌గ్గిపోతే పోరాడేది కాదు. అమ‌రావ‌తిలో రైతులు న‌ష్ట‌పోతే వాళ్ల పోరాటానికి సానుభూతి, మ‌ద్ద‌తు ప్ర‌తి ఒక్క‌రూ ఇవ్వాల్సిందే. కానీ అక్క‌డ దోషి చంద్ర‌బాబు. ఆయ‌నే ఎవ‌ర్నో దోషిగా చూపిస్తూ పోరాటం చేస్తున్నాడు. అదే బాబు మాయాజాలం.

ప్ర‌శాంత్‌కిశోర్ చేసిన అద్భుతాల వ‌ల్లే జ‌గ‌న్ గెలిచాడ‌ట‌. లేదంటే చంద్ర‌బాబే గెలిచేవాడ‌ట‌. మ‌రి ఇన్ని ప‌త్రిక‌లు బాబుని మోసాయి. అవేమీ కూడా ప్ర‌శాంత్‌కిశోర్‌తో స‌మానం కాద‌న్న‌మాట‌.

క‌త్తికి సాన బ‌ట్టేవాడు కూడా యుద్ధంలో ముఖ్య‌మే కానీ, క‌త్తి లేకుండా ఎవ‌డూ యుద్ధంలో గెల‌వ‌లేడు.

ప్ర‌శాంత్ ఒక సాన‌రాయి అంతే!

జ‌గ‌న్‌ని పొగ‌డ‌డం నా ఉద్దేశం కాదు. జ‌గ‌న్ కొత్త‌గా ప‌నిచేయాల‌నుకున్నాడు. చేస్తున్నాడు. ఏటికి ఎదురీదితే అంద‌రూ న‌వ్వుతారు. ఒడ్డుకు చేరిన‌ప్పుడు ఆశ్చ‌ర్య‌పోతారు.

కారులో కూచుని మార్క్సిజం మాట్లాడేవాళ్ల‌కి , స్టార్ హోట‌ళ్ల‌లో స‌మాజం గురించి ఆందోళ‌న చెందేవారికి జ‌గ‌న్ అర్థం కాక‌పోవ‌చ్చు.

పేద‌వాళ్ల‌కి అర్థ‌మ‌వుతున్నాడు. ఎందుకంటే వాళ్ళు మార్క్స్‌ని , ఎక‌నామిక్స్‌ని చ‌దువుకోలేదు కాబ‌ట్టి.