iDreamPost
android-app
ios-app

ఢిల్లీనే అందరి కొంప ముంచేస్తుందా ?

  • Published Apr 01, 2020 | 4:30 AM Updated Updated Apr 01, 2020 | 4:30 AM
ఢిల్లీనే అందరి కొంప ముంచేస్తుందా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే టెన్షన్ పెరిగిపోతోంది. మొన్నటి వరకూ విదేశాల నుండి వచ్చిన వాళ్ళకే కొరోనా వైరస్ ఉందని నిర్ధారణైంది. అందుకే దాదాపు రెండు వారాలుగా 23 కేసులే నమోదయ్యింది. ఒకవైపు పొరుగునున్న తెలంగాణా, తమిళనాడు, కర్నాటకలో ఎక్కువ కేసులు నమోదవుతున్నా ఏపిలో మాత్రం 23 దగ్గరే ఆగిపోయింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైరస్ వ్యాప్తిని గట్టిగా నియంత్రణ చేస్తుండటంతో కేసులు బాగా కంట్రోల్ అయ్యిందనే చెప్పాలి.

సీన్ కట్ చేస్తే మార్చి 31వ తేదీతో సీన్ మారిపోయింది. ఢిల్లీలో జరిగిన జమాతే నిజాముద్దీన్లో మత ప్రార్ధనలు జరిగాయి. మార్చి 13-15వ తేదీన జరిగిన ప్రార్ధనల్లో పాల్గొనేందుకు 19 రాష్ట్రాలు, 16 దేశాల నుండి ప్రతినిధులు పాల్గొన్నారు,తెలుగు రాష్ట్రాల నుండి సుమారు 1500 మంది ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీ నుండి వెనక్కు వచ్చిన వారిలో చాలా మందికి కరోనా వైరస్ ఉందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే వెనక్కు వచ్చిన వాళ్ళని ప్రభుత్వాలు గుర్తించి పరీక్షలు చేయిస్తే ఏపిలో 17 మందికి వైరస్ ఉందని నిర్ధారణ అయ్యింది.

అలాగే తెలంగాణాలో కూడా పాజిటివ్ ఉందని నిర్ధారణ అయిన వారిలో ఒకేసారి ఆరుమంది మరణించారు. ఢిల్లీ దెబ్బకు రెండు ప్రభుత్వాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఎందుకంటే వందలమందికి చేసిన పరీక్షల రిజల్ట్స్ ఇంకా రావాల్సుంది. చూడబోతే ఇన్ని రోజులు విదేశాల నుండి వచ్చిన వాళ్ళవల్ల నమోదైన కేసుల కన్నా ఢిల్లీ నుండి వెనక్కి వచ్చిన మనదేశం వాళ్ళ వల్లే కేసుల సంఖ్య బాగా పెరిగిపోయేట్లుంది. నిజంగా అదేగనుక జరిగితే తెలుగు రాష్ట్రాలు చాలా ఇబ్బందుల్లో పడటం ఖాయమనే చెప్పాలి.

పైగా ఢిల్లీలో జరిగిన మత ప్రార్ధనల్లో తెలుగు రాష్ట్రాల నుండే కాదు తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున వెళ్ళారు. తమిళనాడుకు తిరిగి వచ్చిన వాళ్ళకు పరీక్షలు జరిపితే 35 మంది వైరస్ ఉందని తేలింది. అలాగే మహారాష్ట్రలో పరీక్షలు జరిపితే మరో 30 కేసులు నమోదయ్యాయి. అంటే జరుగుతున్నది చూస్తుంటే ఢిల్లీనే అందరి కొంపా ముంచేట్లే ఉంది.