iDreamPost
iDreamPost
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ వ్యవహారం చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. ప్రతి చిన్న విషయంలోను కేవలం తనకు ప్రచారం ఎలా వస్తుందా అని మాత్రమే లెక్కలేసుకుని మీడియా ముందుకొచ్చే చంద్రబాబునాయుడు స్ధాయి రోజు రోజుకుకు దిగజారిపోతోంది. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆరోపణలు, విమర్శలు చేయటం వాటిని ఎల్లోమీడియా ప్రచారం కల్పిస్తోంది కాబట్టి ఇంకా జనాలు మాట్లాడుకుంటున్నారు కానీ లేకపోతే ఈ పాటికి కనుమరుగైపోయేవాడేనేమో.
అధికారంలో ఉన్నపుడు పరిపాలనలో తనదంటూ ప్రత్యేకమైన ముద్ర ఏమీలేదు. తన ఐదేళ్ళ పాలన మొత్తం అవినీతి, అరాచకాలతో నిండిపోయింది కాబట్టే జనాలు చీ కొట్టి ఘోరంగా ఓడించారు. అయినా ఇంకా బుద్ది వచ్చినట్లు లేదు. అందుకనే ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుండి జగన్ కు వ్యతిరేకంగా ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడుతున్నాడు. జగన్ తీసుకునే నిర్ణయం ఎటువంటిదైనా కానీండి బొక్కలు వెతకటమే పనిగా పెట్టుకున్నాడు చంద్రబాబు.
ఇంగ్లీషుమీడియం ప్రవేశపెట్టి లక్షలాది మంది పేదల పిల్లలకు మంచి భవిష్యత్తును ఇద్దామని జగన్ అనుకున్నాడు. పేద పిల్లలు ఇంగ్లీషుమీడియంలో చదువుకోవటం ఇష్టం లేని చంద్రబాబు అడ్డుకున్నాడు. జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎంత గోల చేశాడో అందరూ చూసిందే. చివరకు ప్రతిపక్షాలన్నీ ఏకమైనా జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దాంతో న్యాయస్ధానం ద్వారా జగన్ను అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
ఇలాంటి అనేక అంశాల్లో చంద్రబాబు చీప్ పాపులారిటికి పాకులాడుతున్న విషయం అర్ధమైపోయింది. చివరకు తన ప్రచారం కోసం కరోనా వైరస్, తాజాగా ఎల్జీ ఫ్యాక్టరీలో స్టైరిన్ గ్యాస్ ప్రమాదాన్ని కూడా వదల్లేదు. రాష్ట్రంలో టెస్టులే జరగటం లేదని కొద్ది రోజులు గోల చేశాడు. టెస్టులు చేస్తుంటే కేసులు పెరిగిపోతున్నాయని ఇపుడు యాగీ చేస్తన్నాడు. పొరుగు రాష్ట్రాలు తమ సరిహద్దులను మూసేస్తే జగన్ చేతకాని తనం వల్లే రాష్ట్రం పరువు పోయిందంటూ కొద్ది రోజులు రచ్చ చేశాడు. అంటే జగన్ ఏమి చేసినా, ఏమీ చేయకపోయినా గోల, రచ్చ చేయటం ద్వారా ప్రచారంలో నిలవటమే టార్గెట్ గా పెట్టుకున్నాడు.
తాజగా ఎల్జీ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ ప్రమాద ఘటనలో కూడా చీప్ పాపులారిటికే పాకులాడుతున్నాడు. బాధిత కుంటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం ఇస్తే సరిపోతుందా ? చనిపోయిన వారిని తిరిగి తెచ్చివ్వగలమా ? అనే మతిలేని ప్రశ్నలు వేయటం చంద్రబాబుకే చెల్లింది. ప్రమాదం జరగటం వల్ల చనిపోయారు కాబట్టే భారీ నష్టపరిహారం ప్రకటించిన విషయాన్ని చంద్రబాబు మరచిపోయాడు. ఐదుగురు ఉన్నతాధికారులతో హైపవర్ కమిటిని విచారణకు నియమిస్తే దానిపైనా గోల చేస్తున్నాడు. నిపుణులతో విచారణ చేయించాలని యాగీ చేస్తున్నాడు.
చంద్రబాబు మరచిపోయిన విషయం ఏమిటంటే కేంద్రం ఇప్పటికే మూడు కమిటీలతో విచారణను మొదలుపెట్టింది. ఇందులో నిపుణులతో చేయిస్తున్న విచారణ కూడా ఉంది. అందుకనే జగన్ సీనియర్ ఐఏఎస్ లతో విచారణకు ఆదేశించాడు. ఏదేమైనా కేవలం ప్రచారం మీద బతికిపోవాలన్న ఆలోచనే చివరకు చంద్రబాబును ’ఉత్త ప్రచార నేత’గా మార్చేస్తోందనటంలో సందేహం లేదు. ఇదే పద్దతి కంటిన్యు చేస్తే చివరకు 2024లో కూడా 2019 రిజల్టే రిపీటవ్వక తప్పదేమో ?