సంక్రాంతి 2022 – మారనున్న లెక్కలు

ఇంకా అయిదు నెలల సమయం ఉన్నప్పటికీ 2022 సంక్రాంతి మీద అప్పుడే మన నిర్మాతలు కన్నేస్తున్నారు. టాలీవుడ్ కు కీలకమైన సంక్రాంతి సీజన్ కావడంతో ఏ ఏ పుంజులు బరిలో దిగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. గత ఏడాది మాదిరిగా కాకుండా వచ్చే సంవత్సరం ఫుల్ కెపాసిటీ సీటింగ్ తో థియేటర్లు నడుస్తాయి కాబట్టి వసూళ్ల లెక్కలు కూడా భారీగానే ఉండబోతున్నాయి. అల వైకుంఠపురములో సెట్ చేసిన నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసేదెవరన్న అంచనాలు అప్పుడే మొదలయ్యాయి. అయితే అసలు బరిలో ఎవరు ఉండబోతున్నారనేదే వేయి డాలర్ల భేతాళ ప్రశ్న.

జరుగుతున్న షూటింగులు పరిణామాలు విశ్లేషిస్తే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు బదులు అయ్యప్పనుం కోశియుమ్ రీమేక్ ని రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొదటి సినిమాను వేసవికు తీసుకెళ్తారు. ఇలా అయితే రెండు చిత్రాలు బిజినెస్ పరంగా లాభ పడతాయి. షూటింగులు దానికి అనుగుణంగానే పూర్తి చేసే పనిలో ఉన్నారు దర్శక నిర్మాతలు. ప్రభాస్ రాధే శ్యామ్ ఈ సంవత్సరమే వచ్చేస్తుంది కాబట్టి రేస్ లో డార్లింగ్ ఉండడు. సలార్ ప్లాన్ చేసుకుంది ఏప్రిల్ లో కనక నో టెన్షన్. ఇక మహేష్ బాబు సర్కారు వారి పాట ఏం చేయబోతుందన్నది వేచి చూడాలి. ఇంకా షూట్ చాలా బ్యాలన్స్ ఉంది.

ఆర్ఆర్ఆర్ ఇప్పటికైతే అక్టోబర్ 13కి కట్టుబడి ఉంది. ఒకవేళ దురదృష్టవశాత్తు కరోనా థర్డ్ వేవ్ వచ్చి మళ్ళీ థియేటర్లు మూతబడితే మాత్రం ఇది జనవరికి వెళ్లడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. కెజిఎఫ్ 2 డిసెంబర్ ని టార్గెట్ చేసుకుంది కనక ఇబ్బంది లేదు. మేజర్ కూడా పాన్ ఇండియా మూవీ అయినప్పటికీ వీటి రేంజ్ తో పోల్చలేం కనక ఓ మంచి స్లాట్ చూసుకుని రంగంలోకి దిగాలి. పుష్ప డిసెంబర్ ని లాక్ చేసుకుందని మైత్రి సోర్సెస్ చెబుతున్న మాట. ఏది ఏమైనా 2022 సంక్రాంతి పోటీ మాత్రం మహా రంజుగా ఉండబోతోంది. ఇప్పటికైతే పైన చెప్పినట్టు పిక్చర్ క్లియర్ గానే ఉంది కానీ ఏ నిమిషంలో ఏం జరుగుతుందో.

Show comments