Idream media
Idream media
కరోనా వైరస్తో అగ్రరాజ్యం అమెరికా అల్లాడుతోంది. ఏడు లక్షలకు పైగా బాధితులు, 41 వేల మరణాలు అమెరికాలో సంభవించాయి. వైరస్ వ్యాపిస్తున్న ప్రారంభంలో లాక్ డౌన్ విధించేందుకు ససేమిరా అన్న అధ్యక్షుడు ట్రంప్.. చివరకు తగ్గాల్సిన పరిస్థితి ఎదురైంది. లాక్ డౌన్ విధించిన ట్రంప్ వైరస్ కట్టడికి చర్యలు చేపట్టారు. ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అయ్యేలా స్టేట్ ఎట్ హోమ్ లాంటి కఠిన ఆంక్షలు పలు రాష్ట్రాలు విధించాయి. ఈ ఆంక్షలను ఎత్తివేయాలని దేశవ్యాప్తంగా భారీ నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఆందోళన కారుల్ని సమర్థిస్తూ అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ చేయడం వివాదాస్పదమైంది. ట్రంప్ వ్యవహారంపై పలువురు గవర్నర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ అధ్యక్షుడే ఆందోళనకారులు రెచ్చగొట్టడం ఏమిటని.. వాషింగ్టన్ డెమొక్రటిక్ గవర్నర్ మండిపడ్డారు. ప్రజల ప్రాణాలను కాపాడే అంశాలను అధ్యక్షుడు విస్మరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
లాక్ డౌన్ నేపథ్యంలో జీవనోపాధి కోల్పోయిన వేలాదిమంది వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. ట్రంప్ మద్దతుదారులు సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. స్టేట్ ఎట్ హోమ్ ఆదేశాలను గవర్నర్లు ఎత్తివేయాలని నిరసన కారులు డిమాండ్ చేస్తున్నారు. మిచిగన్ లో భారీ ప్రదర్శన చేపట్టారు. ఇటీవల ఆంక్షల నుంచి స్వేచ్ఛ కల్పించాలంటూ అధ్యక్షుడు ట్రంప్ కొందరు డెమోక్రటిక్ గవర్నర్లను కోరారు. దేశంలోని అనేక ప్రాంతాలు సాధారణ స్థితికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే కొందరు గవర్నర్లు మాత్రం ఫెడరల్ ప్రభుత్వ వైఖరి సరిగాలేదని విమర్శిస్తున్నారు. కఠిన ఆంక్షలు పెట్టిన ప్రభుత్వమే వాటిని ఉల్లంఘిస్తోందని మీడియా అడిగిన ప్రశ్నకు ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ సమాధానం ఇవ్వలేకపోయారు.
అమెరికాలో మే 1వ తేదీ వరకు లాక్ డౌన్ అమలులో ఉండనుంది. అయితే అంతకు ముందే లాక్ డౌన్ ను సడలించాలని ప్రభుత్వం భావిస్తోంది. వైరస్ నియంత్రణకు విస్తృత స్థాయిలో పరీక్షలు చేపట్టాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిపుణుల సూచనలు గవర్నర్లు పట్టించుకోవడం లేదని, నిర్ధారణ పరీక్షలు చేయడంలో జాప్యం చేస్తున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ఆరోపిస్తున్నారు. కానీ గవర్నర్ లు మాత్రం ఫెడరల్ ప్రభుత్వ వైఫల్యం వల్ల విస్తృత స్థాయిలో పరీక్షలు జరగడం లేదంటూ ఎదురుదాడి చేస్తున్నారు. ఫెడరల్ ప్రభుత్వం, రాష్ట్రాల గవర్నర్లకు మధ్య నెలకొన్న భేదాభిప్రాయాల మధ్య అమెరికా ప్రజలు పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా తయారైంది.