iDreamPost
iDreamPost
2024 ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం అన్న వాదనకు ఇప్పుడు బీహార్ గట్టి దెబ్బకొట్టింది. బీజేపీపై బీహార్ తిరుగుబాటు భారత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది. నిరాశల స్థానంలో ఆశలను పుట్టించింది. విపక్షానికో వ్యూహాన్ని చూపించింది.
2019 ఎన్నికల్లో BJP-JD(U) కూటమి బీహార్ ను ఊడ్చేసింది. 40 సీట్లలో 39 స్థానాలను గెల్చుకుంది. అందుకే బీజేపీకి అంతటి మెజార్టీ. ఇప్పుడు సీన్ రివర్స్. అందుకే 2024 ఎన్నికల్లో, ఉత్తర భారతదేశం మినహా మిగిలిన చోట్ల 2019 ఎన్నికలనాటి హవా బీజేపీ చూపించలేకపోవచ్చునన్నది రాజకీయ పండితుల అంచనా.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల తర్వాత ప్రతిపక్షాలు ఢీలాపడ్డాయి. భుజాలు జారిపోయాయి. ఏ పార్టీలోనూ కాన్ఫిడెన్స్ లేదు. బీజేపీని మనం ఓడించగలమా? అన్న సందేహం. 2024 ఎన్నిల మీద ఆశలు అడుగంటుతున్నవేళ, బీహార్ ప్రాంతీయ రాజకీయ పార్టీలకు హుషారునిచ్చే ఎత్తుగడ వేసింది. నితీష్ కుమార్, ఒకనాటి మిత్రుడు లాలూ కుమారుడితో కలసి ప్రభుత్వాన్ని ఎర్పాటుచేస్తున్నారు. బీజేపీ పక్కనపెట్టారు. ఇలాంటి ఎలివేషన్ కోసమే ప్రతిపక్షాలన్నీ ఎదురుచూస్తున్నాయి. విపక్షాలను చుట్టుముట్టిన చీకటి మేఘాలలో బిహార్ వెండి రేఖగా ఉద్భవించడంతో మళ్లీ రాజకీయ లెక్కలు మారుతున్నాయి.
రాజకీయంగా భారతదేశం మూడు ముక్కలుగా ఉంటుంది. మొదటిది. తీరప్రాంతం. ఇది పశ్చిమబెంగాల్ నుంచి కేరళ వరకు. ఇక్కడ బీజేపీ ప్రభావం చాలా తక్కువ. ఈ ప్రాంతం కలమనాధులను ఆశపెడుతుంది. అంతలోనే నీరుకార్చుతుంది. ఇక్కడ మొత్తం 190 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ గెల్చుకున్న 36 సీట్లు మాత్రమే. ఇందులో 18 బెంగాల్ వి. ఉన్న సీట్లను నిలుపుకోవడమే చాలా కష్టం. తెలంగాణలో ఐదారు సీట్లు వస్తే, ఆ లాభాలను ఒడిశాలో జరగబోయే నష్టాన్ని పూడ్చుకోవచ్చు. కాని తెలంగాణలో బీజేపీ అన్ని సీట్లను గెల్చుకొంటుందని ఎక్కువ మంది అంచనావేయడంలేదు. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసీటు వస్తుందన్న ఆశ బీజేపీకిలేదు. మొత్తం మీద బీజేపీ దాదాపు 25 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి ఉండొచ్చు.
ఇక మిగిలిన సీట్లు 353. మెజార్టీ మార్క్ చేరాలంటే ఈ సీట్లలో దాదాపు 250 సీట్లను సాధించాలి. ఇదేమీ సులువేంకాదు. బీజేపీ మెజార్టీ స్థానాలు వాయువ్యం, హిందీ హార్ట్ లాండ్ నుంచే వచ్చాయి. ఇందులో గుజరాత్ ను యాడ్ చేయాలి. బీహార్, జార్ఖండ్ ను కలపకూడదు. ఇవి మధ్య భారతావనికి చెందిన రాష్ట్రాలు. కాంగ్రెస్ ను దెబ్బతీసి 2019 ఎన్నిల్లో మొత్తం 203 సీట్లలో 182 గెలుచుకుంది. అంటే క్లీన్ స్వీప్. ఇందులో మిత్రపక్షాలవి మూడు సీట్లున్నాయి. అదంతా బీజేపీ స్వర్ణయుగం. యూపీలో ఎస్పీ బలపడింది. కాంగ్రెస్ పోరాడుతోంది. మధ్యప్రదేశ్ ఏకాకిన బీజేపీకి ఓట్లేయకపోవచ్చు. హర్యానా, హిమాచల్ రాష్ట్రాల్లో బిజెపికి నష్టాలు తప్పవు. కాని కొద్ది మేర ఉండొచ్చన్నది ఒక అంచనా.
ఇక మిడిల్ బెల్ట్. ఇక్కడ కర్ణాటక, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్ లాంటి కీలక రాష్ట్రాలున్నాయి. వాటికి అస్సాం, త్రిపుర, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాలను కలపితే, మొత్తం మీద 150 సీట్లున్నాయి. వీటిలో బీజేపీకి కనీసం 100 సీట్లు రావాలి. 2019లో ఇక్కడ ఎన్డీయే 130 సీట్లు గెల్చుకొంటే, సొంతంగా 88 సీట్లు ఖాతాలో వేసుకుంది. నిజానికి మధ్య భారతంలో బీజేపీకి మిత్రపక్షాలే బలం. శివసేన 18 సీట్లు గెలుచుకోగా, జనతాదళ్ (యునైటెడ్) 16, లోక్ జనశక్తి పార్టీ 6 స్థానాలను దక్కించుకున్నాయి. ఇప్పుడు ఆ మిత్రపక్షాలు దూరమైయ్యాయి. అందుకే మధ్యభారతం బీజేపీకి పరీక్ష పెడుతోందని కమలనాధులే వర్రీ అవుతున్నారు. కర్ణాటకలో బీజేపీ హవా తగ్గింది. 28కి 25 సీట్లు మళ్లీ రావడం చాలా కష్టం. ఒకవేళ కుమారస్వామి, కాంగ్రెస్ కలసి పనిచేస్తే సీట్లలో భారీగా కోతపడొచ్చు. ఈ కూటమి ఎర్పాటు చాలా సాధ్యం కూడా. లేకపోతే నితీష్ కుమార్ మారడాన్ని ఎందుకు దేవెగౌడ స్వాగతించినట్లు! మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం పతనమై బీజేపీ ప్రభత్వం వచ్చింది. కాని మహారాష్ట్రలోని 48 సీట్లలో 41 సీట్లతో బీజేపీ-శివసేన సాధించడం అసాధ్యమేకావచ్చు. అసోం ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో నష్టాలేకాని 2019కి మించి లాభాలు ఉండకపోవచ్చు.
ఇప్పుడు కీలక రాష్ట్రం బీహార్ విషయానికి వస్తే, ఇక్కడున్న మొత్తం సీట్లు 40. 40కి 37 సీట్లు ఎన్డీయే గెల్చుకుంది. బీజేపీకి 17, జెడి(యు)కి 16, ఎల్‌జెపికి 6 వచ్చాయి. ఒక్కసీటు కాంగ్రెస్ కు దక్కింది. ఈ ఫీట్ రిపీట్ కావచడం చాలా కష్టం. నితీస్ కుమార్ అడ్డుగా ఉన్నారు. కాంగ్రెస్, వామపక్షాలను కలుపుకుని పోతే, RJD-JD(U) నేతృత్వంలోని కూటమి రివర్స్ స్వీప్ చేయవచ్చు.
బీహార్ లో అతిపెద్ద ఓటుబ్యాంక్ BJPకే ఉంది. కాదనలేం. అసెంబ్లీలో 20 శాతం, లోక్ సభ ఎన్నికల్లో 25 శాతం సీట్లువచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీకి 23 శాతం ఓట్లు వచ్చాయి. లోక్ సభ ఎన్నికల్లో కొన్నితగ్గాయి. నితీష్ కుమార్ పార్టీ జేడీ(యూ)కి నిఖార్సుగా 15 శాతం ఓట్లు ఉన్నాయి. పోటీలో లేని కాంగ్రెస్‌కు 7-9 శాతం, వామపక్షాలకు 4-5 శాతం మేర ఓట్లున్నాయి. ఇవేమీ తక్కువ కాదు. ఇప్పుడు ఇవన్నీ కలిపి బరిలోకి దిగితే దాదాపు 50శాతం మేర ఓటు బ్యాంక్ ఉన్నట్లే.
బీజేపీ 2024లోనూ అధికార పీఠమెక్కాలంటే బీహార్ నిచ్చెనలాంటిది. ఒకవేళ బీజేపీ దెబ్బతిని ఆర్జీడీ, జేడీయులు రివర్స్ స్వీప్ చేస్తే? 30 సీట్లు మేర తగ్గితే? ఆ మేరకు అధికారానికి దూరంగా ఆగిపోతుంది. అప్పుడు వైసీపీలాంటి పార్టీల మీద ఆధారపడి, ప్రభుత్వాన్ని నడపాల్సి వస్తుంది.
పోనీ ఎన్డీయే మిత్రపక్షాలు ఆ లోటును పూడ్చగలవా? పేరుకే ఎన్డీయే కాని పార్టీలు లేవు. అకాలీలు బైటకు వెళ్లిపోయారు. శివసేనను హైజాక్ చేసినా, పాత హవా ఉండదు. ఏఐఏడీఎంకే చీలిపోయింది. JD(U) గుడ్ బై చెప్పింది. ఇక ఈశాన్య ప్రాంతంలోని కొన్ని చిన్నాచితక పార్టీలు, మిత్రపక్షాల అవశేషాలు, చీలికలు తప్ప NDAలో ఏమీ మిగలలేదు. ఇవన్నీ కలపినా మహా అయితే 15-20 సీట్లను సాధించవచ్చేమో. మ్యాజిక్ నంబర్‌కి ఇవి సరిపోవు.
బీహార్ దెబ్బకు బీజేపీ రాజకీయమే మారిపోయింది. ప్రతిపక్షాలకు ఊపిరి వచ్చింది. 2024ఎన్నికల్లో గట్టిగా పట్టుపడితే బీజేపీని అధికారానికి దూరంగా ఉంచొచ్చన్న ఆశ, ఒక్కరోజులో విపక్షానికి వచ్చింది. ఇలాంటి రోజుకోసమేకదా బీజేపీ వ్యతిరేకపార్టీలన్నీ ఎదురుచూస్తోంది!