Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణను సిఫార్సు చేసిన జీఎన్ రావు, బీసీజీ కమిటీల నివేదికలపై చర్చించేందుకు హైపవర్ కమిటీ ఈ రోజు రెండో సారి సమావేశం కాబోతోంది. జీఎన్‌రావు, బీసీజీ కమిటీలు ఇచ్చిన నివేదికల్లోన అంశాలపై సమగ్రంగా చర్చించి రాజధాని, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిపై ఏ విధంగా ముందుకెళ్లాలో రాష్ట్రప్రభుత్వానికి హై పవర్ కమిటీ దిశానిర్ధేశం చే సేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది.
ఆర్థిక మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు, సీనియర్ అధికారులతో కూడిన హైపవర్ కమిటీ ఈ నెల 7వ తేదీన తొలిసారి భేటీ అయింది. రాష్ట్ర ప్రజలు తమ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని అభిలషిస్తున్నారని, అందుకు అనుగుణంగానే సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను తెచ్చారని తొలిసారి భేటీ తర్వాత మంత్రి బుగ్గన వెల్లడించారు.
రాజధానిపై కేంద్రం ఏర్పాటు చేసిన శిరామకృష్ణన్ కమిటీ, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎన్ రావు, బీసీజీ కమిటీలు అన్నీ కూడా పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణనే సూచించాయని ఆ సందర్భంగా మంత్రి బుగ్గన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో మూడు రాజధానులకే హైవవర్ కమిటీ మొగ్గు చూపుతోందన్న అంచనాకు రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రజలు వచ్చారు.
ఈ నెల 8వ తేదీన జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం 18వ తేదీకి వాయిదా పడింది. సచివాలయాన్ని ఈ నెల 20వ తేదీన విశాఖకు తరలిస్తారన్న ప్రచారం సాగుతోంది. 18వ తేదీన జరగబోయే మంత్రివర్గ సమావేశానికి హైపవర్ కమిటీ తన సూచనలతో కూడిన నివేదిక ఇవ్వాల్సి ఉంది. హైపవర్ కమిటీ సూచనల ఆధారంగా మంత్రివర్గ సమావేశంలో మూడు రాజధానులపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరగబోయే సమావేశంలో హైపవర్ కమిటీ తన సూచనలపై ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది.