iDreamPost
android-app
ios-app

గ్రామ సచివాలయాలు.. అంతకు మించి.. సీఎం జగన్‌ విప్లవాత్మక ఆలోచన..

గ్రామ సచివాలయాలు.. అంతకు మించి.. సీఎం జగన్‌ విప్లవాత్మక ఆలోచన..

సంక్షేమ పథకాల అమలు, గ్రామ పరిపాలన కోసం ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలను అంతకు మించి ఉపయోగించుకునేందుకు సీఎం జగన్‌ ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. విద్య, వైద్యం, రెవెన్యూ, విద్యుత్, వ్యవసాయ సంబంధిత సేవలే కాకుండా భవిష్యత్‌లో భూముల రిజిస్ట్రేషన్లు కూడా గ్రామ సచివాలయాల్లో చేసే ఆలోచన ఉన్నట్లు సీఎం జగన్‌ వెల్లడించారు. తనను కలసిన కెనడా ప్రతినిధి బృందంతో ఈ మేరకు జగన్‌ గ్రామ సచివాలయాల వ్యవస్థ గురించి వివరిస్తూ.. రిజిస్ట్రేషన్‌ ఆలోచనను వ్యక్తం చేశారు.

భూముల క్రయ, విక్రయాలకు సంబంధించిన రిజస్ట్రేషన్లు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో జరుగుతున్నాయి. నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లోనూ, ప్రధాన పట్టణాల్లోనూ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. ప్రజలు గ్రామాల నుంచి ఆయా కార్యాలయాలకు వెళుతున్నారు. సీఎం జగన్‌ ఆలోచన కార్యరూపం దాల్చితే.. పంచాయతీ పరిధిలో జరిగే భూముల క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్లు గ్రామ సచివాలయంలోనే జరుగుతాయి. దీని వల్ల ప్రజలకు విలువైన సమయం ఆదా అవుతుంది. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద గంటల తరబడి ఎదురుచూడాల్సిన అవసరమూ తప్పుతుంది.

గ్రామ సచివాలయాల్లోనే భూముల రిజిస్ట్రేషన్‌ చేయడం వల్ల అవినీతి రహిత పాలనే అనే జగన్‌ సర్కార్‌ లక్ష్యం కూడా నెరవేరుతుంది. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారాయి. ప్రభుత్వానికి కట్టాల్సిన స్టాంప్‌ డ్యూటీ 7.5 శాతం అయితే.. దానికి అదనంగా 1 శాతం మూముళ్ల రూపంలో వసూలు చేస్తున్నారు. ఇది వ్యవస్థీకృతమైంది. అవినీతిని కూకటివేళ్లతో పెకిలించివేయాలనే లక్ష్యంతో ఉన్న సీఎం జగన్‌ అవినీతి నిరోదక శాఖను పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నారు. అయినా అనుకున్న మేరకు సఫలీకృతం అవడంలేదు. గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు చేయడం వల్ల 100 శాతం అవినీతిని అరికట్టవచ్చు. అంతేకాకుండా మ్యూటేషన్, పాస్‌పుస్తకాల జారీ కూడా వీఆర్‌వో ద్వారా జరుగుతాయి కాబట్టి.. ఒకే చోట అన్ని పనులు పూర్తవుతాయి.