Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ కార్యాలయాలకు వేసిన రంగులపై హై కోర్టు కీలక తీర్పును వెల్లడించింది. గ్రామ సచివాలయ భవనాలకు రాజకీయ పార్టీల రంగులు తొలగించాలని ఆదేశించింది. పంచాయతీ భవనాలు, ప్రభుత్వ భవనాలకు పది రోజుల్లో మళ్లీ రంగులు వేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. తమ ఆదేశాలు అమలు చేసినట్లు ఆధారాలను నివేదిక రూపంలో సమర్పించాలని సీఎస్‌ను హైకోర్టు ఆదేశించింది.
గుంటూరు జిల్లా పల్లపాడుకు చెందిన ముప్పా వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న సమయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు కీలకంగా మారింది. గ్రామాల్లో పంచాయతీ కార్యలయాలకు రంగులు వేయడంపై ప్రతిపక్షం టీడీపీ కూడా అభ్యంతరం చెబుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో.. ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. వెంటనే ఎన్నికల సంఘం స్పందించి రంగులు తొలగించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ అంశంపై ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కూడా తమ వైఖరిని వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సమయంలో విలేకర్లు అడిగిన ప్రశ్నకు అయన సమాధానం చెబుతూ.. భవనాలకు రంగుల విషయం కోర్టు పరిధిలో ఉన్నందున తాము జోక్యం చేసుకోబోమన్నారు. ఇకపై కొత్తగా వేస్తే మాత్రం తాము తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రంగులు తొలగించాలని ఇప్పుడు కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఏమి చేయబోతోందో వేచి చూడాలి.