Idream media
Idream media
ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న ఏపీ ప్రజలు అక్కడే ఉండాలని సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఎక్కడ వారు అక్కడే ఉంటేనే ఈ వైరస్‌ను నియంత్రించగలమని ఆయన చెప్పారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘ ఇలాంటి వ్యాధి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు.కరోనాను క్రమశిక్షణతోనే గెలవగలం. నిర్లక్ష్యంతో ఉంటే మూల్యం చెల్లిస్తామనేది ఇతర దేశాలను చూస్తే తెలుస్తోంది. కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇది. తెలంగాణ నుంచి మన వాళ్లు మన రాష్ట్రంలో వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజంగా మన వాళ్లను మనం చిరు నవ్వుతో ఆహ్వానించే పరిస్థితి లేదా అని మనస్సుకు కష్టం అనిపించింది. ఎక్కడ ఉన్న వారు వారి వారి ఇళ్లలోనే ఉండకపోతే ఈ వ్యాధిని కంట్రోల్ చేయలేము.
చెక్‌పోస్టుల వద్ద ఈ రోజు ఇదే పరిస్థితి. ఏఏ ప్రాంతాల్లో ఉన్నారో.. ఆయా ప్రాంతాల్లో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. లేదంటే వైరస్‌ను నియంత్రించలేం. దేశం అతలాకుతలం అవుతోందని అనుకోవాల్సిన పనిలేదు. మూడు వారాలు అంటే ఏప్రిల్ 14వ తేదీ వరకే ఈ పరిస్థితి ఉంటుంది. దయచేసి ప్రజలు ఇళ్లలోనే ఉండండి. వేరే రాష్ట్రాల నుంచి వచ్చే వారిని క్వారంటైన్‌లో ఉంచాల్సిన పరిస్థితి. ఇప్పటికే రాష్ట్రానికి వచ్చిన వారు క్వారంటైన్‌లో ఉంటారు. ఎవరూ నేరుగా ఊర్లకు వెళ్లవద్దు. దాని వల్ల మీ కుటుంబ సభ్యులకు ప్రమాదం. తెలంగాణ సీఎంతో కూడా మాట్లాడాను. వారు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం పది మందికి కరోనా సోకింది. మరింత ప్రభలకుండా చర్యలు తీసుకోవాలి. ఇతర దేశాల నుంచి 27,819 మంది వచ్చారని సర్వేలో తేలింది. వీరందరినీ క్వారంటైన్‌లో ఉంచాం. గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కుర్లు, గ్రామ సచివాలయంలోని హెల్త్ అసిస్టెంట్లు గొప్పగా విధులు నిర్వర్తిస్తున్నారు. వారి వల్ల మాత్రమే ప్రస్తుతం కేసులు 10కి పరిమితం అయ్యాయి. వారందరికీ హేట్సాఫ్’’ అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.