Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ వార్డు సచివాలయాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు నాలుగు రంగులు వేయాలని ఆంధ్రప్రదేశ్ సర్కారు జారీ చేసిన జీవో నెంబర్ 623 రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. గ్రామ వార్డు సచివాలయాలకు వైసీపీ జెండా ని పోలిన మూడు రంగులు వేశారంటూ, వాటిని తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని పలువురు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ల పై విచారణ చేసిన రాష్ట్ర హైకోర్టు ఆయా రంగులను తొలగించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో తెలుపు, ఆకుపచ్చ, నీలిరంగు లకు అదనంగా మట్టి రంగు జోడిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయా రంగులు వేయడానికి గల కారణాలను, వాటి అర్ధాలను వివరించింది. తెలుపు రంగు క్షీర విప్లవానికి, ఆకుపచ్చ వ్యవసాయానికి, నీలిరంగు ఆక్వా ఉత్పత్తులకు, మట్టి రంగు గ్రామీణ ప్రాంతానికి సూచికగా ప్రభుత్వం వివరించింది. ఆ మేరకు పలు గ్రామ, వార్డు సచివాలయాలకు కొత్తగా మట్టి రంగు వేసింది.
ఈ అంశంపై పిటిషనర్లు మళ్లీ కోర్టును ఆశ్రయించడంతో విచారణ జరిపిన హైకోర్టు.. సదరు జీవోను రద్దు చేస్తూ పది రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది.