iDreamPost
iDreamPost
రాష్ట్రంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరిగిపోవటానికి చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని నిందించని రోజు లేదు. కేసులు పెరిగిపోవటానికి జగన్మోహన్ రెడ్డిదే బాధ్యతగా అడ్డుగోలు ఆరోపణలన్నీ చేస్తున్నాడు. కావాలనే కేసులను తొక్కిపెడుతోందంటూ మండిపోతున్న విషయం అందరూ చూస్తున్నదే. మరిపుడు ఆయన కుటుంబం ఆధ్వర్యంలో నడిచే హెరిటేజ్ కంపెనీలో ఓ సెక్యురిటి గార్డుకు కరోనా వైరస్ సోకింది. గార్డుతో పాటు అతని తల్లి, దండ్రులకు కూడా వైరస్ ఎటాక్ అయ్యింది. అయితే వైరస్ సోకిందన్న విషయాన్ని గోప్యంగా ఉంచి గార్డుతో డ్యూటి చేయిస్తున్నది యజమాన్యం. మరి దీనికి చంద్రబాబుదే కదా బాధ్యత ?
ఇంతకీ విషయం ఏమిటంటే హైదరాబాద్, ఉప్పల్ లో ఉన్న హెరిటేజ్ ప్లాంటులో పనిచేస్తున్న సెక్యురిటి గార్డుకు కరోనా వైరస్ సోకింది. వైరస్ సోకిన విషయం యాజమాన్యానికి తెలిసినా అతనితో పనిచేయించుకుంటోంది. పైగా ఈ విషయం ప్రభుత్వ అధికారులకు చెప్పవద్దని గార్డుతో పాటు మిగిలిన గార్డులకు, ప్లాంటులో పనిచేసే ఇతర ఉద్యోగులందరికీ యాజమాన్యం వార్నింగ్ ఇచ్చిందట. దాంతో విషయం తెలిసినా ఎవరూ నోరిప్పలేకపోయారు. కిరాణాషాపు నిర్వహిస్తున్న గార్డు తండ్రి ద్వారా ముందు గార్డుకు తర్వాత అతని తల్లికి కూడా వైరస్ సోకింది. వైరస్ సోకిందని నిర్ధారణ కావటంతో అధికారులు ఐసొలేషన్ వార్డుకు తరలించారు. అయితే డ్యూటి చేయాలని యాజమాన్యం ఒత్తిడి తెవటంతో గార్డు ఐసొలేషన్ వార్డు నుండి బయటకు వచ్చి డ్యూటి చేస్తున్నాడు.
అయితే ఈ విషయం ఆనోట ఈనోట బయటకు పొక్కింది. వీళ్ళందరూ ప్లాంటుకు దగ్గరలోనే ఉండే లక్ష్మీనారాయణ కాలనీలో నివసిస్తున్నారు. చేతిమీద స్టాంపుతో వైరస్ అనుమానితులు కూడా స్వేచ్చగా బయట తిరుగుతుండటాన్ని కాలనీ వాళ్ళు గమనించారు. ఇదే విషయాన్ని అడిగితే గార్డలు సరైన సమాధానం చెప్పలేదు. దాంతో ఒళ్ళు మండిన స్ధానికులు ఏకంగా ప్లాంటు దగ్గరకు వచ్చి గొడవపడ్డారు. వీళ్ళెంత గొడవపడినా అక్కడి వాళ్ళు సరైన సమాధానం చెప్పలేదు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తమ ప్లాంటులో పనిచేస్తున్న ఉద్యోగికి వైరస్ సోకినా యాజమాన్యం గోప్యంగా ఉంచటమే కాకుండా ప్రతిరోజు ఉద్యోగం చేయిస్తోంది. మరి దీనికి చంద్రబాబు ఏమని సమాధానం చెబుతాడు ? తమ ప్లాంటులో పనిచేసే ఉద్యోగికి వైరస్ వచ్చిందంటే చంద్రబాబు తర్కం ప్రకారం యజమాని బాధ్యత వహించాలి కదా ? మరి ఇప్పుడు చంద్రబాబు బాధ్యత తీసుకుంటాడా ? పైగా అనుమానం వచ్చినా అతనితో డ్యూటి చేయించటమేంటి ?
ప్రభుత్వాధికారులు హోం క్వారంటైన్ లో ఉండమని చెప్పినా యాజమాన్యం పట్టించుకోకుండా గార్డుతో డ్యూటి చేయించటం తప్పు కాదా ? మరి దీనికి చంద్రబాబు ఏమని సమాధానం చెబుతాడు. రాష్ట్రంలో కేసులు పెరిగిపోతే జగన్ దే బాధ్యతని, రాజ్ భవన్లో వైరస్ సోకితే జగన్ దే బాధ్యతని ఒకటే ఊదరగొడుతున్న చంద్రబాబు ఇపుడేమని సమాధానం చెబుతాడో చూద్దాం.