విశాఖ బాధితులకు ఆరోగ్య భరోసా

విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ప్రమాద బాధితులకు పరిహారం, యుద్ధప్రాతిపదికన పునరావాస చర్యలు చేపట్టడమే కాదు వారి భవిష్యత్తుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోంది. స్టైరిన్ విషవాయువు వల్ల భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు వస్తాయన్న అనుమానంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. రాబోయే రోజుల్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని భరోసా నింపుతోంది. ఇందుకోసం గ్యాస్ లీకేజీ ప్రభావిత గ్రామాల్లో ని ప్రతి ఒక్కరికి ప్రత్యేక హెల్త్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది.

దాదాపు 15 వేల మందికి ఈ హెల్త్ కార్డులు మంజూరు చేయనుంది.

హెల్త్ కార్డులు జారీ చేయడంతో పాటు స్థానికంగా 20 పడకల సామర్థ్యం తో వైయస్సార్ క్లినిక్ ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఈ ఆసుపత్రిని తక్షణమే ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. శాశ్వత భవనం నిర్మాణం జరిగే వరకు తాత్కాలికంగా గ్రామంలోని ఉన్నత పాఠశాల వద్ద నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ క్లినిక్ లో ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించేందుకు వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బందిని నియమించాలని నిర్ణయించింది. ప్రాథమిక చికిత్స అనంతరం గోపాలపట్నం సి హెచ్ సి, పెందుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలు రిఫరెల్ ఆసుపత్రులుగా ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. హెల్త్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించేందుకు ఆంధ్ర మెడికల్ కాలేజీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. గ్రామాల్లోని ప్రజల ఆరోగ్యంపై ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ అధ్యక్షతన పది మంది నిపుణులైన వైద్యుల తో కమిటీని నియమించారు.

ఈ క్రమంలోనే 15 వేల మంది ప్రజలకు నిత్యం వైద్యపరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రానున్న వారం రోజుల్లో రెండు సార్లు, తర్వాత 15 రోజులకు ఒకసారి పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ప్రతి నెల ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించి ఆ వివరాలు భద్రపరుస్తారు. అన్ని వయసుల వారికి హిమోగ్లోబిన్, లివర్, కిడ్నీల పనితీరు పరీక్షలతోపాటు ఎక్స్ రే లు తీస్తారు. గర్భిణీలకు స్కానింగ్ చేసి తరచూ పరీక్షలు చేస్తారు. బిడ్డ పుట్టాక ఏడాదిపాటు ఎదుగుదలను పర్యవేక్షిస్తారు. ఏడాది తర్వాత కూడా ఏమైనా ఆరోగ్య సమస్యలు కనిపిస్తే జీవితాంతం వైద్యం అందించాలని జగన్ సర్కార్ నిర్ణయించింది.

Show comments