iDreamPost
android-app
ios-app

బహుజన వాదం నుంచి.. ఆరెస్సెస్ వాదం వరకు.. రావెళ్ల కిషోర్

బహుజన వాదం నుంచి..  ఆరెస్సెస్ వాదం వరకు..  రావెళ్ల కిషోర్

ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రావెళ్ల కిషోర్ బాబు పేరు వినని వారెవరుండరు. దళిత జాతీయ వాదాన్ని, దళితుల ఆత్మగౌరవ ఉద్యమాన్ని, అంబెద్కర్ వాదాన్ని తన మూలా సిద్ధాంతాలుగా చెప్పుకొని రాజకీయంగా పైకెదిగిన రావెళ్ల కిషోర్ బాబు రాజకీయాల్లోకి వచ్చిన అతి కొద్దీకాలంలోనే సిద్ధాంతాలను, దళితవాదాన్నితాకట్టుపెట్టి తన వ్యక్తిగత ప్రయోజనాలే పరమావధిగా క్షణాల వ్యవధిలోనే పార్టీ కండువాలు మార్చడం చూస్తే మాత్రం ఎవ్వరైనా నోరెళ్లబెట్టడం ఖాయం.

ఇండియన్ రైల్వే ట్రాఫిక్ కంట్రోల్ (IRTC ) ఉద్యోగిగా జీవితం ప్రారంభించిన రావెళ్ల కిషోర్ బాబు గతంలో దివంగత లోకసభ స్పీకర్ ప్రముఖ దళిత నాయకుడు జీఎంసీ బాలయోగి దగ్గర ప్రయివేట్ సెక్రటరీ గా పనిచేశాడు. ఆ సమయంలోనే ఆయనకు ఢిల్లీలోని అనేకమంది జాతీయ నాయకులతో పరిచయాలేర్పడ్డాయి. దివంగత మహానేత కాన్షిరాం ని తనకి గురువుగా చెప్పుకొనే రావెళ్ల దళిత జాతి కోసం, బహుజన వాదం కోసం ఇప్పటివరకు నిర్దిష్టంగా చేసింది ఏమి లేకపోయినా, పెద్ద నేతల పరిచయాలు ఉపయోగించుకొని, బహుజన ఉద్యమాలను అడ్డంపెట్టుకొని వ్యక్తిగతంగా భారీగా ఆస్తులు సంపాదించారని అయన మీద ఉన్న ప్రధాన ఆరోపణ.

2009 అసెంబ్లీ ఎన్నికలలో చిరంజీవి చెప్పిన సామాజిక న్యాయం పట్ల, ప్రజారాజ్యం పార్టీకి ప్రేరణగా ఉన్న అంబేద్కరిజం, పూలె, మదర్ తెరిస్సా బొమ్మలను చూసి ఆకర్షితుడినై సమాజంలో తీవ్ర వివక్షకు, అవమానాలు గురవుతున్న తన దళితజాతికి సేవ చెయ్యడానికే తన కుటుంబం ప్రజారాజ్యంలో చేరిందని చెప్పుకొచ్చారు. తన తరపున తన భార్య రావెళ్ల శాంతి జ్యోతిని తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజారాజ్యం అభ్యర్థిగా బరిలో దించారు. అయితే ఆ ఎన్నికల్లో ఆమె ఓటమిని చెవిచూశారు.

2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన ఉద్యోగానికి స్వచ్చంద పదవీవిరమణ చేసిన ఆయన తెలుగుదేశం ముఖ్య నాయకులతో, చంద్రబాబు నాయుడుతో ఉన్న పాత పరిచయాలతో తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఆసమయంలో ఎస్సిలలో తన ఉప కులమైన మాదిగలకు న్యాయం చెయ్యడానికి, చంద్రబాబు నాయుడు ఎస్సి వర్గీకరణ చేస్తానని మాట ఇవ్వడం వల్లే తానూ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని చెప్పుకొచ్చారు. ఆ ఎన్నికల్లో మొదట తిరుపతి ఎంపీ టికెట్ ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు చివరి నిమిషంలో పత్తిపాడు ఎమ్యెల్యే టికెట్ ఇవ్వడంతో అక్కడనుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీచేసి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పత్తిపాటి సుచరిత పై గెలుపొందాడు. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ తనకున్న పరపతిని, పలుకుబడిని ఉపయోగించుకొని మంత్రి వర్గంలో స్థానం సంపాదించాడు.

ఆయన రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నప్పుడు ఆయన, ఆయన కుటుంబం పై వచ్చిన ఆరోపణలు, రాజకీయ విమర్శలు పక్కనపెడితే, పార్టీలో అంతర్గత కలహాల నేపథ్యంలో, రెండున్నరేళ్లకే తన మంత్రి పదవి కోల్పోవాల్సి వచ్చింది. అయితే విచిత్రంగా అప్పటిదాకా ఆయనకి గుర్తుకురాని రిజర్వేషన్లు, ఎస్సి వర్గీకరణ అంశం మంత్రి పదవి కోల్పోగానే ఆయనకి హఠాత్తుగా గుర్తొచ్చాయి. వెంటనే మంద కృష్ణ మాదిగతో జత కట్టారు. మంత్రి పదవిలో ఉండగా ఎస్సి వర్గీకరణ గురించి ఒక్క మాట కూడా మాట్లాడని రావెళ్ల, మంత్రి పదవి కోల్పోగానే ఎస్సి వర్గీకరణ జపం చేయడం చూసి ఆయన వర్గానికి చెందిన ప్రజలే ఆశ్చర్యపోయి ముక్కున వేలేసుకున్నారు.

తెలుగుదేశం పార్టీలో మితిమీరిన కులతత్వం, అగ్రకుల ఆధిపత్యం వల్ల తీవ్ర వివక్షకు గురయ్యానని ఆరోపిస్తూ ఆ పార్టీకి రాజినామ చేసిన ఆయన వెంటనే తనకి మాయావతి నుండి బీఎస్పీ రాష్ట్ర పగ్గాలు చేపట్టవలసిందిగా పిలుపొచ్చినదని చెప్పుకొన్నారు. ఆ తరువాత వైసిపిలో చేరడానికి ఆ పార్టీ నేతలతో చర్చలు జరిపి అక్కడా అవకాశం రాకపోవడంతో చివరికి పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనలో చేరారు. ఏ పార్టీలో చేరినా దానికి తగ్గ స్క్రిప్ట్ ముందే రెడీ చేసి పెట్టుకొనే రావెళ్ల, ఎప్పటిలాగానే జనసేన అధ్యక్షుడు పవన కళ్యాణ్ ఆశయాలు కూడా తన ఆశయాలకు, బహుజన వాదానికి, అంబేద్కరిజానికి దగ్గరగా ఉన్నాయని, అందువల్లే తానూ జనసేనలో చేరుతున్నట్టు చెప్పుకొచ్చారు. ఆ ఎన్నికల్లో ఆయన పత్తిపాడు నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ఎన్నికల్లో జనసేన ఘోర ఓటమి తరువాత ఆయన తనకు అలవాటైన పనే కాబట్టి గడ్డం గీసుకున్నంత ఈజీగా పార్టీ కండువా మార్చేశాడు. కాకపొతే ఈసారి ఏమాత్రం అలస్యం చెయ్యకుండా తన మూల సిద్ధాంతాలకు, బహుజన దళిత వాదానికి, అంబేద్కరిజానికి, కాన్షిరాం వాదానికి బద్ద విరోధమైన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో కి దూకాడు. తన స్వార్ధ ప్రయోజనాలే తప్ప జాతి ప్రయోజనాలు పట్టించుకోని ఇలాంటి నేతలు సిద్ధాంతాలను ఆదర్శాలను గంగలో కలిపి స్వీయ వ్యక్తిగత ప్రయోజనాలకోసం ఎంతవరకైనా దిగజారడానికి వెనుకాడారు అని చెప్పడానికి తాజా ఉదాహరణ అయన కాకి నిక్కరు తెల్ల చొక్కా ధరించి ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొనడమే. ఒక పక్క దేశంలో ఎస్సి ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చెయ్యాలని డిమాండ్ చేసే ఆర్ఎస్ఎస్ లో కాన్షిరాం శిష్యుడినని చెప్పుకొనే రావెళ్ల కోశోర్ భాగస్వామి కావడం చూస్తుంటే ఇది అవకాశవాద రాజకీయాలకి పరాకాష్ట అని చెప్పొచ్చు. రాజకీయాల్లో ఇంతకంటే దివాళాకోరుతనం, దిగజారుడుతనం మరొకటి ఉండదేమో!! అధికారమే పరమావధిగా పనిచేసే ఈయన ఇప్పటికైనా నిజంగా వెనుకబడిన తన జాతి ప్రజల కోసం ఏమి చేశారో ఆత్మ విమర్శ చేసుకోవాలి.