నిన్న లోక్ సభలో జరిగిన చర్చలో రాష్ట్ర రాజధాని అంశంపై తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి సమాధానమిస్తూ రాజధాని రాష్ట్ర పరిధిలోని అంశమని, రాష్ట్ర సరిహద్దుల పరిధిలో ఎక్కడైనా రాజదాని ఏర్పాటు చేసుకొనే స్వేచ్చ ఆయా రాష్ట్రప్రభుత్వాలకుందని స్ఫష్టం చేశారు. అమరావతిని కేంద్రం నోటిఫై చేసినట్టుగా కేంద్రమంత్రి ప్రకటించినట్టు మీడియాలో వార్తలొచ్చాయి. దింతో నిన్న మధ్యాహ్నం నుండి తెలుగుదేశంతో పాటు, ఆ పార్టీ అనుకూల మీడియాలో అమరావతిని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది కాబట్టి ఇక మార్చడం కుదరేపని కాదంటూ పెద్ద ఎత్తున ప్రచారానికి తెరతీశారు.
నిన్నటి నుండి మీడియా చర్చలలో, సోషల్ మీడియా లో తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు, ఆపార్టీకి అనుకూలంగా వుండే మేధావులు ఈ చిన్న అంశాన్ని పట్టుకొని ఎదో జరిగిపోయినట్టుగా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వం నిజంగానే అమరావతిని నోటిఫై చేసినట్టుగా ఊహించుకొని, ఇక రాజధానిని మార్చే హక్కు జగన్ ప్రభుత్వానికి లేదని టివి స్టూడియోలు వేదికగా సొంతంగా తీర్పులిచ్చేశారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే నిజానిజాలు ఇంకా బయటకి రాకముందే కొన్ని చానల్స్ లో ఈ ఒక్క పాయిట్ ని హైలెట్ చేస్తూ, ఇది తెలుగుదేశానికి అనుకోకుండా దొరికిన అస్త్రమని, దీనితో జగన్ ప్రభుత్వంపై కోర్టుల్లో కూడా తెలుగుదేశం పైచేయి సాధించిందని, ఈ పరిణామంతో ప్రజలలో కూడా జగన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ అంటూ కొందరు స్వతంత్ర మేధావులు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు సైతం అత్యుత్సాహం ప్రదర్శించారు.
అయితే ఒక వర్గం మీడియాలో నిన్నటి నుండి జరుగుతున్నా ప్రచారానికి తెరదించే విధంగా ఈరోజు ఢిల్లీలో బిజెపి ఎంపి జీవిల్ నరసింహారావు తాజా పరిణామాలపై స్పందిస్తూ రాజదానిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ ఒక వితండవాదనని నిన్న మధ్యాహ్నం నుండి కొన్ని ప్రతిపక్షాలు (తెలుగుదేశాన్ని ఉద్దేశించి) తెరపైకి తీసుకొచ్చాయని, ఈ ప్రచారం కేవలం అమరావతి ప్రాంత రైతులను మభ్యపెట్టాలని కొన్ని పార్టీలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న తప్పుడు ప్రచారంగా కొట్టిపారేశారు. 2015 లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అమరావతి రాజధానిగా పేర్కొంటూ జీవో జారీచేసిందని, ఒకవేళ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా రాజదాని ని మార్చాలనుకుంటే దానిమీద మరొక జీవో జారీ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. రాజధాని అనేది కేంద్ర పరిధిలోని అంశం కాదని, రాజదానిపై రాష్ట్రప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని కేంద్రప్రభుత్వం అంగీకరిస్తుంది మరోసారి స్పష్టంచేశారు.
ఈ విషయంలో కేంద్రప్రభుత్వం రాజ్యాంగ బద్దంగా, నిబంధనకు అనుగుణంగా, సమాఖ్యస్ఫూర్తిని గౌరవిస్తూ పనిచెయ్యాల్సింటుందని జివియల్ తెలిపారు. రాజ్యాంగం ప్రకారం అంతకుముందు ప్రభుత్వాలు జీవో జారీచేసినప్పుడు, వాటిని మారుస్తూ కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు మరలా కొత్త జీవోలు జారీ చెయ్యడం సాధారణ విషయమేనని, ముందు చేసిన జోవోలు ఏమి అక్బర్ శిలాశాసనాలు కావంటూ పరోక్షంగా చంద్రబాబునుద్దేశించి వ్యాఖ్యానించారు. కేంద్రంలో ఎవరినైనా కలసి తమ సమస్యలు వినిపించే హక్కు రాజధాని ప్రాంత రైతులకుందని జివియల్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు రైతులను మభ్యపెట్టి వారిలో అనవసరంగా భ్రమలు కల్పించవద్దని ప్రతిపక్షాలని కోరారు.
అయితే వాస్తవం ఇలా ఉన్నప్పటికీ, నిన్నటి నుండి ఒకటిరెండు మీడియా చానెళ్లు తెరపైకి తెచ్చిన విషయాన్ని పట్టుకొని, అత్యుత్సాహానికి పోయిన తెలుగుదేశం నాయకులు వ్యవహార తీరు అదిగో తోక.. అంటే ఇదిగో పులి.. అనే చందంగా ఉందని చెప్పాలి. ఒక చిన్న విషయాన్ని కూడా విలువలు చలువలుగా చేసి మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తూ నానా తంటాలు పాడడం చూస్తుంటే రాజధాని విషయంలో తెలుగుదేశం నాయకుల వ్యవహారశైలి పై ప్రజలకు కూడా అనుమానాలు బలపడుతున్నాయి.
మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు అసలు నిజంగా కేంద్రప్రభుత్వం ఇంతవరకు అమరావతిని రాజధానిగా నోటిఫై చేసిందా ?? అంటే.. ఇంతవరకు అమరావతిని రాజధానిగా కేంద్రప్రభుత్వం నోటిఫై చెయ్యలేదు. అమరావతి రాజధానిగా రాష్ట్రప్రభుత్వం 2015 లో ఒక జోవో జారీ చేసింది. వాస్తవంగా రాష్ట్రప్రభుత్వం చేసిన తీర్మానాన్ని కేంద్ర హోం శాఖ ఆమోదించి గజెట్ విడుదల చెయ్యాలి. కానీ అమరావతి విషయంలో ఇటువంటి ప్రక్రియ ఏది జరగలేదు.
మాములుగా కేంద్రప్రభుత్వం నోటిఫై చేస్తే ఆ సమాచారం అధికారికంగా గజిట్ లో ముద్రించబడుతుంది. ఆ సమాచారం అధికారికంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి వస్తుంది. రాజ్యాంగ బద్దంగా జరిగే ప్రక్రియ ఈవిధంగా ఉంటే.. నలభై సంవత్సారాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి, రాష్ట్రానికి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు సైతం అమరావతి రాజధానిగా నోటిఫై అయిందని కేంద్రమంత్రి ప్రకటించారని మాట్లాడడం విడ్డురంగా ఉంది. వాస్తవానికి కేంద్రమంత్రి తన ప్రసంగంలో కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేసిన జోవో గురించి మాత్రమే మాట్లాడారు. అయితే దీన్ని పట్టుకొని ఒక వర్గం మీడియా మాత్రం కేంద్రప్రభుత్వం 2015 లోనే నోటిఫై చేసినట్టుగా కేంద్రమంత్రి ప్రకటించారంటూ కేంద్రమంత్రి ప్రకటనను పూర్తిగా వక్రీకరించి ప్రసారం చేయడం మొదలుపెట్టింది.
తెలుగుదేశం పెద్దలు చెబుతున్నట్టుగా ఇప్పటివరకు అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కేంద్ర హోం శాఖ అధికారికంగా నోటిఫై చెయ్యలేదు. మరి ఒకరిద్దరి మాటలను నమ్మి కేంద్రప్రభుత్వం నోటిఫై చేసిందని అసత్యప్రచారం చేస్తున్న తెలుగుదేశం ఈ విషయంలో ప్రజలకి ఏమి సమాధానం చెబుతుందో ??