చైనా పై పెరుగుతున్న ఒత్తిడి..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి చైనాలోని వూహాన్ నగరంలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. చైనాలో ఈ వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో ప్రపంచ దేశాలు ఈ మహమ్మారిని చాలా తేలిగ్గా తీసుకున్నాయి. చైనాను దాటి బయటకు వచ్చినా కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. వైరస్ ప్రభావం తెలుసుకునే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికాతో పాటు పలు దేశాలు చైనా పై గుర్రుగా ఉన్నాయి. కరోనా వైరస్, దాని ప్రభావం పై చైనా ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిందని విమర్శిస్తున్నాయి. అంతేకాదు కరోనా వైరస్ గబ్బిలాల నుంచి వచ్చిందన్న చైనా మాటలను నమ్మటం లేదు. చైనా ఈ వైరస్ ను తయారు చేసిందని ఆరోపిస్తున్నాయి.

ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా దేశాలు చైనా ను టార్గెట్ చేయగా తాజాగా జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ డ్రాగన్ దేశానికి క్లాస్ పీకారు. వైరస్ పై నిజానిజాలను చైనా ప్రపంచంతో పంచుకోవాల్సి ఉందని మోర్కెల్ అభిప్రాయపడ్డారు. వాస్తవాలను దాచడం వల్లప్రస్తుతం ప్రపంచం అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోందన్నారు.

ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు ఒక్కొక్కటిగా చైనాను టార్గెట్ చేయడంతో ఆ దేశం తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంది. ఈ సమయంలో డబ్ల్యూహెచ్ఓ చైనా ను వెనకేసుకొచ్చేందుకు రంగంలోకి దిగింది. కరోనా వైరస్ జంతువులు నుంచే సంక్రమించిందని తమ పరిశోధనలో వెల్లడైందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ ట్రెడోస్ పేర్కొన్నారు. గబ్బిలం నుంచి ఈ వైరస్ వ్యాపించి ఉండొచ్చని ఆయన చైనాను వెనకేసుకొస్తున్నారు. ఏదైనా దేశం చైనా పై విమర్శలు చేసిన ప్రతి సమయంలోనూ డబ్ల్యూహెచ్ఓ అధ్యక్షుడు ట్రెడోస్ తెరపైకి వస్తూ చైనాను వెనకేసుకు రావడం పలు అనుమానాలు దారితీస్తోంది. ట్రెడోస్ ను చైనా డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ గా నామినేట్ చేసింది.

కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన వూహన్ నగరంలో లాక్ డౌన్ ఎత్తివేశారు. మాంసం మార్కెట్లు తిరిగి ప్రారంభమయ్యాయి. గబ్బిలాల మాంసం విక్రయాలు కూడా జరుగుతోంది. చైనా, డబ్ల్యుహెచ్ఓ చెబుతున్నట్టు వైరస్ కి కారణం గబ్బిలాలే అయితే తిరిగి వాటి మాంసం విక్రయానికి చైనా ఎందుకు పూనుకుంతుందనేది ప్రపంచం అడుగుతున్న ప్రశ్న. ఇదే ప్రపంచ దేశాలు చైనా పై అనుమానాలు వ్యక్తం చేయడానికి ప్రధాన కారణంగా ఉంది. చైనా, డబ్ల్యుహెచ్వో చెప్పేదానికి వాస్తవ పరిస్థితికి పూర్తి భిన్నంగా పరిస్థితులున్నాయి.

వైరస్ పుట్టుపూర్వోత్తరాల పై పరిశోధన చేస్తామని అగ్రరాజ్యం ప్రకటించగా అందుకు తాము ఒప్పుకునే ప్రసక్తే లేదని చైనా తేల్చి చెప్పింది. అంతేకాకుండా హెచ్ఐవి ఎయిడ్స్ అమెరికాలో వెలుగులోకి వచ్చిందని.. దానికి అమెరికా ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నిస్తూ తమను విమర్శించిన వారి పై ఎదురు దాడి చేస్తోంది. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో వేచిచూడాలి.

Show comments