ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ, కాలిబాట వీడిన వలస కూలీలు

వలస కూలీలు కాలిబాట వీడారు. ఎండల్లో కాళ్లకు చెప్పు లు కూడా లేకుండా నడిచి వేళ్లే పరిస్థితి నుంచి తప్పించుకున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన కూలీలు ఏపీ మీదుగా వెళుతున్నప్పుడు వారికి రవాణా సదుపాయాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వం నిర్ణయం అమలులోకి వచ్చింది. అన్ని చోట్లా రాష్ట్రాల సరిహద్దుల నుంచి రాష్ట్రం దాటిపోయే వరకూ వారి బాధ్యతను ప్రభుత్వం స్వీకరిస్తోంది.

వసతి గృహాలు ఏర్పాటు చేసి ఆహారం , ఇతర సదుపాయాలు కల్పించింది. ఆ తర్వాత వారిని తరలించేందుకు బస్సులు ఏర్పాటు చేసింది. ఇతర వాహనాల్లో కూడా వారు వెళ్ళేందుకు తగ్గట్టుగా అనుమతులు ఇచ్చింది. దాంతో బీహార్, యూపీ , చత్తీస్ ఘడ్, జార్ఖండ్, బెంగాల్, ఒడిశా కూలీలు అనేక మందికి ఊరట లభించింది. తడ దగ్గర సరిహద్దు లో దాటగానే మళ్లీ ఇచ్ఛాపురం వెళ్లే వరకూ వారి బాధ్యతను జగన్ ప్రభుత్వం స్వీకరించింది.

గత రెండు రోజులుగా ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలతో ప్రస్తుతం వలస కూలీల కాలినడకన వెళ్లాల్సిన కష్టం తీరిపోయింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారుల వెంబడి నడిచివెళుతున్న వలస కూలీల సంఖ్య దాదాపుగా తగ్గిపోయింది. ఒకవేళ ఇంకా కొందరు నడిచి, ఇంకొందరు సైకిళ్లపై వెళుతుంటే వారికి కూడా తగిన ఏర్పాట్లు చేసేందుకు ప్రతీ జిల్లాలోనూ అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోంది. ఎవరైనా అలా వెళుతున్న సమాచారం అందిస్తే వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని చెబుతోంది.

దేశంలోనే తొలిసారిగా మానవత్వంతో వ్యవహరించిన జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని వలస కూలీలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు పూర్తి భరోసాగా నిలుస్తున్న జగన్ సర్కార్ కి కృతజ్ఞతలు చెబుతున్నారు. మొత్తంగా ఏపీలో వలస కూలీలు వెతలు తీరుతున్న పరిస్థితి సుస్పష్టంగా కనిపిస్తోంది.

Show comments