Idream media
Idream media
స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడినా.. టీడీపీలో రాజీనామాల పర్వం మాత్రం ఆగలేదు. ఇప్పటికే మాజీ మంత్రులు కరణం బలరాం, డొక్కా మాణిక్య వరప్రసాద్, కేఈ ప్రభాకర్‌లతోపాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ పార్టీకి రాజీనామా చేయగా.. వారి సరసన మరో మాజీ మంత్రి చేరారు. గుంటూరు జిల్లా నేత, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పారు. గాదెతోపాటు ఆయన కుమారుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాదె మదుసూధన్‌రెడ్డి కూడా టీడీపీకి రాంరాం చెప్పారు.
గుంటూరు జిల్లా బాపట్లలో ఈ విషయం మీడియాకు వెళ్లడించిన గాదె వెంకటరెడ్డి చంద్రబాబుపై త్రీవస్థాయిలో ఫైర్ అయ్యారు. 2019 ఎన్నికల్లో తన కుమారుడు మదుసూధన్‌రెడ్డికి టిక్కెట్ ఇస్తానని చంద్రబాబు వాగ్ధానం చేయడంతో 2015లో ఆ పార్టీలో చేరినట్లు గాదె తెలిపారు. కేవలం రాష్ట్ర కార్యదర్శి పదవితో సరిపెట్టారని వాపోయారు. టీడీపీలో తమకు అవమానాలు జరగడంతోనే పార్టీని వీడుతున్నామని గాదె మదుసూధన్‌రెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని తండ్రీకొడుకులు వెల్లడించారు.
రాష్ట్ర రాజకీయాల్లో గాదె వెంకటరెడ్డి సీనియర్ నేత. కాంగ్రెస్ పార్టీ నుంచి గాదె ప్రజా ప్రతినిధి జీవితం ప్రారంభమైంది. 1967లో ఆయన మొదటి సారి పర్చూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పర్చూరు, బాపట్ల నియోజకవర్గాల నుంచి ఆయన పలుమార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. చివరగా 2009లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున బాపట్ల నుంచి గెలిచారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి కేబినెట్‌లో ఎక్సైజ్ మంత్రిగా పని చేసిన గాదె.. వైఎస్ రాజశేఖరరెడ్డి, కొణిజేటి రోశయ్య మంత్రివర్గాల్లో దేవాదాయశాఖ మంత్రిగా పని చేశారు.