iDreamPost
android-app
ios-app

రేపటి నుంచి ఇంటింటికీ మాస్కుల పంపిణీ

రేపటి నుంచి ఇంటింటికీ మాస్కుల పంపిణీ

ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు రేపటి నుంచి ఇంటింటికి మాస్కులు పంపిణీ చేయనుంది. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరికి మూడు మాస్కుల చొప్పున ఇవ్వాలని ఇటీవల సీఎం జగన్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 5.30 కోట్ల మంది జనాభాకు ఒక్కొక్కరికి మూడు చొప్పున దాదాపు 16 కోట్ల మాస్కులు పంపిణీ చేయనున్నారు. మొదటగా రెడ్ జోన్ ప్రాంతాల్లో మాస్కులు పంపిణీ చేయాలని ఈరోజు కరోనా వైరస్ నియంత్రణ పై జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో మండలాలను రాష్ట్ర ప్రభుత్వం మూడు జోన్లుగా విభజించింది. కేసులు ఎక్కువగా ఉన్న మండలాలను రెడ్ జోన్లు గాను, కేసులు తక్కువగా ఉన్న మండలాలను ఆరెంజ్ జోన్ లలోనూ, కేసులే నమోదు కాని మండలాలను గ్రీన్ జోన్లు గాను రాష్ట్ర ప్రభుత్వం విభజించింది. ఏపీలో 42 మండలాలు రెడ్ జోన్ పరిధిలో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది. మాస్కులు పంపిణీ మొదట రెడ్ జోన్ ప్రాంతాల్లో పంపిణీ చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ పంపిణీ పూర్తయిన తర్వాత ఆరెంజ్ జోన్ల లోనూ, ఆఖరున గ్రీన్ జోన్లలో మాస్కులు పంపిణీ చేయనున్నారు.

రాష్ట్ర ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసే ఈ మాస్కుల తయారీని రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు అప్పగించింది. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల ద్వారా మాస్కుల తయారీ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టనుంది. పలుమార్లు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాంలు కుట్టిన చరిత్ర స్వయం సహాయక సంఘాలకు ఉంది. ఈ అనుభవం ఉండడంతో స్వయం సహాయక సంఘాల ద్వారా మాస్కుల తయారీ వేగవంతంగా జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.