Idream media
Idream media
తెలుగుదేశం పార్టీ చంద్రబాబు హస్తగతం అయ్యాక.. తొలిసారిగా భారీ సంక్షోభం ఎదుర్కొంటోంది. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ.. 2019 ఎన్నికల్లో దాన్ని నిలుపుకోలేకపోవడంతోపాటు.. చంద్రబాబుపై ప్రజల్లో నమ్మకం, విశ్వాసం తగ్గిపోవడంతో ఆ పార్టీ అత్యంత గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. పార్టీ నేతలు తమ భవిష్యత్ తాము చూసుకునేందుకు సిద్ధమైయ్యారు. గడచిన ఏడాది కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు తాజా, మాజీ ప్రజా ప్రతినిధులు టీడీపీని వీడి యువనాయకుడైన వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీలో చేరారు. తాజాగా ప్రకాశం జిల్లాలో ఆర్థికంగా బలమైన నాయకుడు, వైశ్య సామాజికవర్గానికి చెందిన నేత, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు వైసీపీలో చేరారు.
2014లో దర్శి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన శిద్ధా రాఘవరావు 2019 ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. దర్శి నుంచి 2014లో కనిగిరి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కదిరి బాబూరావు తప్పకపోటీ చేయాల్సివచ్చింది. ఆయన కూడా ఓడిపోయారు. ఇప్పటికే కదిరి బాబూరావు వైసీపీలో చేరగా.. తాజాగా శిద్ధా కూడా వైసీపీ కండువా కప్పుకోవడంతో దర్శిలో టీడీపీ బండిని నడిపించేది ఎవరన్న దానిపై అందరి చూపు పడింది.
కదిరి బాబూరావు వైసీపీలో చేరిన తర్వాత శిద్ధా రాఘవరావు తిరిగి దర్శి బాధ్యతలు తీసుకునేందుకు సుముఖంగా లేరు. పార్టీలో ఉన్నా చురుగ్గానూ లేరు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు.. తాను వద్దనుకున్న నాయకులే ఇప్పుడు దిక్కయ్యారు. ప్రస్తుతం దర్శి టీడీపీ ఇంచార్జిగా మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావును నియమించారు.
పాపారావు తండ్రి నారపుశెట్టి శ్రీరాములు సమితి ప్రెసిడెంట్‌గా, రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. 1996లో శ్రీరాములు మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన కుమారుడు పాపారావు గెలిచారు. 1999 ఎన్నికల్లోనూ టీడీపీ తరఫున పాపారావు బరిలో దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి సానికొమ్ము పిచ్చిరెడ్డి చేతిలో ఓడిపోయారు.
2004లో నారపుశెట్టి పాపారావును చంద్రబాబు పక్కనపెట్టేశారు. కనిగిరి నియోజకవర్గానికి చెందిన రత్నాల వ్యాపారి, సినీ హీరో బాలకృష్ణ మిత్రుడు కదిరి బాబూరావుకు దర్శి టిక్కెట్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే సానికొమ్ము పిచ్చిరెడ్డి పోటీ చేయగా.. కాంగ్రెస్ టిక్కెట్ ఆశించిన బూచేపల్లి సుబ్బారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్‌లో చేరారు.
2009లో కదిరి బాబూ రావు బాలకృష్ణ సహాయంతో తన సొంత నియోజకవర్గం కనిగిరి టిక్కెట్ సాధించుకోగలిగారు. కానీ నామినేషన్ చెల్లకపోవడంతో తన సమీప బంధువుకు సుంకర మధుసూదన్ (ఉంగరం గుర్తు) మద్ధతు ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేసిన ముక్కు ఉగ్రనరసింహారెడ్డి 1900 స్వల్ప ఓట్లతో బయటపడ్డారు. 2009లో దర్శి నుంచి కదిరి బాబూరావు స్థానంలో మన్నెం వెంకట రమణను చంద్రబాబు బరిలో దింపినా ఫలితం లేకుండా పోయింది. త్రిముఖ పోరులో ప్రజా రాజ్యం తరఫున ప్రస్తుత దర్శి ఎమ్మెల్యే మద్ధిశెట్టి వేణుగోపాల్ పోటీ చేయగా.. కాంగ్రెస్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కుమారుడు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి తొలిసారి పోటీ చేసి గెలిచారు.
1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో దర్శి నుంచి ప్రతి సారి కొత్త అభ్యర్థి పోటీ చేయగా.. 2014లో మాత్రమే టీడీపీ విజయం అందుకుంది. శిద్ధా రాఘవరావు టీడీపీ తరఫున పోటీ చేసి 1374 ఓట్ల స్వల్ప మెజారీటీతో గెలుపొందారు.
2004లో దర్శి నుంచి పోటీ చేసిన కదిరి బాబూరావు రెండు ఎన్నికల తర్వాత తిరిగి 2019లో దర్శి నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. తన సిట్టింగ్ స్థానం అయిన కనిగిరిని 2009లో తన ప్రత్యర్థి అయిన ముక్కు ఉగ్రనరసింహారెడ్డికి వదిలిపెట్టాల్సి వచ్చింది. అటు కనిగిరి, ఇటు దర్శి అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు ఒంగోలు పార్లమెంట్ సీటును కూడా గత ఎన్నికల్లో టీడీపీ కోల్పోయింది. ప్రస్తుతం బాబూరావు కూడా వైసీపీలో చేరడంతో తాను వద్దనుకున్న నారపుశెట్టి పాపారావే ప్రస్తుతం చంద్రబాబుకు దిక్కయ్యారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే .. కాలానికి సాధ్యం కాని పని అంటూ ఏమీ ఉండదని, అది చెప్పని పాఠం ఏదీ ఉండబోదని అర్థమవుతోంది.
Read Also: టీడీపీని వీడబోతున్న మాజీ మంత్రి శిద్ధా.. రాజకీయం జీవితం ఎలా మొదలైందంటే..?