iDreamPost
android-app
ios-app

ఏడాదికే వాలంటీర్ల సత్తా తెలిసింది.. జీతం 10 వేలు ఇవ్వాలంటున్న బీజేపీ నేత

ఏడాదికే వాలంటీర్ల సత్తా తెలిసింది.. జీతం 10 వేలు ఇవ్వాలంటున్న బీజేపీ నేత

ఏడాది కూడా కాకముందే ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు వాలంటీర్లు అందరి మన్ననలు పొందుతున్నారు. గత ఏడాది ఆగస్టులో వీరిని వైసీపీ సర్కార్‌ నియమించినప్పుడు ప్రతిపక్ష పార్టీలు విమర్శలు, అనుమానాలు వ్యక్తం చేశాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీల మాదిరిగా వాలంటీర్లు కూడా వ్యవహరిస్తారంటూ టీడీపీ మినహా, బీజేపీ ఇతర పార్టీలు, రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇక టీడీపీ అయితే వీరందరూ వైసీపీ కార్యకర్తలని, ఆ పార్టీ వారికే పథకాలు అందించేందుకు ఏర్పాటు చేసుకున్నారని విమర్శించింది.

అయితే రోజులు గడిచేకొద్దీ వాలంటీర్ల సేవలు అన్ని పార్టీలు గుర్తించాయి. స్థానిక నేతలతో సంబంధం లేకుండా వాలంటీర్లే ప్రభుత్వ పథకాలకు ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోవడం, ఆయా పథకాలు అందించడం చేస్తూ అందరి మన్ననలను పొందుతున్నారు. కరోనా సమయంలో ఇతర అధికారులందరూ ఇళ్లకే పరిమితం అవగా.. వాలంటీర్లు క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించారు. కరోనా కట్టడికి అత్యంత అవసరమైన వివరాలను మూడు సార్లు సర్వే చేసి రోజుల వ్యవధిలో ప్రభుత్వానికి అందించారు. ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్‌దారులందరికీ వారి ఇంటి వద్దకే వెళ్లి నగదు ఇస్తూ శెభాష్‌ అనిపించుకుంటున్నారు.

పార్టీలకు అతీతంగా వాలంటీర్లు సేవలందిస్తుండడంతో క్షేత్రస్థాయిలో టీడీపీ నేతలు, క్యాడర్‌లో వారి పట్ల స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇక వాలంటీర్ల సేవలు భేష్‌ అంటూ బీజేపీ నేతలు కొనియాడుతున్నారు. అంతేకాదు వారి సేవలకు ప్రస్తుతం ఇచ్చే గౌరవ వేతనం సరిపోదని, ఆ మొత్తం పెంచాలని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత విష్ణుకుమార్‌ రాజు డిమాండ్‌ చేస్తున్నారు. వాలంటీర్లకు నెలకు 10 వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని విష్ణుకుమార్‌ రాజు కోరుతున్నారు.

గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసిన వైసీపీప్రభుత్వం పరిపాలనను ప్రజల వద్దకు చేర్చింది. ఆయా సచివాలయాల్లో 10 నుంచి 13 మంది ఉద్యోగులను ఏర్పాటు చేసిన జగన్‌ సర్కార్‌.. గ్రామాల్లో 50 కుటుంబాలకు, పట్టణాల్లో ప్రతి 100 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ చొప్పున నియమించింది. వీరి ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.70 లక్షల మంది వాలంటీర్లు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా విధులు నిర్వర్తిస్తున్నారు.