లాక్ డౌన్ దిశగా భారత్…..అదే బాటలో తెలుగు రాష్ట్రాలు

కరోనా మహమ్మరి మరింత విజృంభించకముందే భారత్‌ దేశం అప్రమత్తమవుతోంది. ఈ రోజు ఆదివారం జనతా కర్ఫ్యూ విజయవంతంగా సాగుతోంది. దీన్ని మరికొన్ని రోజులు పొడింగేలా పలు రాష్ట్రాలు కీలక ప్రకటనలు చేశాయి. మరికొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ దిశగా ఆలోచనలు చేస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరాధి రాష్ట్రాలైన పంజాబ్, రాజస్థాన్‌లు ఈ నెల 31వ తేదీ వరకు లాక్‌ డౌన్‌ ప్రకటించాయి. కేరళలో జనతా కర్ఫ్యూను రేపు ఉదయం ఐదు గంటల వరకు పొడిగించారు.

ఈ సాయంత్రం ఐదు గంటలకు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, వైఎస్‌ జగన్‌లు మీడియా ముందుకు రాబోతున్నారు. వైద్యులు, ఇతర అత్యవసర సేవలు అందిస్తున్న వారికి సంఘీభావంగా చప్పట్లు కొట్టిన తర్వాత ఇరు రాష్ట్రాల సీఎంలు కీలక ప్రకటన చేయబోతున్నారని సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో 22 కేసులు నమోదయ్యాయి. ఇందులో స్థానికంగా ఉన్న వారు ఒకరికి కరోనా సోకడంతో తెలంగాణ కరోనా రెండో దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో జనతా కర్ఫ్యూను 24 గంటల పాటు అంటే… రేపు ఉదయం ఆరు గంటల వరకు పొడిగించిన సీఎం కేసీఆర్‌.. మరికొద్ది సేపట్లో జరగబోయే ప్రెస్‌మీట్‌లో ఈ నెల 31 వరకు లాక్‌ డౌన్‌ను ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి.

ఏపీ కూడా లాక్‌ డౌన్‌ దిశగా పయనిస్తున్నట్లు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. విజయవాడ ఒన్‌ టౌన్‌లో కరోనా పాజిటివ్‌ వ్యక్తి సంచారం నేపథ్యంలో మూడు రోజుల పాటు విజయవాడలో కర్ఫ్యూను ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా మరింతగా ప్రభలకుండా లాక్‌ డౌన్‌ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఐదు గంటలకు జరగబోయే ప్రెస్‌మీట్‌లో సీఎం జగన్‌ ఈ మేరకు ప్రకటన చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

లాక్‌డౌన్‌ చేస్తే.. ప్రజలకు నిత్యవసరాలు ఎలా అందించాలన్న దానిపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే ఓ ప్రణాళికను రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం ద్వారా ఇంటింటికి నిత్యవసర సరుకులు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ నిన్ననే ఈ విషయంపై సూచాయగా వెల్లడించగా.. ఏపీలో వాలంటీర్‌ వ్యవస్థ ఉండడంతో ఈ పని చాలా సులువుగా జరిగే అవకాశం ఉంది.

Show comments