iDreamPost
android-app
ios-app

రాజగురువు నయా అస్త్రం..ఆటోనగర్‌..!

రాజగురువు నయా అస్త్రం..ఆటోనగర్‌..!

ఆంధ్రప్రదేశ్‌ నలుమూల నుంచే కాదు తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటకల నుంచి చిన్న నట్టు బిగించాలన్నా.. పెద్ద పెద్ద విడిభాగాలు అవసరమున్నా.. ఇంజన్లు ఎత్తాలన్నా..దించాలన్నా…విజయవాడలోని ఆటోనగర్‌కే వచ్చేవారు…! అంటే ఇప్పుడు రావట్లేదా…? అవును గత ఆరేడు నెలల నుంచి రావట్లేదు..!

ఇదీ…తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సర్క్యుషన్‌ కలిగిన ఓ తెలుగు దినపత్రిక ఈ రోజు ఉదయం వండివార్చిన మెదటి పేజీ వార్త…! రాజకీయ ఇష్టాఇష్టాలను కాస్త పక్కన పెట్టి విశ్లేషించిన వారెవరికైనా ఈ వార్త వెనుక ఉన్న తత్వం సులభంగా బోధపడుతుందని చెప్పకతప్పదు…!

ఆటోనగర్‌లో కారు చీకట్లు కమ్ముకున్నాయ్‌…ఎందుకు..? ఇంకేమయ్యుంటుందీ..మరో అగ్నిప్రమాదం జరిగుంటుంది…! అబ్బే అదేం కాదు..! మరి..మళ్లీ హత్యలేమన్నా జరిగాయా…? అబ్బే అవేవీ కాదండీ…! అమరావతి తరలింపు, పోలవరం నిర్మాణం ఆగిపోవడంతో గత ఏడు నెలలుగా ఆటోనగర్‌ అన్నమో రామచంద్రా అని అలమటిస్తోంది..! అదేంటి అమరావతి ప్రకటన వెలువడి ఏడు నెలల కాలేదుగా…అని అమాయకంగా అడగొద్దు…! మాలెక్కలు..మా థియరీ ఇలాగే ఉంటాయి అంటారు.. రాజగురవు గారు…!

2014లో దేవేంద్రుడి రాజధానైన అమరావతి ఓ మహానగరంలా ఇలపై…అందునా కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య సింగపూర్‌ కన్షార్షియం సహకారంతో బుడిబడి అడుగులేయడం ప్రారంభించింది. మరి దీని కంటే ముందు ఏ మహా నగర నిర్మాణం ఆటోనగర్‌ను ఆదుకుంది…? అది ఏ రాష్ట్రంలో ఉంది..? ఈ ప్రశ్నలకు రాజగురువు సమాధానం చెప్పగలరా..? ఇక పోలవరం విషయానికొస్తే.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం ఆ ప్రాజెక్టు పనులు ఎంత వేగంగా ముందుకెళ్తున్నాయో అందరూ చూస్తూనే ఉన్నారు…! జాతీయ హోదా ప్రాజెక్టును తన చేతుల్లోకి తీసుకొని చంద్రబాబు ఏమేరకు పనులను పరిగెత్తించారో చూశాం..! జగన్‌మోహన్‌రెడ్డి సైతం అధికారంలోకి వచ్చిన పది నెలల్లో సంక్షేమంపై పెట్టిన శ్రద్ధ పోలవరంపై పెట్టినట్టు కనిపించట్లేదు. అయితే పోలవరానికి ముందు ఆటోనగర్‌కు ఊపిరిలు ఊదిన భహుళార్ధక ప్రాజెక్టులేవి..? అవెక్కడున్నాయి…? ఈ ప్రశ్నలకు నేరుగా సమాధానాలు చెప్పగలిగే దమ్ము ఆ పత్రిక ఉందా…? కచ్చితంగా ఉండదు..! ఎందుకంటే అది రాసిన ప్రత్యేక కథనం…అనేక అసత్యాల సమాహారం కాబట్టి…!

పత్రికలు, ప్రసార మాధ్యమాలు వాస్తవాలను రిపోర్ట్‌ చేయాలి…కానీ, దురుద్దేశాపూరితంగా అసత్యాలను వండివార్చ కూడదు. కానీ, చంద్రబాబు బైబిల్, ఖురాన్‌లతో పోల్చిన సదరు పత్రిక అవాస్తవాలను వండివార్చుతూ ప్రజలను తప్పుదోవపట్టించేందుకు ప్రయత్నిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవాలు సమాజం ముందు బహర్గితం అవ్వాలన్నా..సదరు పత్రిక దుర్బిద్ది బయటపడాలన్నా…కొన్ని విషయాలను పరిశీలించాల్సిందే…!

50 ఏళ్లు వెనక్కు వెళితే…విజయవాడ నగరంలో జనావాసాల మధ్య ఉన్న ఆటోమొబైల్‌ పరిశ్రమలను నగరం వెలుపల ఒక చోటుకి తరలించేందుకు ఆటోనగర్‌కు రూపకల్పన చేశారు. దీనికి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పునాది రాయి వేశారు. 1966లో జవహర్‌ ఆటోనగర్‌ ప్రారంభమైంది. ఉమ్మడి రాష్ట్రంలో తొలి ఆటోనగర్‌ కావడం, పైగా నిపుణులైన పనివారు ఉండటంతో ఏపీతోపాటు పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడకు బస్‌ బాడీ బిల్డింగ్, ఇంజన్‌ రిపేర్‌ ఇతరత్రా మరమ్మతులకు వచ్చేవారు. ఇక్కడి పనిచేసే వారికి మంచి ఆదాయాలు లభించేవి. కానీ, కాలక్రమేణా..ప్రతి రాష్ట్రం, ప్రతి నగరంలోనూ ఆటోనగర్‌లు అవతరించాయి. ప్రభుత్వాలు వాటికి స్థలాలు కేటాయించాయి. దాంతో ఆయా ప్రాంతాల్లోని వాహనాల మరమ్మతుల కోసం విజయవాడకు రావట్లేదు. తద్వారా వాహనదారులకు అదనపు భారం తగ్గడంతోపాటు ఆయా స్థానికులకు ఉపాధి లభిస్తోంది. పదేళ్లకు ముందు నుంచే ఈ మార్పు ప్రారంభమైంది. కానీ, దీన్ని కొత్తగా ఇప్పుడే తలెత్తిన సమస్యలా చిత్రీకరించడం అత్యంత ఆక్షేపణీయం.

గత రెండు మూడేళ్లుగా ప్రపంచం ఆర్థిక మాంద్య పరిస్థితులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా బ్రెగ్జిట్, చైనా–అమెరికా ప్రచ్ఛన్న యుద్ధం కారణంగా ఆటోమొబైల్‌ రంగం కుదేలైంది. భారత్‌లో వాహన కొనుగోళ్లు తీవ్రంగా పడిపోయాయని గణాంకాలు పేర్కొంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వాహనాలు అమ్ముడుబోని పరిస్థితులు ఉంటే…ఏపీలో మాత్రం భిన్నంగా ఎందుకు ఉంటాయి…? కానీ, దీన్ని మరుగున పరచి…బాడీ బిల్డింగ్‌కు వచ్చే వాహనాల సంఖ్య తగ్గింది..దానికి కారణం జగన్‌ ప్రభుత్వమే అనే తరహాలో వార్తలను ప్రచురించడం వెనుక ఉద్దేశం ఏమిటి ?

మానవ ప్రమేయం లేకుండా పనిచేయగలిగే సాంకేతికతనే ‘ఆటోమేషన్‌’ అని చెపొచ్చు. గత కొన్నేళ్లుగా ఆటోమేషన్‌(యాంత్రీకరణ) ఊపందుకుంది. దీంతో గతంలో పది మంది పనిచేసే చోట నలుగురే మిగులుతున్నారు. ఇది ఆటోమొబైల్‌ ఇండస్ట్రీకే కాదు..ప్రత్రికా రంగానికి విస్తరించింది..! గతంలో పేపర్‌ ప్రింటిగ్‌ యూనిట్లలో ఎంతమంది పనిచేసేవారు…ఇప్పుడు ఎంత మంది పనిచేస్తున్నారు…? కాబట్టి నాదాకా రానంత వరకే…! అని కాకుండా అన్నింటా సహజసిద్ధంగా జరిగే మార్పులకు స్వీయ ఉద్దేశాలను జోడించకుండా వార్తలు రాయడం సదరు పత్రికకు ఎంతైనా అవసరం…! కొసమెరుపేమంటే 2017లో ప్రభుత్వ విధానాలు, ఏపీఐఐసీ మద్దతు కొరవడటం కారణంగానే ఆటోనగర్‌ సమస్యల్లో చిక్కుకుందని విమర్శించిన ఇండిస్ట్రియల్‌ ఏరియా లోకల్‌ అథారిటీ(ఐలా) చైర్మన్‌ సుంకర దుర్గాప్రసాద్‌ ఇప్పుడు రాజగురువుకు వంత పాడటం గమనార్హం.