కరోనాపై పోరులో ప్రతి పౌరుడు ఓ సైనికుడు.. మాన్ కి బాత్ లో ప్రధాని మోదీ..

ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచేలా భారతదేశంలో కరోనా పై పోరు సాగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఈ పోరాటంలో ప్రతి పౌరుడు ఓ సైనికుడు అని కొనియాడారు. కరోనా పై సమరానికి ప్రజలే నాయ కత్వం వహిస్తున్నట్లు మోడీ పేర్కొన్నారు. లాక్ డౌన్ ను గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఒక్కరు పాటిస్తున్నారని కొనియాడారు. కరోనా యుద్ధంలో ప్రపంచ దేశాలకు భారత దేశం స్ఫూర్తిగా నిలుస్తున్న ట్లు చెప్పారు. కష్ట కాలంలో ఎంతోమంది దాతలు నిరుపేదలకు అండగా నిలుస్తున్నారని మోడీ కొనియాడారు. ఈ సమయంలో కేంద్రం, రాష్ట్రాలు కలిసి అద్భుతంగా పని చేస్తున్నాయని వివరించారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమానికి ప్రజలు బాసటగా నిలిచారని కొనియాడారు. వైద్యులు ఆరోగ్య సిబ్బంది, పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని ప్రశంసించారు.

కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. కార్మికులు ఆటో డ్రైవర్లు సహా రోజువారి ఆదాయంతో జీవించే వారి పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారందరినీ అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మన జీవితాల్లో కరోనా అనేక మార్పులు తెచ్చిందని పేర్కొన్న ప్రధాని నరేంద్రమోడీ.. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని పిలుపునిచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం వల్ల అనేక వ్యాధులు వస్తాయని పేర్కొన్న మోదీ ఈ అలవాటును ప్రజలంతా మానుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రపంచమంతా యోగాను గుర్తించింది అని చెప్పిన ప్రధాని కరోనా పై చికిత్స లో ఆయుర్వేదం కూడా మంచి ఫలితాలను ఇస్తుందని పేర్కొన్నారు. విపత్తు సమయంలో ప్రపంచ మానవాళి పట్ల భారత దేశం మానవతా దృక్పథంతో వ్యవహరించినట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఔషధాలను అనేక దేశాలకు అందించినట్లు గుర్తు చేశారు. ఈ ఘనతంతా మన అందరిదేనని కొనియాడారు.

Show comments