iDreamPost
android-app
ios-app

ఇంగ్లీష్ మీడియం ఓ సంకల్పం.. అడ్డుకోజాలరు..!

ఇంగ్లీష్ మీడియం ఓ సంకల్పం.. అడ్డుకోజాలరు..!

సంకల్పం బలీయమైనది అయితే లక్ష్యం తప్పక నెరవేరుతుంది. పేదలకు మంచి చేసే అంశానికి దైవబలము తోడు ఉంటుంది. ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నిరూపితమవుతోంది. నాణ్యమైన విద్యతోనే పేదరికం నుంచి బయటపడవచ్చన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆలోచన, ఆశయాన్ని ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆచరణలో పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. జగన్ లక్ష్యానికి అక్కడక్కడ అడ్డంకులు ఏర్పడుతున్నాయి. అయితే ఇవి తాత్కాలికమేనని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో బోధన జరగాలని ప్రభుత్వం జారీ చేసిన జీవోలు కొట్టివేసిన రాష్ట్ర హైకోర్టు.. తమ పిల్లలు ఏ మీడియంలో చదవాలి అనేది తల్లిదండ్రులు నిర్ణయించుకునే హక్కు ఉంటుందని తీర్పునిచ్చింది. ఈ తీర్పే ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెట్టాలనే ఆలోచనలో ఉన్న ప్రభుత్వానికి, తమ పిల్లలకు ఇంగ్లీషు చదువులు కావాలనుకునే తల్లిదండ్రులకు వరంగా మారింది.

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించే పిల్లల తల్లిదండ్రులు.. తమ పిల్లలు వచ్చే విద్యా సంవత్సరంలో ఏ మీడియంలో చదవాలని కోరుకుంటున్నారో ప్రభుత్వం తెలుసుకోవాలని నిర్ణయించింది. ప్రతి పాఠశాలలోనూ, ప్రతి తరగతిలోనూ విద్యార్థుల తల్లిదండ్రులను విద్యాశాఖ అధికారులు ఒక ప్రశ్న అడగనున్నారు. మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలా..? లేదా తెలుగు మీడియంలో చదవాలా ..? అనే ప్రశ్న ద్వారా వారి అభిప్రాయాలను సేకరించనున్నారు. మెజారిటీ తల్లిదండ్రుల అభిప్రాయం మేరకు సంబంధిత క్లాసులో ఆయా మీడియంలో బోధన జరపనున్నారు. 40-50 మంది ఉన్న ఒక క్లాసులో నలుగురైదుగురు తెలుగు మీడియం కావాలనుకుంటే వారిని మండల కేంద్రంలో ఏర్పాటు చేసే తెలుగు మీడియం పాఠశాలలో చేర్పించనున్నారు. రవాణా ఖర్చులు ప్రభుత్వమే భరించనుంది. ఈ మేరకు తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా, మండల విద్యాశాఖ అధికారులు ప్రస్తుత విద్యా సంవత్సరం(2019-20)లో తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు.

ప్రభుత్వ పాఠశాలలో తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తూ మిగతా సబ్జెక్టులను ఇంగ్లీష్ మీడియంలో బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎవరైనా విద్యార్థులు తాము తెలుగు మీడియంలోనే చదవాలని కోరుకుంటే వారికోసం ప్రతి మండల కేంద్రంలో ఒక తెలుగు మీడియం పాఠశాలలు ఏర్పాటు చేయాలని భావించింది. పాఠశాలకు రానుపోను ఖర్చులను ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పలువురు కోర్టులను ఆశ్రయించారు. కోర్టు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. తమ పిల్లలు ఏ మీడియంలో చదవాలో నిర్ణయించుకునే హక్కు తల్లిదండ్రులకు ఉంటుందని స్పష్టం చేసింది. ఐతే తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలోనే చదివించాలని కోరుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంగ్లీష్ మీడియం చదువుల కోసం తల్లిదండ్రులు తమ శక్తి కి మించి ఫీజులు కట్టి ప్రయివేటు పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పిస్తున్నారు. ఇప్పుడు కోర్టు తీర్పు ద్వారానే ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం అమలుకానుండడం విశేషం.