iDreamPost
iDreamPost
’మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ .. స్లోగన్ తో అగ్రరాజ్యం బలోపేతానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలు మొదలుపెట్టాడు. కరోనా వైరస్ దెబ్బకు అమెరికాలోని చాలా వ్యవస్ధలు కుప్ప కూలిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఉత్పత్తి, ఆటోమొబైల్, సేవలు, మెడికల్, టూరిజం ఇలా చాలా వ్యవస్ధలు దెబ్బతినటంతో దేశం మొత్తం మీద దాదాపు 3 కోట్ల మంది ఉద్యోగ, ఉపాధిని కోల్పోయినట్లు ఓ అంచనా. దాంతో కరోనా వైరస్ నుండి అమెరికా కోలుకున్నా మళ్ళీ ఆర్ధిక వ్యవస్ధను గాడిలో పెట్టడం మామూలుగా అయితే అంత సులభం కాదు.
అందుకనే మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అనే స్లోగన్ ను ట్రంప్ ఎత్తుకున్నాడు. ఇందులో భాగంగానే ఇతర దేశాల్లో ఉండే కంపెనీలన్నింటినీ అమెరికాకు వచ్చేయాలంటూ ఆహ్వానిస్తున్నాడు.అమెరికాకు తిరిగి వచ్చేసే కంపెనీలకు అనేక ప్రోత్సాహకాలిస్తానని ఊరిస్తున్నాడు. తన ఆహ్వానాన్ని కాదని కంపెనీలు అమెరికాకు కాకుండా ఇతర దేశాలకు తరలి వెళితే ఇపుడిస్తున్న ప్రోత్సాహకాలను ఎత్తేయటమే కాకుండా మరిన్ని ట్యాక్సులను విధిస్తానని కూడా హెచ్చరిస్తున్నాడు.
ఇంతకీ అసలీ పరిస్దితి ఎందుకు వచ్చిందంటే కరోనావైరస్ పుట్టిల్లయిన చైనా నుండి చాలా అమెరికన్ కంపెనీలు బయటకు వచ్చేయాలని డిసైడ్ అయ్యాయి. చైనాలో కంపెనీలను ఎత్తేస్తే ఏ దేశంలో పెడితే బాగుంటుందని అధ్యయనం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే యాపిల్ కంపెనీ తరలింపు విషయంలో యాజమాన్యం భారత్ లేదా ఐర్లాండ్ వైపు చూస్తోంది. మానవ వనరులు చవకగా ఉంటుంది కాబట్టి భారత్ లో కంపెనీ ఏర్పాటు చేసే అవకాశం ఉందంటున్నారు.
ఈ నేపధ్యంలోనే ట్రంప్ రంగం ప్రవేశం చేశాడు. విదేశాల్లోని అమెరికా కంపెనీలన్నీ తిరిగి సొంతదేశానికే రావాలంటూ ఒత్తిళ్ళు మొదలుపెట్టాడు. అమెరికాలో వైరస్ సంక్షోభానికి ట్రంపే కారణమంటూ జనాలు మండిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. దాంతో రాబోయే ఎన్నికల్లో తన గెలుపుపై జనాగ్రహం ఎక్కడ ప్రభావం చూపుతుందో అన్న భయం ట్రంప్ ను వెంటాడుతోంది. అందుకనే ఏదో ఓ రకంగా మళ్ళీ గెలవాలన్న ఆలోచనతోనే ప్రపంచంలో ఎక్కడెక్కడున్న సంస్ధలన్నింటినీ అమెరికాకు పిలిపించి ఉద్యోగ, ఉపాధిని ఇప్పించాలన్నది ట్రంప్ ఆలోచనగా కనబడుతోంది. మరి కంపెనీల యాజమాన్యాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాల్సిందే.