Idream media
Idream media
కరోనా వల్ల కొనసాగుతున్న లాక్‌డౌన్ వల్ల విద్యా రంగం అస్తవ్యస్తంగా మారిపోయింది. దాదాపు రెండు నెలల తరగతులను విద్యార్థులు కోల్పోయారు. కొన్ని తరగతుల పరీక్షలు అసలు మొదలు కాలేదు. మరికొన్ని మద్యలో ఆగిపోయాయి. కొన్ని వాయిదా పడ్డాయి. వచ్చే సంవత్సరం తరగతులు కూడా మూడు నెలలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో విద్యా సంవత్సరం మొదలవుతుందని చెబుతున్నారు. అయితే కరోనా ప్రభావం తగ్గకపోతే మరిన్ని నెలలు ఆలస్యం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విద్యార్థులు కోల్పోయే తరగతులను అదనపు క్లాసులు చెప్పి భర్తీ చేస్తామని పలు రాష్ట్రాల విద్యా శాఖలు చెబుతున్నాయి. అయితే అదనపు క్లాసులతో విద్యార్థులపై ఒత్తిడి పెరిగిపోయే అవకాశం ఉందని విద్యా నిపుణలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల వైపు విద్యా సంస్థలు దృష్టిసారిస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరానికి సిలబస్‌ను తగ్గిస్తే ఎలా ఉంటుంది? అనే దానిపై చర్చలు సాగిస్తున్నాయి. దీనికి బలం చేకూర్చేలా సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) సిలబస్‌ను తగ్గించే యోచన చేస్తున్నట్లు కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రి రమేష్ పోఖ్రియల్ నిశాంక్ వెల్లడించారు.
ముఖ్యమైన, పై తరగతులను అవసరమైన సిలబస్‌ను కొనసాగిస్తూ విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు కొన్ని పాఠ్యాంశాలను కుదించే అంశంపై నిపుణలు అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు. ఎంత మేరకు విద్యార్థులు కాలాన్ని నష్టపోతున్నారో కూడా పరిగణనలోనికి తీసుకుంటున్నట్లు తెలిపారు. సీబీఎస్‌ఈ అంశాన్ని పరిగణనలోనికి తీసుకుని ఆయా రాష్ట్రాల విద్యా శాఖలు కూడా స్థానిక సిలబస్‌ను తగ్గించే అవకాశం ఉంది.
విద్యార్థులపై ప్రస్తుతం పలు విద్యా సంస్థలు ఆన్‌లైన్‌లో క్లాసులు చెబుతున్నప్పటికీ అవి అంత ప్రభావం చూపడం లేదు. అదేసమయంలో గ్రామాల్లోని విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు అందుబాటులోకి రావడం లేదు. ఇంటర్‌నెట్ సదుపాయం లేకపోవడం, స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్‌లు అందుబాటులో లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తరగతిలో విద్యార్థులు ఉన్నప్పుడే అందరిపై పర్యవేక్షణ సాధ్యమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తరగతులు ప్రారంభమైన తర్వాత అందరికీ మేలు చేసేలా సిలబస్ కుదింపు మాత్రమే ఉత్తమ మార్గమని అర్థం అవుతోంది. మరి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ముందుకు వెళ్తాయో చూడాలి.