iDreamPost
android-app
ios-app

రాజ్యసభ బరిలో టీడీపీ నిలుస్తుందా..?

రాజ్యసభ బరిలో టీడీపీ నిలుస్తుందా..?

రాజ్యసభ ఎన్నికల నామినేషన్‌కు మరో మూడు రోజుల సమయమే ఉంది. ఈ నెల 13వ తేదీతో నామినేషన్‌ గడువు ముగుస్తోంది. 26న ఎన్నికలు, అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. ఏపీలో నుంచి ఖాళీ అవుతోన్న నాలుగు రాజ్యసభ స్థానాలకు అధికార వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ప్రకటించింది. ప్రతిపక్ష టీడీపీ ఇప్పటి వరకూ రాజ్యసభ ఎన్నికల ఊసే ఎత్తలేదు. రాబోవు మూడు రోజుల్లో ఈ అంశంపై టీడీపీ ఆలోచనలు చేస్తుందా..? గెలుపోటములు పక్కనపెట్టి కనీసం అభ్యర్థిని బరిలోకి దింపుతుందా…? అనే అంశాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి.

టీడీపీ ఆవిర్భాం తర్వాత ఇప్పటి వరకూ రాజ్యసభకు జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ టీడీపీ పోటీ చేస్తోంది. బలం లేకపోయినా అదనపు అభ్యర్థిని నిలిపిన చరిత్ర టీడీపీది. అయితే ఈ సారి రాజ్యసభ రేసులో టీడీపీ ఉంటుందా..? అన్న అనుమానాలు గణాంకాలు ద్వారా కలుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 175 స్థానాలున్నాయి. ఒక అంగ్లో ఇండియన్‌ (నామినేటెడ్‌ చేయలేదు)తో కలిపి ఆ సంఖ్య 176కు చేరుకుంటుంది. నాలుగు స్థానాలు ఖాళీ అయిన నేపథ్యంలో ఒక అభ్యర్థి విజయం సాధించాలంటే గరీష్టంగా 44 మంది ఎమ్మెల్యేల మద్ధతు అవసరం. వైఎస్సార్‌సీపీకి 151 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉంది. వారితోపాటు టీడీపీకి చెందిన ఇద్దరు, జనసేనకు చెందిన మరో ఎమ్మెల్యే అధికార పార్టీకి మద్ధతు పలుకుతున్నారు. వెరసి వైఎస్సార్‌సీపీ బలం 154కు చేరుకుంటోంది. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేస్తున్న నలుగురు గెలుపు నల్లేరుమీద నడకే.

అధికార పార్టీ అభ్యర్థుల గెలుపునకు అవసరమైన బలం వారికి ఉండడంతో ఈ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండే అవకాశం లేకపోలేదు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున 23 మంది గెలిచారు. వీరిలో ఇద్దరు ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఒక వేళ ఓటు వేయాల్సి వస్తే… మిగిలిన 21 మందిలో ఎంత మంది టీడీపీకి అనుకూలంగా వేస్తారన్నది పెద్ద ప్రశ్న. నామినేషన్‌ దాఖలుకు అవసరమైన 20 మంది ఎమ్మెల్యేల బలం టీడీపీకి ఉంది. గెలుపోటములతో సంబంధంలేకుండా కనీసం పోటీలో ఉన్నామని చెప్పుకునేందుకుకైనా పోటీ చేయాలంటే.. అభ్యర్థిని బలపరుస్తూ 20 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేయాలి. 21 మందిలో ఇద్దరు హ్యాండ్‌ ఇచ్చినా.. ఆదిలోనే పరువుపోతుంది. అంతకన్నా పోటీ చేయకపోవడమే టీడీపీకి మేలు చేస్తోంది.

ఇవన్నీ ఆలోచించి రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉన్నా.. అది కూడా ఒక రికార్డే. టీడీపీ ఆవిర్భాం తర్వాత రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండడం ఇదే తొలిసారి అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి స్టెప్‌ తీసుకుంటారో మరో మూడు రోజుల్లో తేలిపోతుంది.