తెలంగాణాలో కూడా బిజెపి, జనసేన మధ్య పొత్తా ? కుదిరేపనేనా ?

రెండు పార్టీల మధ్య ఏపిలో పొత్తులు బ్రహ్మాండంగా సాగుతోంది అందుకనే తెలంగాణాలో కూడా పొత్తులు పెట్టుకోవాలని డిసైడ్ అయ్యింది. తెలంగాణా బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోమవారం రాత్రి భేటి అయ్యారు. ఇద్దరి మధ్య భేటి మర్యాదపూర్వకమే అని చెబుతున్నా పొత్తు విషయం చర్చించేందుకే భేటి అయ్యారంటూ సమాచారం. బేటి తర్వాత సంజయ్ మీడియాతో మాట్లాడుతూ రెండు పార్టీలు కలిసి పనిచేయబోతున్నట్లు ప్రకటించారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మొన్నటి ఎన్నికల తర్వాత రెండు పార్టీలు ఏపిలో ఘోరంగా ఓడిపోయాయి. కాకపోతే బిజెపికన్నా జనసేన ఎక్కువ ఓట్లు తెచ్చుకుంది. జగన్మోహన్ రెడ్డి దెబ్బకు తెలుగుదేశంపార్టీనే బొక్క బోర్లా పడింది. ఇక ఈ రెండు పార్టీలేంత ? అందుకనే పొత్తులు పెట్టుకుంటే తప్ప జగన్ ను ఢీ కొనటం సాధ్యం కాదని అనుకున్నట్లున్నాయి. అందుకనే అర్జంటుగా పవన్ బిజెపితో పొత్తు పెట్టేసుకున్నాడు.

ఢిల్లీ స్ధాయి పరిచయాలతో కమలంపార్టీతో పవన్ పొత్తుపెట్టుకున్నా అదేమంతా వర్కవుటవుతున్నట్లు లేదు. ఎందుకంటే పవన్ తో పొత్తు పెట్టుకోవటం రాష్ట్రస్ధాయిలోని చాలామంది నేతలకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకనే పొత్తు పెట్టుకుని ఇప్పటికి సుమారు 10 మాసాలైనా రెండు పార్టీలు కలిసి ఇంత వరకూ ఒక్క కార్యక్రమం కూడా కలిసి చేయలేదు. కారణం ఏమిటంటే బిజెపిలోని చాలామంది నేతలకు ఫస్ట్ టార్గెట్ చంద్రబాబునాయుడు. కానీ పవన్ టార్గెట్ మాత్రం జగనే. ఇక్కడే రెండుపార్టీల మధ్య సమస్య మొదలైంది.

ఇక తెలంగాణా విషయానికి వస్తే కాస్త అటుఇటుగా ఇదే సమస్య ఎదురవుతుందనటంలో సందేహమే లేదు. ఎలాగంటే తెలంగాణాలో బిజెపి మొదటి శతృవు కేసీయార్. కానీ పవన్ మాత్రం కేసీయార్ గురించి ఒక్కమాట కూడా వ్యతిరేకంగా మాట్లాడడు. మరి కేసీయార్ అంటే భయమో లేకపోతే భక్తో తెలీదు కానీ కేసీయార్ పై ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడాలన్న పవన్ వణికిపోతాడు. మరి ప్రత్యర్ధి విషయంలోనే రెండు పార్టీల మధ్య ఇంత తేడా ఉన్నపుడు రెండు పార్టీలు కలిసి ఏ విధంగా పనిచేస్తాయి ?

రేపొకవేళ పొత్తు పెట్టుకున్నా కేసీయార్ విషయంలో బిజెపి నేతలు ఒంటి కాలిమీద లేచినపుడు పవన్ ఏం చేస్తాడు ? పొత్తన్నాక మిత్రపక్షానికే మద్దతుగా పవన్ నిలబడాలి కదా ? మరి ఆ పని చేయగలడా ? ప్రత్యర్ధుల విషయంలో ఎవరి ప్రయారిటీ వాళ్ళకున్నపుడు ఇక పొత్తులెందుకు దండగ ? కాబట్టి కలిసి పనిచేస్తామని ప్రకటించినంత సులువు కాదు పనిచేయటం చూద్దాం ఏం జరుగుతుందో ?

Show comments