Idream media
Idream media
మహారాష్ట్రలోని మహా వికాస్ అగాఢీ సంకీర్ణ ప్రభుత్వం దిన దిన గండం నూరేళ్ళు ఆయుష్షుగా కొనసాగుతుంది.కాగా అధికార కూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య అభిప్రాయ భేదాలలకు కొంతమంది అధికారులు కారణమని కాంగ్రెస్ నేత అశోక్ చౌహాన్ ఆరోపించడం ఆశ్చర్యపరుస్తోంది.
మహారాష్ట్రలోని అధికార సంకీర్ణంలో భాగస్వామ్య పక్షాల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్న మాట వాస్తవమేనని మహారాష్ట్ర పిడబ్ల్యుడి మంత్రి,కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ అంగీకరించారు. శివసేన నేతృత్వంలోని అధికార సంకీర్ణంలో కాంగ్రెస్ గత కొంతకాలంగా అసంతృప్తి వెలుబుచ్చుతుంది.అయితే రాబోయే రెండు రోజులలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశమై వాటిని పరిష్కరించుకుంటామని మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ తెలిపారు.
గత ఏడాది నవంబర్‌లో మహా వికాస్ అగాఢీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు అధికారం,బాధ్యతలను మూడు పార్టీలు సమానంగా పంచుకోవాలని నిర్ణయించామని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు.కానీ గత వారం కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సమావేశమై ప్రభుత్వం తీసుకునే పాలనాపరమైన కీలక నిర్ణయాలలో తమ మంత్రుల అభిప్రాయాలకు ప్రాధాన్యత లభించడం లేదని అసంతృప్తి వెలిబుచ్చింది.దీంతో ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన మిలింద్ నార్వేకర్ సిఎం దూతగా సంప్రదింపులు జరిపి కాంగ్రెస్ సమస్యలను తెలుసుకున్నాడు.ఈ నేపథ్యంలో ప్రభుత నిర్ణయాలలో కాంగ్రెస్‌కు ప్రధాన భాగస్వామ్యం కల్పించాలని పీసీసీ అధ్యక్షుడు బాలాసాహెబ్ థోరట్ డిమాండ్ చేశారు.
గత మే చివరి వారంలో అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీ సంకీర్ణం నుండి వైదొలగనున్నది అనే ఊహాగానాల మధ్య ఎన్సీపీ అధినేత శరద్ పవార్ గవర్నర్,ముఖ్యమంత్రిని కలవడం చర్చనీయాంశం అయింది.అదే సమయంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో పెద్ద దుమారాన్ని రేపాయి.మహారాష్ట్రలో ప్రభుత్వానికి కేవలం మద్దతు మాత్రమే ఇస్తున్నాము, పరిపాలనలో నిర్ణయ అధికారం మాది కాదని ఆయన పేర్కొన్నాడు. పంజాబ్,ఛత్తీస్‌గఢ్,రాజస్థాన్,పుదుచ్చేరిలో పాలనాపరమైన కీలక నిర్ణయాలు మేమే తీసుకుంటున్నాము.ఇక ప్రభుత్వం నడపడానికి,మద్దతు ఇవ్వడానికి మధ్య తేదా ఉందని రాహుల్ వ్యాఖ్యానించడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది.
అయితే మహారాష్ట్రలోని అధికార కూటమిలో విభేదాలకు ప్రధాన కారణంగా గవర్నర్ కోటా నుండి శాసనమండలి సీట్ల కేటాయింపు,రాష్ట్రములోని వివిధ బోర్డు అధ్యక్షుల నియామకాలకు సంబంధించినదిగా తెలుస్తుంది.ప్రస్తుతం గతంలో కుదిరిన ఒప్పందానికి భిన్నంగా 12 ఎమ్మెల్సీ స్థానాలలో మూడు సీట్లు మాత్రమే కేటాయించడంపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.తాజా ప్రతిపాదన ప్రకారం 12 శాసన మండలి స్థానాలలో శివసేనకు 5 సీట్లు,నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి 4 సీట్లు,కాంగ్రెస్‌కు 3 సీట్లు కేటాయించారు.అయితే భాగస్వామ్యపక్షాల అన్నిటికీ సమానంగా 4 సీట్లు చొప్పున కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇక ఈ విషయంలో అమీతుమీ తేల్చుకునేందుకు సోమవారం ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ బాలాసాహెబ్ థోరట్, పిడబ్ల్యుడి మంత్రి అశోక్ చవాన్ సమావేశం కానున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉంటే మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది.ప్రజలు కరోనా తోటి పోరాటం చేస్తుంటే ప్రభుత్వ సంకీర్ణ భాగస్వామ్య పక్షాలు తమ పదవుల పంపకాలపై దృష్టి పెట్టాయని ప్రతిపక్ష బిజెపి విమర్శించింది.