iDreamPost
iDreamPost
జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయం, వాలంటీర్ల వ్యవస్ధపై ముస్సోరీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ముస్సోరీలో శిక్షణను పూర్తి చేసుకున్న ఐఏఎస్ అధికారులు రాష్ట్రానికి వచ్చారు. వచ్చిన ఐఏఎస్ లు జగన్మోహన్ రెడ్డితో భేటి అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ సచివాలయం, వాలంటీర్ల వ్యవస్ధపై తమ శిక్షణలో అనేక సార్లు చర్చలు జరిగినట్లు చెప్పారు. పై రెండు అంశాలపైనే కాకుండా అధికార వికేంద్రీకరణపైన కూడా అనేక చర్చలు జరిపినట్లు చెప్పటం విశేషం.
మామూలుగా ఐఏఎస్ శిక్షణలో భాగంగా ముస్సోరీ శిక్షణా కేంద్రంలో అనేక అంశాలపై యువ ఐఏఎస్ లకు శిక్షణ ఇస్తారు. ఎందుకంటే వివిధ రాష్ట్రాల్లో పోస్టింగుల్లో జాయిన్ అయిన తర్వాత అనేక విభాగాల్లో పనిచేయాల్సుంటుంది. కాబట్టి రెవిన్యు, పంచాయితీరాజ్, మున్సిపల్, పోలిసింగ్ తదితర చట్టాలపై వీళ్ళకు అవగాహన కల్పిస్తారు. తర్వాత వీళ్ళ పోస్టింగులకు తగ్గట్లుగా ఫీల్డు ట్రైనింగ్ కూడా ఉంటుంది. సరే సర్వీసు పెరిగేకొద్దీ ఉద్యోగంలో వీళ్ళు రాటుదేలిపోతారు.
ఇటువంటి శిక్షణలోనే యువ ఐఏఎస్ లకు గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్ధతో పాటు అధికార వికేంద్రీకరణపై క్లాసులు తీసుకోవటం, చర్చలు జరపటమంటే జగన్మోహన్ రెడ్డికి క్రెడిట్ అనే చెప్పాలి. ఎందుకంటే దేశం మొత్తం మీద గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్ధను ఏర్పాటు చేసింది ఒక్క జగన్ మాత్రమే. ఈ వ్యవస్ధల ఏర్పాటుపై ఇప్పటికే తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశ్సా ప్రభుత్వాలు జగన్ ను అభినందించిన విషయం తెలిసిందే. అధికార వికేంద్రీకరణ నిర్ణయం మాత్రం ఇంకా అమలుకు నోచుకోలేదు.
మిగిలిన రెండు వ్యవస్ధల ఏర్పాటు ద్వారా జగన్ కరోనా వైరస్ సంక్షోభాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడనే చెప్పాలి. అలాగే ఇంటింటికి రేషన్, ఇంటింటికి పింఛన్ అందచేయటంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందుతున్నది లేనిది కూడా వాలంటీర్లే ప్రభుత్వం దృష్టికి తెస్తున్నారు. అలాగే అనేక వ్యవస్ధలకు సంబంధించిన ప్రజల అవసరాలను గ్రామ సచివాలయంలో తీరుతున్నాయి.
బహుశా ఇటువంటి అంశాలను స్పూర్తిగా తీసుకునే యువ ఐఏఎస్ లకు ఇచ్చే శిక్షణ సిలబస్ లో గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్ధలను చేర్చారంటే ఆ క్రెడిట్ జగన్ కే దక్కుతుందనటంలో సందేహం లేదు. ఇదే విషయాన్ని యువ ఐఏఎస్ లు జగన్ కు వివరించి చెప్పారు.