రాష్ట్రంలోనే మొదటి “దిశా” స్టేషన్ ను ప్రారంభించిన జగన్

  • Published - 06:55 AM, Sat - 8 February 20
రాష్ట్రంలోనే మొదటి “దిశా” స్టేషన్ ను ప్రారంభించిన జగన్

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్మించిన రాష్ట్రంలోనే మొదటి ‘దిశా ప్రత్యేక పోలీస్ స్టేషన్’ శనివారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఈ దిశా ప్రత్యేక పోలీస్ స్టేషన్లలో ఇద్దరు డిఎస్పీ స్థాయి అధికారులతో పాటు 52 మంది సిబ్బంది ఉంటారు. మరొకొన్ని రోజులలోనే రాష్ట్ర ప్రభుత్వం ‘దిశా’ ప్రత్యేక న్యాయస్థానాలను కూడా ఏర్పాటు చేయబోతుంది.

లైంగిక దాడులకు, అకృత్యాలకు గురైన మహిళలకు సత్వరం న్యాయం చెయ్యడానికి ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే మొదటిసారి ప్రత్యేకంగా ‘దిశా’ చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఈ దిశా ప్రత్యేక పోలీస్ స్టేషన్ లు ఏర్పాటు చేస్తున్నారు. మహిళలకు సంబంధించిన ఏ నేరాన్నైనా దిశా ప్రత్యేక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయోచ్చు. ఈ ప్రత్యేక దిశా స్టేషన్లో రోజు మొత్తం 24 గంటలు పాటు కంట్రోల్ రూము ప్రజలకు అందుబాటులో ఉంటుంది. అంతేకాకూండా ప్రభుత్వం మహిళలకోసం “దిశా ప్రత్యేక యాప్” ని కూడా రూపొందించారు. ఈ యాప్ ద్వారా కూడా మహిళలు అందుబాటులో ఉన్న అన్నిసేవలు వినియోగించుకోవచ్చు.

రాజమండ్రి లో జగన్ చేతులమీదుగా ప్రారంభించిన దిశా ప్రత్యేక పోలీస్ స్టేషన్ లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు అంతస్తుల్లో నిర్మించిన ఈ స్టేషన్ లో ఒక వెయిటింగ్ హాల్, హెల్ప్ డెస్క్, కౌన్సిలింగ్ రూము అందుబాటులో ఉంటాయి. ఈ స్టేషన్లో ఇద్దరు డిఎస్పీ స్థాయి అధికారులు, ఐదుగురు ఇన్స్పెక్టర్లు, పద్దెనిమిది మంది కానిస్టేబుల్స్ ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్ లతో పాటు ఒక సైబర్ నిపుణుడు ఉంటారు. ఈమధ్యకాలంలో మహిళలపై సైబర్ నేరాలు ఎక్కువైన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఒక సైబర్ నిపుణుడు ఈ దిశా స్టేషన్ లో అందుబాటులో ఉండడం మహిళలకు ఎంతగానో ఉపయోగకరమని చెప్పవచ్చు.

రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలతో పాటు 5 అర్బన్ జిల్లాలో మొత్తం 18 దిశా ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఈస్టేషన్లలో ఏదైనా నేరం నమోదు కాగానే దానిపై విచారణకి ఒక విచారణాధికారిని నియమిస్తారు. ఆ విచారణాధికారి ఒక వారం లోపే తన ప్రాధమిక విచారణ పూర్తి చేయాల్సివుంటుంది. మహిళల ఆత్మరక్షణ కోసం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన చర్యల్లో భాగంగా దిశా ప్రత్యేక చట్టం, దిశా న్యాయస్థానాలతో పాటు ఈ దిశా ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏర్పాటుతో దేశవ్యాప్తంగా మహిళా లోకం, మేధావులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Show comments