iDreamPost
android-app
ios-app

లాక్ డౌన్ ఎత్తివేతపై దీదీ సలహాలు.. కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందా..?

లాక్ డౌన్ ఎత్తివేతపై దీదీ సలహాలు.. కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందా..?

పశ్చిమబెంగాల్లో కరోనా వైరస్ కట్టడి చర్యల కోసం ప్రత్యేక బృందాన్ని పంపుతామని కేంద్ర ప్రభుత్వం చెప్పగా.. అందుకు ససేమిరా ఒప్పుకునేది లేదని తెగేసి చెప్పిన సీఎం మమతాబెనర్జీ తాజాగా లాక్ డౌన్ ఎత్తివేత పై కేంద్రానికి పలు సూచనలు చేసింది. లాక్ డౌన్ వల్ల పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన మమతా బెనర్జీ.. మే 3 తర్వాత లాక్ డౌన్ ను దశలవారీగా ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. మే 3 తర్వాత మొదటి వారంలో 25 శాతం, రెండో వారంలో 50 శాతం మేర లాక్ డౌన్ ను ఎత్తివేయాలని సూచనలు చేసింది.

ఈ నెల 27వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. లాక్ డౌన్ కొనసాగించాలా.? లేదా ఎత్తి వేయాలా అనే అంశంపై ముఖ్యమంత్రుల అభిప్రాయాలను ప్రధాని నరేంద్ర మోడీ తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన అభిప్రాయాన్ని ముందుగానే ప్రకటించడం విశేషం.

మొదటి విడత లాక్ డౌన్ ఈ నెల 14వ తేదీతో ముగిసింది. అయితే అంతకు వారం రోజుల ముందే ముందుగానే లాక్ డౌన్ ను మరో రెండు వారాల పాటు పొడిగించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ మొదటిసారిగా డిమాండ్ చేశారు. కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ పొడిగింపుకే మొగ్గు చూపాయి. కేంద్ర ప్రభుత్వం తో సంభందం లేకుండానే.. తెలంగాణ, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలు లాక్ డౌన్ ను ఈ నెలాఖరు వరకు పొడిగించాయి.

ఏప్రిల్ 11వ తేదీన ప్రధాని మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మెజారిటీ ముఖ్యమంత్రులు లాక్ డౌన్ ను పొడిగించాలని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న నరేంద్ర మోడీ లాక్ డౌన్ ను మే 3 వరకు పొడిగిస్తూ ఏప్రిల్ 14వ తేదీన ప్రకటించారు. మొదటి దశ ముగిసే సమయంలో ముఖ్యమంత్రుల నుంచి వచ్చిన అభిప్రాయాలకు భిన్నంగా రెండవ దశలో ముగిసే సమయంలో అందుకు భిన్నంగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ ను ఎత్తివేయాలని డిమాండ్ తెరపైకి తెస్తున్నారు. అయితే దేశంలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మమతా బెనర్జీ డిమాండ్ ను కేంద్రం ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటారు అనేది వేచి చూడాలి.

అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకుంటున్న చర్యలను పరిశీలిస్తే లాక్ డౌన్ ను దశలవారీగా ఎత్తివేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు రంగాలకు లాక్ డౌన్ నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేసుల సంఖ్య పెరిగినా అందుకు అనుగుణంగా పటిష్టమైన చర్యలు తీసుకుంటూ.. కరోనా వైరస్ ప్రభావం లేని ప్రాంతాలకు లాక్ డౌన్ నుంచి మరిన్ని మినహాయింపు లభించే అవకాశం ఉంది.