iDreamPost
iDreamPost
ఇప్పుడు అందరి దృష్టి హస్తినవైపు మళ్లింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం అంతా ఎదురు చూస్తున్నారు. దేశమంతా ఇప్పుడు ఢిల్లీ చర్చనీయాంశం అవుతోంది. వాస్తవానికి ఓ పెద్ద మునిసిపల్ కార్పోరేషన్ గా కనిపించే కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీ ఎన్నికలు సాధారణ పరిస్థితుల్లో పెద్దగా విశేషం కాదు. కానీ ప్రస్తుతం దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఢిల్లీ ఫలితాలు కీలక మలుపులకు మూలంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈసారి బీజేపీ హవా కనిపిస్తే ఇక దేశమంతా మోడీ మరింత చెలరేగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దానికి భిన్నంగా పార్లమెంట్ ఎన్నికల నాటిక కమల ప్రతాపం నీరుగారిపోయి కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొట్టేస్తే మరోసారి ప్రాంతీయ పార్టీల కూటమి చర్చకు వస్తుందనడంలో సందేహం లేదు.
ప్రస్తుతం దేశంలో మోడీ హవాకు పలు రాష్ట్రాల్లో అడ్డుకట్ట పడుతోంది. సాధారణ ఎన్నికలకు ముందు కూడా కీలక రాష్ట్రాలు చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ లలో వరుసగా బీజేపీ ఓటమి పాలయ్యింది. గుజరాత్ లో తృటిలో గండం నుంచి గట్టెక్కింది. అనంతరం సాధారణ ఎన్నికల్లో మోడీ హవా మళ్లీ కనిపించినా ఆ తర్వాత మహారాష్ట్రలో బీజేపీ అధికారం కోల్పోయింది. హర్యానాలో ప్రాంతీయ పార్టీ మద్ధతుతో మాత్రమే మళ్లీ గద్దెనెక్కింది. ఈనేపథ్యంలో ఢిల్లీ లో బీజేపీ 7 కి 7 పార్లమెంట్ సీట్లు గెలిచిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో హవా చాటడం అవసరంగా మారింది. అందుకు అనుగుణంగా పది మంది ముఖ్యమంత్రులు, మొత్తం మోడీ క్యాబినెట్ సహా 100 మందికి పైగా ఎంపీలు బీజేపీ కోసం పనిచేశారు. ఏకంగా ఈసారి ఎంపీలు పోలింగ్ ఏజెంట్లుగా కూడా వ్యవహరించారు. అయినా ఎగ్జిట్ పోల్స్ చీపురు హవాని చాటుతున్నాయి. ఇది కమలం గూటిలో కలకలాన్ని రేపుతోంది.
ఓవైపు ఎన్నార్సీకి వ్యతిరేకంగా దేశమంతా ఉద్యమాలు సాగుతున్నాయి. అన్నింటికీ షాహీన్ బాగ్ పెద్ద కేరాఫ్ గా మారింది. అక్కడి మహిళల ఉద్యమం పట్ల చివరకు కేంద్రమంత్రి కూడా గోలీమారో సాలోంకో అని నినదించడం, ఆవెంటనే కాల్పుల కలకలం రేగడంతో ఈ ఎన్నికలు ఓ రెఫరండం అనే అభిప్రాయం కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే బీజేపీ నేతలు భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కేజ్రీవాల్ మీద విమర్శలు గుప్పిస్తూనే పాకిస్తాన్ ని పదే పదే ప్రస్తావించారు. తద్వారా జాతీయతన రాజేసి ఈ ఎన్నికల్లో కూడా గట్టెక్కాలనే యత్నం సాగించారు.అ దే సమయంలో కేజ్రీవాల్ చాలా సహనంగా వ్యవహరించారు. తన సహజధోరణికి భిన్నంగా షాహీన్ బాగ్ పట్ల సైలెంట్ గా ఉన్నారు. తన సంక్షేమ పథకాలను మాత్రమే వల్లిస్తూ బీజేపీ మీద విమర్శనాస్త్రాలు సంధించారు. తద్వారా సామాన్యుడికి మరోసారి చేరువ కాగాలననే ధీమాతో కనిపించారు.
ఎన్నికలు ముగియడం, ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువడడం జరిగినా జనంలో సందేహాలు మాత్రం తీరలేదు. ముఖ్యంగా ఈవీఎం ల మీద అటు బీజేపీ నుంచి కూడా అనుమానాలు వ్యక్తమయిన తరుణంలో వ్యవహారం ఆసక్తిగా మారింది. తుది ఫలితాలు వెలువడే వేళ తదనంతర పరిణామాల పై చర్చలు సాగుతున్నాయి. స్వయంగా మోడీ రంగంలో దిగి ప్రచారం సాగించిన నేపథ్యం, అన్నీ తానై అమిత్ షా వ్యవహరించిన పరిస్థితుల్లో బీజేపీ విజయం సాధిస్తే ఇక దేశంలో ఆపార్టీ మరింత దూకుడు ప్రదర్శిస్తుందనడంలో సందేహం అవసరం లేదు. రాబోయే బీహార్, బెంగాల్ వంటి ఎన్నికల్లో పట్టు సాధించేందుకు పావులు కదుపుతుంది. అంతకుముందే ఎన్నార్సీ, సీఏఏ వ్యతిరేక ఉద్యమాలపై కఠినంగా వ్యవహరించడానికి సిద్ధపడుతుంది. కానీ దానికి భిన్నంగా కేజ్రీవాల్ గనుక విజయం సాధిస్తే వ్యవహారం మారిపోతుంది. దేశంలో మరోసారి ప్రత్యామ్నాయ నాయకత్వం చర్చ ముందుకు వస్తుంది కేజ్రీవాల్ పేరు ప్రతిష్టలు పెరుగతాయి. ఇప్పటికే సిసోడియాకి సీఎం సీటు కేటాయించి ఢిల్లీ పీఠంవైపు ఆయన దృష్టి పెడతారనే చర్చల నేపథ్యంలో దేశంలో ప్రాంతీయ పార్టీలకు కొంత ఉపశమనం దక్కుతుంది.
బీహార్ లో బీజేపీ మిత్రపక్షం జేడీయూ వంటి పార్టీలకు కొంత స్వరం పెంచే ఛాన్స్ వస్తుంది. బీజేపీ నేతలకు ప్రజల్లో కనిపిస్తున్న వ్యతిరేకత పెరుగుతుంది. సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక ఉద్యమాలు మరింత రాజుకుంటాయి. రాజకీయాలు వేగంగా మారే అవకాశం ఉంటుంది. కొత్త కూటములు ముందుకు వస్తే ఏపీ, తెలంగాణా ముఖ్యమంత్రులు కూడా కీలకంగా మారతారు. తద్వారా దేశమంతా ఢిల్లీ ఎఫెక్ట్ పడుతుంది. అదే క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు మార్పులు చూడవచ్చు.