iDreamPost
iDreamPost
ఏపీలో కరోనా పరిస్థితి కంట్రోల్ లో ఉన్నట్టే కనిపిస్తోంది. సమీప రాష్ట్రాలు తెలంగాణా, తమిళనాడుతో పోలిస్తే కేసుల సంఖ్యలోనూ , మరణాల విషయంలో కూడా ఏపీ లో తక్కువ మోతాదులో ఉంది. ఇప్పటి వరకూ నగరాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. తొలుత విశాఖ, తర్వాత విజయవాడ, ఇటీవల కర్నూలు, ప్రస్తుతం గుంటూరు నగరాల్లో కరోనా వ్యాప్తి కనిపిస్తోంది. కేసులు సంఖ్య ఆయా నగరాల్లోనే ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ కరోనా నామమాత్రంగా ఉండడానికి అనేక కారణాలున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో రెడ్ జోన్లను కూడా ప్రభుత్వం ప్రకటించింది. అలాంటి చోట్ల కఠిన చర్యలు అమలు చేస్తోంది.
వాస్తవ పరిస్థితులను గమనంలో ఉంచుకున్న సీఎం జగన్ తాజాగా పీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కీలక సూచనలు చేశారు. దేశంలో లాక్ డౌన్ కొనసాగించడం కన్నా దశల వారీగా ఉపసంహరించుకోవడంపై దృష్టి పెట్టాలని ఆయన సూచిస్తున్నారు. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించి గ్రీన్ జోన్లలో నిబంధనలు సులభతరం చేసేలా చర్యలుండాలన్నారు. పెద్ద సంఖ్యలో కాకుండా భౌతిక దూరం పాటించేందుకు అవకాశం ఉన్న రంగాల్లో పరిశ్రమలకు కూడా అనుమతిస్తే పరిస్థితి అదుపు తప్పకుండా నియంత్రవచ్చని సూచిస్తున్నారు.
ప్రధానితో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు భిన్నంగా సూచనలు చేసిన జగన్ తాజాగా ఏపీలో దానికి తగ్గట్టుగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రెండుసార్లు ఇంటింటీ సర్వే చేశారు. తొలుత విదేశాల నుంచి వచ్చిన వారి వివరాల కోసం ప్రయత్నించారు. అనంతరం అందరి విషయాలను గ్రామ సచివాలయ బృందాలు ఆరాతీశాయి. ఇప్పుడు ఆశా , పారా మెడికల్ బృందాలతో కలిసి వాలంటర్లు మరోసారి సర్వే చేస్తున్నారు. సమగ్ర వివరాలను సేకరించడం ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు మోనటరింగ్ చేయవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అదే సమయంలో రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ మాస్కులు అందించేందుకు పూనుకుంది.
సీఎం ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. ప్రతీ ఒక్కరికీ మూడు చొప్పున అందించేందుకు సుమారు 16 కోట్ల మాస్కుల పంపిణీకి చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 5.3 కోట్ల మందికి, ఒక్కొక్కరికీ 3 చొప్పున అందించేలా ప్రయత్నాలు మొదలయ్యాయి. బహిరంగంగా ఉమ్మి వేస్తే నేరంగా పరిగణిస్తామని ప్రకటించారు. మాస్కులు లేకుండా బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పేందుకు ఈ ప్రయత్నం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో కరోనా కేసులు అధికంగా ఉన్న జోన్లలో 45వేల కొవిడ్ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు వైద్యారోగ్యశాఖ సన్నాహాలు చేసింది. ఇప్పటికే వరకు 32,349 మందిని ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు రిఫర్ చేశారు. వారిలో 9,107 మందికి పరీక్షలు అవసరమని వైద్యులు నిర్ధారించారు. కానీ సీఎం జగన్ మాత్రం అందరికీ పరీక్షలు చేయాలని ఆదేశించారు. దానికి తగ్గట్టుగా 32,349 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాలని తాజాగా నిర్ణయించారు.
ఓవైపు అందరూ జాగ్రత్తలు పాటించేలా చూడడం, అనుమానితులందరికీ పరీక్షలు నిర్వహించడం ద్వారా కరోనా వ్యాప్తిని తగ్గించాలనే యత్నంలో ప్రభుత్వం ఉంది. అదే సమయంలో లాక్ డౌన్ విషయంలో ఇతర రాష్ట్రాలకు భిన్నంగా కొన్ని రంగాలు, కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు సడలించే దిశలో ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే కేంద్రం కూడా జగన్ ఆలోచనకు తగ్గట్టుగా జోన్ల వారీగా పరిస్థితిని నిర్ధారించి, మార్గదర్శకాలు రూపొందించే అవకాశం ఉందని చెబుతున్నారు. దాంతో కేంద్రం ప్రకటన వచ్చిన తర్వాత ఏపీలో పరిస్థితికి అనుగుణంగా జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్టు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.