iDreamPost
android-app
ios-app

దేశమంతా ఓడిపోయినా.. అక్కడ మాత్రం 60 ఏళ్లుగా..

దేశమంతా ఓడిపోయినా.. అక్కడ మాత్రం 60 ఏళ్లుగా..

మహారాష్ట్ర రాజకీయాలంటే.. వినిపించే పార్టీ పేర్లు.. కాంగ్రెస్, బీజేపీ, శివసేన, ఎన్సీపీ. ఈ పార్టీలు ఏలుబడిలో ఉన్న మహారాష్ట్రలోని ఓ ప్రాంతంలో మాత్రం సీపీఎం కంచుకోటగా ఉంది. దేశ వ్యాప్తంగా ఓటమి చవిచూస్తున్న సీపీఎంకు అక్కడ మాత్రం గత 60 ఏళ్లుగా విజయమే తప్పా ఓటమనేదే లేదు.

మహారాష్ట్రలో తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో.. పాల్గర్‌ జిల్లా దహాను నియోజకవర్గంలోని తలసరి తహసిల్‌ పంచాయత్‌ సమితి ( తెలుగు రాష్ట్రాల్లో మండల పరిషత్‌)ని సీపీఎం కైవసం చేసుకుంది. ఈ సమితిలో 1962 నుంచి ఇప్పటి వరకు సీపీఎం హవా కొనసాగుతోంది. తలసరి తహసిల్‌ పంచాయత్‌ సమితిలో ఉన్న పది పంచాయత్‌ స్థానాలకు గాను ఎనిమిది స్థానాల్లో ఎర్ర జెండా ఎగిరింది. సమీప ప్రత్యర్థులైన బీజేపీ, ఎన్‌సీపీలను మరో సారి సీపీఎం మట్టికరిపించింది.

మహారాష్ట్రలో స్వాతంత్రానికి పూర్వం కమ్యూనిస్టుపార్టీ, ఆలిండియా కిసాన్‌ సభ ఆధ్వర్యంలో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా వర్లి ఆదివాసీ ఉద్యమం జరిగింది. వర్లి ఉద్యమానికి థానే, పాల్గర్‌ జిల్లాలు కేంద్రాలుగా ఉన్నాయి. ఈ ఉద్యమ ప్రభావం ఇప్పటికీ కనిపిస్తోంది. అందులో భాగంగానే పాల్గర్‌ జిల్లా దహాను నియోజకవర్గంలోని తలసరి తహసిల్‌ పంచాయత్‌ సమితిని సీపీఎం దాదాపు 60 ఏళ్లుగా గెలుస్తూనే ఉంది. అంతేకాకుండా మహారాష్ట్ర శాసనసభకు సీపీఎం తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక ఎమ్మెల్మే కూడా ఈ ప్రాంతం నుంచే గెలుస్తున్నారు. దహాను నియోజవర్గం నుంచి 2014లో(బీజేపీ) మినహా 1978 నుంచి 2019 వరకు సీపీఎం అభ్యర్థులే గెలవడం గమనార్హం.