బాబుకు మరో నమ్మకమైన మిత్రుడు దొరికాడు

ఓ పార్టీ అధినేతను ఆ పార్టీ నేతలు అనుచరించడం, ఆయన నిర్ణయాలు సమర్థించడం, అనుకరించడం సర్వసాధారణం. కానీ ఓ పార్టీ అధినేత నిర్ణయాలు మరో పార్టీ అధినేత అనుకరించారంటే ఆయన శక్తి ఏమిటో తెలుస్తుంది. పరిపాలన, నీతి నిజాయతీ, ప్రజలకు మేలు చేయడం ఎలా ఉన్నా… చంద్రబాబు నాయుడు మరో పార్టీ నేతలను తన ఫాలోవర్స్‌గా మార్చుకోవడంలో మాత్రం ఆయనకు ఆయనే సాటి. దీనికి ఆయన వేసే మంత్రం ఏమిటో తెలియదు కానీ చంద్రబాబు… అధికారంలో ఉన్నప్పుడు గానీ, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గానీ ఆయన్ను ఇతర పార్టీల అధినేతలు అనుసరిస్తుంటారు.

అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్లపాటు చంద్రబాబు నిర్ణయాలను జనసేన అధినేత బలంగా సమర్థిస్తూ వచ్చారు. ఎంతలా అంటే.. చంద్రబాబు తనా అంటే.. పవన్‌ తందానా.. అనే స్థాయిలో బాబును పవన్‌ కల్యాణ్‌ అనుసరించేవాడు. అంతేకాదు బాబుకు ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే చాలు సినిమాలో గెస్ట్‌ రోల్‌ మాదిరిగా ప్రత్యక్షమై ప్రేక్షకులు లాంటి ప్రజలను ఆలరించి కాసేపు సినిమాలో హీరోను మరచిపోయినట్లు బాబుపై నుంచి ప్రజల దృష్టిని మరల్చేవారు. ఇప్పుడు జనసేనాని.. కమలంతో వికస్తుండడంతో బాబుకు మరో కొత్త మిత్రుడు అవసరమయ్యాడు.

ఇలా పవన్‌ దూరం అయ్యాడో లేదో.. అలా చంద్రబాబు.. సీపీఐ రామకృష్ణ ను సెట్‌ చేశారు. అమరావతి ఉద్యమం నుంచి వీరి బంధం ఫెవికాల్‌ మాదిరిగా తయారైంది. బాబు కన్నా.. రామకృష్ణనే ఆయన నిర్ణయాలను బలంగా చాటిచెబుతున్నారు. తాజాగా రామకృష్ణ చంద్రబాబు చేసిన డిమాండ్‌నే చేసి తన భక్తిని నిరూపించుకున్నారు. ప్రజలకు మూడు నెలల కరెంట్‌ బిల్లు రద్దు చేయాలని అలా చంద్రబాబు డిమాండ్‌ చేశారో లేదో.. ఇలా రామకృష్ణ అదే పాట అందుకున్నారు. అందుకోవడమే కాదు.. కరెంట్‌ బిల్లులు రద్దు చేయాలంటూ ముఖ్యమంత్రికి లేఖ కూడా రాశారు. రామకృష్ణ తన కుమారుడుకు టీడీపీ తరఫున రాజకీయ భవిష్యత్‌ కోసమే ఈ మార్గంలో నడుస్తున్నారన్న టాక్‌ ఉంది. బాబు వాడకం ముందు ఆయన ప్రయత్నాలు ఏ మాత్రం ఫలిస్తాయో 2024లో కానీ తెలియదు.

Show comments