రాష్ట్ర ప్రజలేమనుకుంటున్నారో మీకు తెలుసా నారాయణా..?

ఏపీ ప్రభుత్వంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్వరం పెంచుతున్నారు.. రాష్ట్ర ప్రభుత్వంతోపాటుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినీ విమర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధోగతిలో నడుస్తోందని, రాష్ట్రాన్ని జగన్ రివర్స్ గేర్‌లో పాలిస్తున్నారంటూ నారాయణ మాట్లాడుతున్నారు. అమరావతి ఆందోళనల్లో పాల్గొన్న నారాయణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి. ఒకవైపున రాయల సీమలో తమకు ఉద్యోగావకాశాలు లేవని, కనీసం దశాబ్ధాల కలగా ఉన్న హైకోర్టునైనా ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు నినదిస్తుండగా ఇటీవల జగన్ సర్కార్ రాయలసీమలో హైకోర్టుకు అంగీకరించింది. మరోవైపు ఎన్నో ఏళ్లుగా వివక్షకు, వెనుకబాటుకు గురవుతున్నామని ఉత్తరాంధ్ర ప్రజానీకం రోధిస్తోంది.

మరి.. దశాబ్ధాల పాటు పోరాటాలు చేసిన నారాయణకు ఈ విషయాలు తెలిసి మాట్లాడారా లేక తెలియక మాట్లాడారో తెలియదు గానీ రాష్ట్రంలోని 13జిల్లాల ప్రజానీకం మొత్తం అభివృద్ధి మొత్తం ఒకేచోట అమరావతిలో పెట్టాలని కోరిందంటూ ఈయన అమరావతిలో ఊకదంపుడు ఉపన్యాసాలు చేసేస్తున్నారు. రాష్ట్రం విడిపోయి రాజధాని లేని రోజున.. అంటే 2014 లోనే విశాఖ అన్ని హంగులు, సౌకర్యాలు, వాణిజ్యం, ఐటీ పరంగా అభివృద్ధి చెందిన నగరమని.. అక్కడే రాజధానిని ఏర్పాటు చేయాలని ఆప్రాంత ప్రజలతో పాటు నిపుణులు కోరారు. అలాగే గతంలో రాజధానిని కోల్పోయిన రాయలసీమ ప్రజలు ఇప్పటికైనా మా రాజధానిని మాకు ఇవ్వాలని కర్నూలులో ఏపీ రాజధానిని ఏర్పాటు చేయాలని గట్టిగా డిమాండ్ చేసారు. మరి ఈ విషయం నారాయణకు తెలియదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వానికి రాజధాని వికేంద్రీకరణ ఆలోచన రాలేదో లేక భవిష్యత్తులో వచ్చే ఉత్పన్నాలను ఊహించలేదో మరే ఇతర అత్యాశో తెలియదు కానీ 30వేల ఎకరాల భూ సమీకరణ చేసి అమరావతిలో రాజధానిని నిర్ణయించారు. అయితే నారాయణ స్వతహాగా వామపక్ష ఉద్యమ నాయకుడిగా, ఎన్నో భూ పోరాటాలు చేసిన వ్యక్తిగా ఆరోజున రైతులు భూములు ఇవ్వబోమని ఆందోళన చేసినపుడు వారి పక్షాన నిలబడి పోరాడలేకపోయారు. అయితే మళ్లీ అదే తప్పును ఇవాళ చేస్తున్నారు. రాజధాని వికేంద్రీకరణకు అమరావతిలోని ఓ వర్గం మినహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రజలు మద్దతు తెలుపుతుండగా నారాయణ మాత్రం అందుకు భిన్నంగా ప్రజల తరపున వితండవాదోద్యమం చేస్తున్నారు.

అసలు ఏ రాజకీయనాయకుడైనా ప్రజలను సంప్రదించకుండా వారి అభీష్టాన్ని వేదికలపై తెలపవచ్చా..? రాష్ట్రంలోని మిగిలిన రెండు ప్రాంతాల్లో పర్యటించకుండా వారి మనోభావాలను ప్రతిబింబింపచేయవచ్చా.. 13జిల్లాల ప్రజలను కలవకుండా వారి అభిలాషను మీరు వ్యక్తపరచవచ్చా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే బాధ్యత, అనుభవం ఉన్న నాయకుడివైతే మీ పార్టీ బృందంతో కలిసి అన్ని ప్రాంతాల్లోనూ పర్యటించాలని ఒక నిర్ధిష్టమైన నివేదిక తయారుచేసి ప్రభుత్వానికివ్వాలని నిజంగా ప్రభుత్వం మూడు ప్రాంతాల ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే మీరు ఉద్యమించాలని అలా ఉద్యమిస్తే మీకు ప్రజల మద్దతు ఉంటుందని విశ్లేషకులు సూచిస్తున్నారు.

మూడు పంటలు పండే 30వేల ఎకరాల సారవంతమైన భూముల్లో రెండు లక్షల కోట్లతో రాజధానిని నిర్మించుకునే ధనిక రాష్ట్రంలో మనం లేమనే వాస్తవాన్ని గమనించాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న విశాఖ నగరాన్ని వినియోగించుకుని రాష్ట్రంలో సంపద సృష్టించుకుని రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధించుకోవాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని అర్ధం చేసుకోకపోయినా పర్లేదు కానీ మీరు మా ప్రతినిధిగా మాట్లాడితే సహించబోమని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు హెచ్చరిస్తున్నారు. అయితే గతంలోనూ నారాయణ చాలా సందర్భాల్లో నోటికి వచ్చింది మాట్లాడి అనంతరం క్షమాపణలు కోరిన విషయం తెలిసిందే.

Show comments