iDreamPost
iDreamPost
ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా కరోనా గురించిన చర్చే కనిపిస్తోంది వినిపిస్తోంది. ఎవరైనా తుమ్మినా దగ్గినా చాలు అనుమానంగా చూసే పరిస్థితి వచ్చేసింది. రేపు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు తెలుగు సినిమాలు వస్తున్నాయి. అందులో రాజశేఖర్ అర్జున ఆఖరి నిమిషంలో వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన ఆరు మాత్రం గట్టిగా ఫిక్స్ అయిపోయి అడ్వాన్స్ బుకింగ్ కూడా మొదలుపెట్టేసుకున్నాయి. కాని దేనికీ స్పందన లేదు. కారణం ఒకే ఒక్క కరోనా అలియాస్ కోవిడ్ వైరస్.
ముఖ్యంగా భాగ్యనగరంలో సగటు పౌరులెవరూ సినిమా కోసం లైఫ్ ని రిస్క్ లో పెట్టే ఉద్దేశంలో లేరు. ప్రభుత్వం ఒక పక్క అన్ని చర్యలు తీసుకున్నామని ఒక్కటి తప్ప అన్ని నెగటివ్ కేసులే అని ప్రకటనలు చేసినా జనంలో భయం పోవడం లేదు. అందులోనూ సోషల్ మీడియా, న్యూస్ ఛానల్స్ పదే పదే దీని గురించి ఊదరగొడుతూ ఎక్కడా పబ్లిక్ ప్లేసులలో తిరగొద్దని, ఏసి గదుల్లో ఉండొద్దని, మాల్స్ కి దూరంగా ఉండమని సలహాలు ఇవ్వడంతో వాటి ప్రభావం బలంగా పడనుంది. దెబ్బకు రేపు ఈ చిన్న సినిమాలకు ఓపెనింగ్స్ ఎలా వస్తాయోనన్న భయం ట్రేడ్ లో మొదలైంది. మాములుగానే వీటికి పబ్లిక్ రావడం తక్కువ. అలాంటిది ఇప్పుడు కోరనా ప్రచారం వల్ల సినిమాకు వెళ్ళకపోతే మునిగేదేమి లేదన్న భావన ప్రేక్షకుల్లో ఉంటుంది.
అందులోనూ లొకేషన్ తో సంబంధం లేకుండా హైదరాబాద్ లో ఏ మల్టీ ప్లెక్స్ అయినా సింగల్ స్క్రీన్ అయినా ఆడియన్స్ ఫలానా ఏరియా నుంచే వస్తారని చెప్పడానికి లేదు. నలుమూలల నుంచి రాకపోకలు సాగుతూనే ఉంటాయి. ఎక్కడో మహేంద్ర హిల్స్ నివాసి మియాపూర్ థియేటర్ కు రావొచ్చు. హైటెక్ సిటీలో జాబ్ చేసే ఉద్యోగి అమీర్ పెట్ కార్నివాల్ కు వెళ్ళొచ్చు. కాబట్టి ఏదీ సేఫ్ కాదనే ఫీలింగ్ నగరవాసుల్లో బలంగా ఉంది. అసలే హిట్టు సినిమాలు లేక ఫీడింగ్ కోసం ఇబ్బందులు పడుతున్న ధియేటర్ల యజమానులకు పిలవని అతిధిగా వచ్చిన కరోనా గుండెల్లో గుబులు రేపుతోంది. రేపు రిలీజయ్యే సినిమాల కలెక్షన్ల ఫిగర్లను బట్టి కరోనా ఎఫెక్ట్ ఎంతమేరకు పడిందో క్లారిటీ వస్తుంది.