iDreamPost
iDreamPost
అవును. ఇప్పుడు అమెరికా అష్టకష్టాల్లో ఉంది. ఆదిలో మేల్కొనకుండా చేసిన అలసత్వం వారి మెడకు చుట్టుకుంది. దాంతో ఇప్పుడు అన్ని దేశాల నుంచి మందులు, మెడికల్ కిట్ల కోసం పెద్ద స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. చివరకు వివిధ దేశాలకు వెళ్లాల్సిన వాటిని కూడా దారి మళ్లిస్తుందనే విమర్శలున్నాయి. ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ దేశాలు అమెరికా మీద విమర్శలు చేశాయి. చైనా నుంచి తమకు రావాల్సిన మెడికల్ కిట్లు అమెరికా తరలించుకుపోయిందని వాపోయాయి. తాజాగా వారి జాబితాలో ఇండియా కూడా చేరింది. ఇప్పటికే మనదేశం నుంచి హైడ్రోక్సీ క్లోరోక్విన్ మందుల విషయంలో ట్రంప్ నోటిదురుసు అంతా చూశారు. ప్రతీకారం తప్పదని హెచ్చరించినప్పటికీ నరేంద్రమోడీ ప్రభుత్వం మాత్రం ట్రంప్ వ్యాఖ్యలకు బదులివ్వకుండానే మందులు పంపించేసింది.
ఇప్పుడు తాజాగా చైనా నుంచి తమిళనాడు రావాల్సిన మెడికల్ కిట్లు ఇతర సామాగ్రి ని కూడా అమెరికా తీసుకుపోవడం చర్చనీయాంశం అవుతోంది.స్వయంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.షణ్ముగం ఈవిషయం వెల్లడించారు. ‘భారత్ కోసం సిద్ధం చేసిన సరుకు అమెరికాకు వెళ్లింది. అందువల్ల రాపిడ్ టెస్ట్ కిట్ల రాక మరింత ఆలస్యమవుతుంది.’ అని మీడియా ముందు వాపోయారు. ఇప్పటికే దేశంలో మహారాష్ట్ర తర్వాత అత్యధిక కేసులతో తమిళనాడు తల్లడిల్లుతోంది. ఇప్పుడు వైద్య పరీక్షల కోసం రావాల్సిన కిట్లు కూడా ఆలశ్యం కావడంతో అల్లాడిపోతోంది. ఈ విషయంలో ఇప్పటి వరకూ కేంద్రం మాత్రం స్పందించలేదు.
కరోనా పరీక్షల నిమిత్తం లక్ష ర్యాపిడ్ కిట్లు కోసం తమిళనాడు ప్రభుత్వం చైనాకు ఆర్డర్ ఇచ్చింది. ఆ తర్వాత పరిస్థితిని గమనించి కేంద్రం ఇచ్చిన సూచనలకు అనుగుణంగా మరో లక్ష అదనంగా ఆర్డర్ ఇచ్చారు. ఏప్రిల్ మొదటి వారంలో అదనంగా మరో రెండు లక్షల కిట్లు కోసం ఆర్డర్ పంపించారు. ఇలా మొత్తం నాలుగు లక్షల కిట్లకోసం చైనాకు ఆర్డర్ చేసినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షణ్ముగం తెలిపారు. మాములుగా కరోనా నిర్ధారణకు 9 గంటల సమయం పడుతుండగా, ర్యాపిడ్ టెస్ట్ కిట్లతో అరగంటలోనే ఫలితం తెలుస్తుంది. ఆ కారణం చేతనే పెద్దసంఖ్యలో తమిళనాడు ప్రభుత్వం ఆర్డర్ పెట్టింది. తొలి విడతలో కనీసం 50 వేల కిట్లయినా వస్తాయని తమిళనాడు అధికారులు భావించారు. వీటిలో ఒక్క కిట్ కూడా ఇంత వరకు ఆ రాష్ట్రానికి చేరలేదు. దీంతో ఎక్కువ సమయం పట్టినా పిసిఆర్ టెస్ట్‌లనే తమిళనాడులో చేస్తున్నారు.
ఇప్పటికే చైనా నుంచి పీపీఈలో చెన్నై చేరాయి. వాటితో పాటుగా టెస్టింగ్ కిట్టు కూడా వస్తాయని తమిళనాడు ప్రభుత్వం ఆశించింది. కానీ అన్నిదేశాలకు పంపిస్తున్న వైద్య పరికరాలను తమకే కావాలంటూ అమెరికా నడిపిన మంత్రాంగంతో చైనా నుంచి అటు మళ్లుతున్నట్టు కనిపిస్తోంది. ఇది వివిధ దేశాలకు ఇబ్బందిగా మారింది. ఆయా సందర్భాల్లో అమెరికా తీరు మీద వివిధ దేశాల నేతలు మండిపడుతున్నారు. ఇప్పుడు మనదేశంలో కూడా అలాంటి పరిస్థితి ఉత్పన్నం కావడంతో కేంద్రం ఏ రీతిన స్పందిస్తున్న విషయం ఆసక్తికరంగా మారింది. మన దేశానికి సిద్ధం చేసిన మెడికల్ కిట్లు అటు మళ్లించిన అమెరికా, దానికి అంగీకరించి, ముందుగా ఆర్డర్ చేసిన వారికి నిరాశ మిగిల్చిన చైనా వ్యవహారం చివరకు తమిళనాడుకి గుదిబండగా మారుతోంది. కనీసం కేంద్ర ప్రభుత్వం అయినా స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.