iDreamPost
iDreamPost
ఉద్యోగుల వేతనాలపై కరోనా దెబ్బ పడింది. దాదాపుగా అన్ని ప్రభుత్వాలు ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్నాయి.దానిని అధిగమించే ప్రయత్నంలో వేతనాల సర్థుబాటు వైపు పయనిస్తున్నాయి.ఇప్పటికే తెలంగాణా ప్రభుత్వం కేటగిరీ వారీగా వేతనాలను వాయిదా పద్దతిలో చెల్లిస్తామని ప్రకటించగా తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా వేతనాలు విడతల వారీగా చెల్లిస్తామని ప్రకటించింది.అదే బాటలో ఏపీ సర్కారు కూడా జీవో విడుదల చేసింది.
గత రాత్రి ఆంధ్రాప్రభుత్వం విడుదలచేసిన జీవో నెంబర్ 26 ప్రకారం మార్చి నెల వేతనాలను రెండు విడతలుగా సర్థుబాటు చేసే యత్నం చేస్తోంది.అందుకు తగ్గట్టుగా వివిధ కేటగిరీలను బట్టి ఇప్పుడు కొంత వేతనం ఇవ్వాలని నిర్ణయించింది. మిగిలిన వేతనం తర్వాత చెల్లిస్తామని జీవోలో పేర్కొన్నారు.తెలంగాణా ప్రభుత్వ ఆర్థిక శాఖ విడుదల చేసిన జీవో నెం.27లో కూడా విడతల వారీగా చెల్లిస్తామని చెప్పారు.
తెలంగాణా ప్రభుత్వం ప్రస్తుతం ఎమ్మెల్యేలు,ఐఏఎస్ అధికారులకు 60 శాతం వేతనం ఇవ్వనున్నట్లు ప్రకటించింది . మహారాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలు,మంత్రులు,ముఖ్యమంత్రి వేతనంలో 60 శాతం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కానీ ఆంధ్రాలో మాత్రం జగన్ ప్రభుత్వం ముఖ్యమంత్రి, మంత్రులు,ఎమ్మెల్యేలు మరియు ఇతర రాజకీయ ప్రతినిధులకు వంద శాతం వేతనాలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. సివిల్స్ అధికారులకు మాత్రం 60 శాతం వేతనాలు, నాలుగవ తరగతి మినహా ఇతర క్యాడర్ లో ఉన్న సిబ్బందికి 50శాతం,నాలుగో తరగతి ఉద్యోగులకు 10 శాతం మాత్రం రెండవ విడతలో చెల్లిస్తామని స్పష్టం చేసింది.
CMFS ద్వారా ఇప్పటికే సమర్పించిన బిల్లులతో పాటుగా,తదుపరి బిల్లులలో కూడా ఇదే దామాషా ప్రాతిపదికన మార్చి నెల వేతనాలు చెల్లిస్తారు. పెన్షన్లకు కూడా ఇదే షరతు వర్తిస్తుందని ప్రభుత్వం చెబుతోంది.ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటుగా మహారాష్ట్ర కూడా అలాంటి నిర్ణయమే ప్రకటించింది. మొదటి విడతలో ప్రజాప్రతినిధులకు 60శాతం వేతనాలు, మిగిలిన వారిలో క్లాస్ A ,B ఉద్యోగులకు 50 శాతం,క్లాస్ C సిబ్బదికి 25 శాతం చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించించారు.
ప్రస్తుతం లాక్ డౌన్, కరోనా సహాయక చర్యలు వంటి వివిధ సమస్యలతో సతమతమవుతున్నాయి. అయితే వేతనాల్లో కోత కాకుండా ప్రస్తుతం కొంత జీతం చెల్లించి,మిగిలిన వేతనం తర్వాత చెల్లించేందుకు ప్రభుత్వాలు జీవో విడుదల చేయడం పట్ల కొంత అసంతృప్తి ఉన్నా మీడియాలో ప్రచారం జరిగినట్లు కోత కాకుండా తరువాత చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పటంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అత్యంత క్లిష్ట స్థితిలో ఉంది.కరువులో అధిక మాసం అన్నట్లు లాక్ డౌన్ మరింత ఆర్ధిక భారాన్ని తెచ్చింది. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఉద్యోగులకు సమస్యలు రాకుండా చూడాలని సంకల్పించింది. అందులో భాగంగా వీలయినంత వరకూ ఎవరికీ నష్టం కలగకుండా నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. సంక్లిష్ట సమయంలో కూడా సర్కారు గట్టెక్కే మార్గాలు అన్వేషిస్తూ అన్ని వర్గాలకు సమస్యలు రాకుండా చూడాలనే ప్రయత్నంలో జగన్ చొరవ అభినందనీయమని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.వాస్తవ స్థితిని అర్థం చేసుకుని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలన్నీ ప్రభుత్వానికి సహకరించాల్సి ఉంటుందని చెబుతున్నారు.