iDreamPost
android-app
ios-app

పశ్చిమలో కరోనా కలవరం.. ఏపీలో మొదటి స్థానం

పశ్చిమలో కరోనా కలవరం.. ఏపీలో మొదటి స్థానం

పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కలవరం మొదలైంది. నిన్నటి వరకూ ఒక్క పాజిటివ్‌ కేసూ నమోదు కాని పశ్చిమగోదావరిలో ఒకేసారి 14 కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. వీరందరూ ఢిల్లీలోని నిజాముద్దీన్‌ జమాత్‌ సదస్సుకు వెళ్లి వచ్చిన వారే కావడం గమనార్హం.

జమాత్‌కు రాష్ట్రం నుంచి 1,470 మంది హారయ్యారని అధికారులు నిర్థారించారు. వీరిలో 1,321 మందిని గుర్తించారు. వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న సోమవారం ఒక్క రోజే 17 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఢిల్లీతో సంబంధం లేని మరో నలుగురుకు కూడా కరోనా పాజిటివ్‌ తేలడంతో కేసుల సంఖ్య 44కు చేరింది. ఈ రోజు పశ్చిమ గోదావరి చెందిన 14 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య 58కి చేరుకుంది.

ఢిల్లీలోని జమాత్‌ కార్యక్రమానికి ఏపీ నుంచి వెళ్లిన 1470 మందిలో అన్ని జిల్లాలకు చెందిన వారు ఉండడం ఈ వైరస్‌ రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పట్టణాలకూ వ్యాపించింది. శ్రీకాకుళం జిల్లా నుంచి 18 మంది, విజయనగరం 15, విశాఖ 65, తూర్పుగోదావరి 66, పశ్చిమ గోదావరి 50, కృష్ణా 151, గుంటూరు 184, ప్రకాశం 232, నెల్లూరు 377, చిత్తూరు 49, వైఎస్సార్‌ కడప 60, అనంతపురం 30, కర్నూలు జిల్లా నుంచి 173 మంది చొప్పున ఢిల్లీకి వెళ్లి వచ్చారు. వీరందరూ ఆయా జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందిన వారు కావడంతో వారి నుంచి ఇతరులకు సోకిందేమోనన్న భయాందోళనలు నెలకొన్నాయి.

నిన్న మొన్నటి వరకూ అదుపలో ఉందనుకున్న కరోనా వైరస్‌ ఢిల్లీ ఘటనతో ఒక్కసారిగా జూలు విదిల్చింది. రాష్ట్రాన్నే చూట్టేస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న అత్యవసర సమీక్ష జరిపిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా మెలిగిన వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైద్య పరీక్షలు జపించుకోవాలని కోరారు. ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తామని, తద్వారా ఎవరికీ ఎలాంటి హాని జరగదని భరోసా ఇచ్చారు. ఎవరైనా ముందుకు రాకపోతే వారిని గుర్తించి ఆస్పత్రులకు తీసుకురావాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు 500 మంది అని ప్రారంభంలో అధికారులు అంచనా వేయగా ఇప్పుడు ఆ సంఖ్య రెండు రెట్లు పెరిగి 1500 మందికి చేరుకోవడం.. వారి నుంచి వైరస్‌ ఎంత మందికి వ్యాపించి ఉంటుందని ఊహించేందుకే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.