iDreamPost
android-app
ios-app

పేట లో ఒక్కడి తో మొదలై..

పేట లో ఒక్కడి తో మొదలై..

గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో తొలుత ఒక కేసుతో ప్రారంభమై కరోనా పాజిటివ్ కేసులు ప్రస్తుతం వంద దాటడం అందోళన కలిగిస్తుంది. తొలుత కరోనా వ్యాధి సోకిన వ్యక్తిని ప్రారంభంలోనే గుర్తించేటప్పటికే ఆతని ద్వారా వైరస్ చాలా వేగంగా పలువురికి విస్తరించింది. కారణం ఆ పాజిటివ్ గా వచ్చిన వ్యక్తి లోకల్ కేబుల్ నెట్వర్క్ లో కలెక్షన్ ఎజంట్ గా అనేక మంది తో కలవడమే. సదరు వ్యక్తి కి కరొనాపాజిటివ్ అని నిర్ధారణ అయిన వెంటనే అధికార యంత్రాంగం అప్రమత్తమై నరసరావుపేట పట్టణానికి ఎలా కరోనా విస్తరించిందన్న అంశమై దృష్టిసారించారు. ఈక్రమంలో పలువురిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించే లోపే వైరస్ వేగంగా వ్యాపించడంతో అనుమానితుల నమూనాలు తీసి పరీక్షలు చేయిస్తే ఎక్కువ మంది కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తేలింది. వైరస్‌ సోకిన వారిలో ఐదుగురు వైద్యులు, ఒక వాలంటీరు కూడా ఉన్నారు. మొదటగా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులు ఎవరెవరి కలిశారనే సమాచారం పూర్తిస్థాయిలో యంత్రాంగానికి చెప్పకపోవడం వైరస్‌ కట్టడిలో అడ్డంకిగా మారింది. ఈ విషయంలో తొలుత కొంత జాప్యం జరగడం వల్ల వ్యాధి తీవ్రత పెరగడానికి దోహదమైంది.

అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం వైరస్ వ్యాపించిన క్రమం ఒకసారి చూస్తే మొదట గుంటూరు నగరానికి చెందిన వ్యక్తి నుంచి నరసరావుపేట పట్టణంలోని ఒక వ్యక్తికి కరోనా సోకింది. అతని ద్వారా ఐదుగురు కుటుంబసభ్యులకు విస్తరించింది. వీరి కుటుంబసభ్యుల నుంచి ఒక హోంగార్డుకు వైరస్‌ సోకింది. అతని కుటుంబ సభ్యులకు వైరస్‌ అంటింది. అతను అనారోగ్యంతో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడంతో అక్కడి వైద్యులు, సిబ్బందితోపాటు ఇతరులకు కలిపి 15 మందికి వ్యాధి విస్తరించింది.

పట్టణంలో తొలుత కరోనా వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యుల నుంచి మరో 8 మందికి వ్యాధి విస్తరించింది. ఈ ఎనిమిది మందిలో ఐదుగురి నుంచి ఒక్కరికీ విస్తరించలేదు. మిగిలిన ముగ్గురిలో ఒక వ్యక్తి నుంచి ముగ్గురికి, ఒక వ్యక్తి నుంచి నలుగురికి, మరో వ్యక్తి నుంచి ఆరుగురికి విస్తరించింది. అక్కడి నుంచి పదుల సంఖ్యలో వ్యక్తులకు వైరస్‌ వ్యాపించింది. సుమారు 60 మందికిపైగా వ్యాధి ఎలా వ్యాపించందన్న విషయమై యంత్రాంగం గుర్తించింది. ఇలా వ్యాధి బారిన పడినవారికి తెలిసేలోపే మరికొంతమందిని కలవడంతో కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపొయింది. ప్రస్తుతం నరసరావుపేటలో కేసుల సంఖ్య 115 కు చేరింది. క్వారంటైన్‌కు పంపిన అందరికీ పరీక్షలు పూర్తయితే మరిన్ని కేసులు వచ్చే అవకాశముందని అధికార యంత్రాగం భావిస్తోంది.

అయితే ప్రభుత్వం మాత్రం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అనుమానితులందరిని పెద్ద ఎత్తున క్వారంటైన్ కేంద్రాలకుకి తరలించడం, అనుమానితులందరికీ పెద్ద ఎత్తున పరీక్షలు చేయడంతో మొదట కొంత వేగంగా కేసులు బయటపడినప్పటికి.. భాదితులందరిని గుర్తించడం ద్వారా వైరస్ వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నామని కనుక ఎవరూ అందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలియజేశారు. అలాగే నర్సరావుపేటలో మునిసిపల్ కమీషనర్ గా భాద్యతలు నిర్వహించిన బి .శివా రెడ్డి కరోనా కట్టడి విధుల్లో సమర్దవంతంగా పని చేయని కారణంగా ఆయనని బదిలీ చేస్తూ కొత్త మునిసిపల్ కమీషనర్ గా వెంకటేశ్వరరావుని నియమించారు. ఈ నెపధ్యంలో వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా రెండు రోజుల పాటు ప్రజలెవరు బయటకి రాకుండా పట్టణంలో కర్ఫ్యూ విధించారు.