Idream media
Idream media
కరోనాకి మతం లేదు. మనుషులందరూ దానికి సమానమే. అది మనుషులకి మాత్రమే వస్తుంది. మనుషులుగా పుట్టడం మన దురదృష్టం.
ఒక మతం వాళ్లు ఢిల్లీలో సమావేశం కావడంతో కరోనా దేశమంతా వ్యాపిస్తోందని కొందరు దుర్మార్గమైన పోస్టులు పెడుతున్నారు. ఆ సమావేశం జరగడానికి ముందు కొన్ని వేల మంది విదేశాల నుంచి వచ్చారు. వాళ్లని సరిగా చెక్ చేయకుండా వదిలేశాం. అసలు తప్పు అది.
దాన్ని వదిలేసి , వీళ్ల నిర్లక్ష్యం వల్ల కరోనా వ్యాపించిందని అన్యాయమైన ప్రచారం జరుగుతోంది. కరోనా అంటించుకుందామని ఎవరూ సమావేశాలకు వెళ్లరు. కరోనా వస్తే మొదట ఇబ్బంది పడేది వాళ్ల కుటుంబ సభ్యులు, సన్నిహితులే. ఎవరూ కూడా తమ వాళ్ల జీవితాలను రిస్క్‌లోకి పడేయరు. జరిగింది దురదృష్టకరమైన సంఘటన మాత్రమే. దానికి ఒక మతాన్ని బాధ్యులుగా చేయాలని చూడడం మూర్ఖత్వం మాత్రమే.
ఆ మత సమావేశం జరుగుతున్న సమయంలో దేశంలోని ఇతర మతాల ప్రార్థనాలయాలు తెరిచే ఉన్నాయి. అక్కడ జరగడం, ఇక్కడ జరగకపోవడం కేవలం యాదృచ్ఛికమే.
లక్షల మంది కూలీలు రోడ్ల మీద నడిచారు. వాళ్లలో ఎవరు ఏ మతస్తులో తెలియదు. వాళ్లని అలా రోడ్లు పాలు చేసిన వాళ్లలో అన్ని మతాల వారు బాధ్యులుగా ఉన్నారు. ప్రతి సంఘటనకి మతం రంగు పులమడం సోషల్ మీడియాలో పోస్టు చేయడం. ఆ వైరస్ కరోనా కంటే వేగంగా విషం చిమ్ముతోంది.
ఒక ఎమ్మెల్యే బాధ్యత లేకుండా కాల్చి పారేయాలని అంటాడు. ఆయనదేం పోయింది భద్రతతో బందోబస్తు మధ్య ఉంటాడు. గల్లీలో ఇరుగుపొరుగున జీవించే వాళ్లు అనుమానాలతో బతుకుతారు ఆయన మాటలతో.
కరోనా పేదవాళ్ల బతుకుల మీద కొట్టింది. ముస్లింలలో ఎక్కువ మంది పేదవాళ్లు. ఉదయం దొరికిన కాసింత సమయంలోనే కూరగాయలు , పండ్లు అమ్ముకుంటూ జరుగుబాటు కొసం పోరాడుతున్నారు. కొత్త అనుమానాలు పుట్టించి నోటికాడ అన్నం తీయకండి.
బందీలుగా ఇల్లే జైలుగా మారిన వాళ్లం. డిప్రెషన్‌తో పోరాటం చేస్తున్నాం. దీనికి మతం ఆయుధం కాదు.
మనిషిగా జీవిస్తే, కరోనాతో పోయినా బతికే ఉంటాం.