Idream media
Idream media
కరోనా విధ్వంసం సృష్టిస్తోంది. అదే సమయంలో కొందరు వృద్ధుల్లో ఆనందాన్ని కూడా కలిగిస్తోంది. మానవీయ కోణంలో నుంచి చూస్తే కరోనాతో వింతలు, విడ్డూరాలు ఏర్పడుతున్నాయి.
20 ఏళ్ల క్రితం మనకు పట్టణీకరణ ప్రారంభమైంది. ఉద్యోగాలు, వ్యాపారాలు, కూలీ కోసం వలస మొదైలంది. ఇది ఇప్పుడు ఏ స్థాయికి చేరిందంటే పల్లెలన్నీ ఖాళీ అయిపోయాయి. రాయలసీమలోని అనేక గ్రామాల్లో ఇళ్లకి కాపలాగా ముసలి వాళ్లు మాత్రమే ఉంటున్నారు. పిల్లలంతా బెంగళూరు, హైదరాబాద్, ముంబయ్‌లలో రకరకాల పనులు చేసుకుంటున్నారు. సంక్రాంతి, దసరాకి తప్ప వీళ్లెప్పుడు పల్లెకి రారు. వచ్చినా రెండుమూడు రోజులే. ఆ రోజుల్లో నిజంగా ముసలి వాళ్లకి పండగే. పిల్లల్ని , మనుమల్ని ఆనందంగా చూసుకుంటారు. ఏదైనా తీవ్ర అనారోగ్యం వస్తే తప్ప వీళ్లు పిల్లల దగ్గరికి వెళ్లి నగరాల్లో ఉండరు.
కరోనా వచ్చింది. నగరాల్లో పనులు, వ్యాపారాలు బంద్. జనసమ్మర్థంలో ఉంటే కరోనా వస్తుందనే భయం. దాంతో అంతా సొంత ఊళ్లకి చేరుకుంటున్నారు. స్కూల్‌కి సెలవులు వచ్చినా నగరాల్లో పిల్లలు బయటకు వెళ్లలేని స్థితి. పల్లెల్లో కరోనా భయం ఇంకా రాలేదు కాబట్టి స్వేచ్ఛగా ఆడుకుంటున్నారు.
చాలా కాలం తర్వాత పిల్లలు ఇళ్లు చేరి , ఇంకా కొంత కాలం నగరాలకు వెళ్లే మూడ్‌లో లేకపోయే సరికి , ముసలి వాళ్లకి చాలా కాలం తర్వాత కనులపండుగగా ఉంది. ఒక రకంగా దసరా ముందే వచ్చింది.