Idream media
Idream media
అనుకున్నట్టు కాకపోయినా ఏప్రిల్ నెలాఖరుకు అయినా లాక్‌డౌన్ ముగుస్తుంది. అప్పుడు మొదలవుతాయి సినిమా కష్టాలు. సిద్ధంగా ఉన్న సినిమాలు ఒకొక్కటి విడుదలవుతాయి. అయితే ఇన్నాళ్లు కరోనా భయానికి అలవాటు పడిన జనం మళ్లీ ఎప్పటిలా వస్తారా? థియేటర్లు హౌస్‌ఫుల్ అవుతాయా? 300 మందితో కిక్కిరిసిపోయిన హాల్‌లో చూడటానికి ఇష్టపడతారా? ఇవి సినీ వర్గాలని పీడిస్తున్న సమస్యలు.
అసలే అరకొరగా నడుస్తున్న థియేటర్లు , ఈ సంక్షోభం తర్వాత కనీసం 100కు పైగా మూతపడతాయని అంచనా. వాస్తవానికి అన్ని సినిమాలు ఏదో రకంగా రిలీజ్ అయిన రోజే నెట్లో లీక్ అవుతాయి. అయితే థియేటర్లో చూస్తే ఆ థ్రిల్లే వేరనే ఫీలింగ్‌తో ఇన్నాళ్లు జనం థియేటర్‌కి వచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రిస్క్ ఎందుకని, Bad Quality అయినా సరే నెట్‌లో డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంది.
ఇక చిన్న సినిమాలకైతే థియేటర్ వరకు అసలు రారు. అవన్నీ ఎలాగూ అమేజాన్‌లో లేదా ఇంకో ప్లాట్‌ఫామ్‌లో వచ్చేస్తాయి. అప్పుడు చూడొచ్చు అనుకుంటారు. కరోనా భయాన్ని బట్టి , సినిమా భవిష్యత్ ఉంటుంది.
ఇదిలా ఉంటే ఇతర కష్టాలు చాలా ఉన్నాయి. అన్ని సినిమా షూటింగ్‌లు కనీసం మూడు నెలలు రీషెడ్యూల్ అవుతాయి. హీరోల డేట్స్ అన్నీ మారిపోతాయి. జూన్‌లో ప్రారంభం కావాల్సిన సినిమాలన్నీ సెప్టెంబర్‌కి వెళ్లిపోతాయి. హీరోతో పాటు అందరి డేట్స్ అడ్జెస్ట్‌మెంట్ కష్టం కాబట్టి చాలా మంది Actors ని మార్చేయాల్సి ఉంటుంది.
సినిమా అంటే లిక్విడ్ క్యాష్. షూటింగ్ ముగిసిన ప్రతి సాయంత్రానికి చాలా డబ్బు పేమెంట్ చేయాలి. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో డబ్బు పుట్టడం కష్టం. ఇదీ కాకుండా ఆల్రెడీ ఫైనాన్షియర్ల వద్ద అప్పు తీసుకున్న నిర్మాతలకి వడ్డీలు పెరిగి ఒత్తిడి పెరుగుతుంది. దాంతో కొన్ని సినిమాలు శాశ్వతంగా ఆగిపోవచ్చు. కరోనాతో ఒక ఉపయోగం కూడా ఉంది. అనవసర ఖర్చులు తగ్గుతాయి. అవసరం లేకపోయినా విదేశాల్లో షూటింగ్ పెట్టి దుబారా చేసేవాళ్లు. ఇప్పుడు అవన్నీ ఆగిపోతాయి.
దేశీయ మార్కెట్‌లో మెరుగుపడితే చాలదు. ఇపుడు అన్ని సినిమాలు ఎంతోకొంత ఓవర్సీస్ మార్కెట్ చేసుకుంటుంటాయి. ముఖ్యంగా అమెరికా కోలుకుంటేనే పెద్ద సినిమాలకి డబ్బులు. లేదంటే ఇబ్బందే. కరోనా మన సినిమాల్లో కొత్త కథలు సృష్టిస్తుందేమో చూడాలి.