Idream media
Idream media
కరోనా వస్తే జీవితం ఆగుతుందేమో తెలియదు కానీ, కరోనా భయంతో జీవితం ఆగదు.
అనంతపురంలో బుధవారం ఉదయం కనిపించిన దృశ్యాలివి. నీలిమా టాకీస్ రైల్వే గేటు దగ్గర ఒక 30 ఏళ్ల అమ్మాయి పుచ్చుకాయల బండి బరువుగా తోస్తూ ఉంది. 30 కాయలుంటాయి. బండితో కలిసి కనీసం 50 కిలోల బరువు. బండి పాతదేమో హఠాత్తుగా చక్రం ఒరిగిపోయింది. కాయలన్నీ నేలపాలు. కొన్ని పగిలిపోయాయి. ఒక పోలీస్‌తో సహా అందరూ పరుగెత్తుకెచ్చారు. చిన్న ఊరు కదా, మనిషికి మనిషి సాయం అని ఇంకా మరిచిపోలేదు.
బండిని నిలబెట్టడానికి ప్రయత్నిస్తే కుదర్లేదు. తలా ఒక చేయి వేసి కాయల్ని రోడ్డు పక్కన పోగేశాం. నా ఫోన్ తీసుకుని ఏడుస్తూ భర్తకి చేసింది. “వద్దంటే బండి తీయమన్నావ్, తొందరగా రా, కాయలు రోడ్డు మీద ఉన్నాయి, బండి విరిగిపోయింది”
తలా ఒక కాయ తీసుకుని ఆమెకి కొంత భారం తగ్గించాం. చేతిలోని నోట్లు వైపు నిరాశగా చూసింది. ఎండలో బండి తోసుకుంటూ వచ్చిందంటే ఇంట్లో ఆకలిగొన్న చిన్న బిడ్డలున్నారేమో!
రైల్వే స్టేషన్ దగ్గర సందులో ఒకావిడ భయంభయంగా బండిలో దోశలు పోస్తూ ఉంది. ముగ్గురు నలుగురు ఆకలితో తింటున్నారు. ఒక కంట్లో బతుకు భయం, ఇంకో కంట్లో పోలీస్ భయం.
ఒక ముసలాయన నిమ్మకాయ జ్యూస్ బండి తోస్తున్నాడు. ఆ మొహంలో జీవకళ లేదు. నిమ్మకాయలు మాత్రం బంగారు రంగులో మెరుస్తున్నాయి.
కత్తులు సానబెట్టే చక్రాన్ని భుజాల మీద మోస్తూ , మూసి ఉన్న తలుపుల్ని చూస్తూ ఇద్దరు వ్యక్తులు తిరుగుతున్నారు దిగులుగా.
వాడిపోతున్న ఆకు కూరల మీద నీళ్లు చల్లుతూ ఒకావిడ చంకలో బిడ్డకు బిస్కెట్ తినిపిస్తూ ఉంది.
ఒకాయన పది రూపాయలకు ఒక కర్బూజ అని గొంతు అరిగేలా అరుస్తున్నాడు. వ్యాన్ నిండా కర్బూజలు ఉన్నాయి. 11 గంటల్లోపు అమ్మాలి. ఆ వ్యాన్ ఒక శిథిల రథంలా ఉంది.
మెకానిక్ షాపులో బండ్లకు గాలి పడుతూ , పంక్చర్లు వేస్తున్నాడు. ఫస్ట్ రోడ్‌లో తెరవని శివుడి గుడి ముందు ఒక సాధువు పదాలు పాడుకుంటూ ఉన్నాడు.
ఎప్పటికైనా బొమ్మ పడుతుందా అని నీలిమా టాకీస్ గత కాలపు జ్ఞాపకంలా కనిపించింది.
లోకం పోకడ తెలియని ఒక పసిబిడ్డ నవ్వుతూ దారిన వెళుతున్న కుక్కని పిలుస్తోంది.
మనుషులంతా దిగులుగా ఎందుకున్నారో తెలియక కుక్క తికమకగా చూస్తోంది.