ఒక్కరోజులో 10,667 పాజిటివ్ కేసులు-380 మరణాలు
కరోనా వైరస్ ప్రస్తుతం దేశాన్ని వణికిస్తోంది.. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైరస్ ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజుకి 10 వేలకు పైగా కేసులు, 300 పైగా మరణాలు సంభవించడం నిత్యంగా మారింది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 10,667 పాజిటివ్ కేసులు నిర్దారణ కాగా, 380 మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 3,43,091 కి చేరింది. అంతేకాకుండా మరణాల సంఖ్య 9900 కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న దేశాల్లో భారత్ నాలుగవ స్థానంలో కొనసాగుతోంది. కరోనా వైరస్ బారినుండి 1,80,013 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 1,53,178 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
దేశంలో వైరస్ బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య ప్రతిరోజు పెరుగుతుండటం ఊరటనిస్తోంది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 52.5శాతంగా ఉంది. దేశంలో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరోసారి సమీక్ష నిర్వహించనున్నారు.